లులు కంపెనీకి విలువైన ప్రభుత్వ/ఆర్టీసి భూములు కట్టబెట్టే జివో 137 రద్దు చేయాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 28 జూలై, 2025.

 

లులు కంపెనీకి విలువైన ప్రభుత్వ/ఆర్టీసి 

భూములు కట్టబెట్టే జివో 137 రద్దు చేయాలి

విశాఖలో 13.83 ఎకరాలు ప్రభుత్వ భూములను, విజయవాడలో 4.15 ఎకరాల ఆర్టీసీ భూములను బహుళజాతి సంస్థ లులుకి కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 137 జీవోను తక్షణమే రద్దు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. లులును ప్రోత్సహించడమంటే వేలాది మంది చిన్న వ్యాపారులను, లక్షలాది మంది ఉపాధిని దెబ్బకొట్టడమే.

ఆర్టీసీ, ప్రభుత్వ రంగ ఆస్తులను కాపాడవలసిన ప్రభుత్వమే వాటిని నాశనం చేయటం తగదు. ఆర్టీసీకి చెందిన విలువైన భూములను విజయవాడలోనూ, అలాగే విశాఖలోని ప్రభుత్వ భూములను లులు మాల్‌ కోసం కేటాయించడం సరికాదు. నామమాత్రపు లీజుతో 99 సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వటం అంటే ఆ విలువైన భూములను ఆయా సంస్థలకు ఉచితంగా కట్టబెట్టడమే. 

ఇప్పటికే చిన్న, మధ్య తరగతి వ్యాపారులు సంక్షోభంలో ఉన్నారు. రిటైల్‌ వర్తక రంగంలోకి బడా కంపెనీల ప్రవేశంతో చిన్న, మధ్యతరగతి వ్యాపార రంగం ఇప్పటికే దెబ్బతిన్నది. లులు వంటి అంతర్జాతీయ కంపెనీలతో పూర్తిగా నాశనమవుతుంది. బడా కంపెనీలకు రాయితీలు ఇస్తున్న పాలకులు, చిన్న, మధ్యతరగతి  వ్యాపారులపై పన్నులు పెంచుతున్నారు, వేధిస్తున్నారు. ఫలితంగా అనేక వ్యాపార సంస్థలు మూతపడుతున్నాయి. ఉపాధి దెబ్బతింటున్నది. ఈ తరుణంలో చిన్న, మధ్యతరగతి వ్యాపారులను దెబ్బతీసే రీతిలో లులు మాల్‌కు కారు చౌకగా భూములు పందేరం చేయడం గర్హనీయం.

కావున రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి, జీవోని రద్దు చేయాలి. ప్రభుత్వ, ఆర్టీసీ స్థలాలను కాపాడాలి. చిన్న, మధ్య తరగతి వ్యాపారులను రక్షించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి