(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు స్వర్ణాంధ్ర పి`4 ఫౌండేషన్ ఛైర్మన్‌కి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 30 జూలై, 2025.
శ్రీ సిహెచ్.కుటుంబరావు గారికి,
వైస్ ఛైర్మన్, స్వర్ణాంధ్ర పి-4 ఫౌండేషన్,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: పి-4 పేరుతో టీచర్లు, సచివాలయ ఉద్యోగులను దత్తత తీసుకోవాలని ఇచ్చిన మెమోలపై వాస్తవాలు వివరించాలని కోరుతూ...
అయ్యా!
పి`4పై మీరిచ్చిన వివరణ చూశాక ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.
గత కొన్నాళ్ళుగా రాష్ట్రంలో పి-4 పేరుతో పేదరికం నిర్మూలన చేస్తామని, సంపన్నులు మార్గదర్శకులుగా 20 లక్షల బంగారు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది. కార్పొరేట్లు, సంపన్నుల నుండి తగినంత స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఆ భారాన్ని ఉద్యోగులపై వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనపడుతున్నది. దీనికి సంబంధించి జూలై 25, 2025న ఏలూరు జిల్లా డిఈవో, విజయనగరం జిల్లా సాలూరు పురపాలక సంఘం కమిషనర్ మెమోలు కూడా జారీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ సిపిఐ(యం) జూలై 27న ప్రకటన కూడా విడుదల చేసింది.
కానీ మీరు ఏ జిల్లా అధికారి కూడా మెమోలు జారీ చేయలేదని, ఇదంతా అవాస్తవమని, పి-4 పథకం కేవలం స్వచ్చందమని చెబుతున్నారు. ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి (డిఈవో), సాలూరు మున్సిపల్ కమిషనర్ విడుదల చేసిన మెమోలు మీకు ఈ ఉత్తరంతో పాటు జతపరుస్తున్నాను. ఇవి తప్పుడువైతే సంబంధిత అధికారులపై చర్య తీసుకోండి. లేదా వాస్తవమైతే అంగీకరించండి. లేదా ఫేక్ అయితే ఖండన ఇచ్చి బాధ్యులను బహిరంగ పర్చండి. ఈ పని చేయకుండా విమర్శలను ఖండిరచడం న్యాయం కాదు.
కార్పొరేట్లు, పెద్ద కంపెనీలు ఎగ్గొట్టిన పన్నులు, బ్యాంకు రుణాలు ప్రభుత్వం చిత్తశుద్ధితో వసూలు చేస్తే పేదలకు అవసరమైన సౌకర్యాలు ప్రభుత్వమే ఏర్పాటు చేయవచ్చు. దానికి బదులు రాష్ట్ర సంపదను సంపన్నులకు ధారాదత్తం చేస్తూ వారు దయతో ఇచ్చే దానాల ద్వారా పేదరికం పోగట్టలేమని మీవంటి ఆర్థిక నిపుణులకు కూడా తెలుసు. కావున మీరు ప్రజలకు వాస్తవాలు వివరించాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
జతపర్చబడినవి :
(1) ఏలూరు జిల్లా విద్యాశాఖ (డిఈవో) విడుదల చేసిన మెమో.
(2) విజయనగరం జిల్లా సాలూరు మున్సిపల్ కమిషనర్ విడుదల చేసిన మెమో.
