వ్యవసాయ భూమి పరిరక్షణకు చట్టం చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 22 ఆగస్టు, 2025.

వ్యవసాయ భూమి పరిరక్షణకు చట్టం చేయాలి.

నాలా చట్టం రద్దుపై రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలతో సమావేశం జరపాలి.

` సిపిఐ(యం) డిమాండ్‌

నాలా చట్టాన్ని రద్దు చేయాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో వ్యవసాయ భూమి పరిరక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని, దీనిపై రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలతో చర్చించిన అనంతరమే నాలా రద్దు అమలు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి డిమాండ్‌ చేస్తోంది. కేవలం రియల్‌ ఎస్ట్టేట్‌ ప్రయోజనం కోసం నాలా రద్దు చేయడాన్ని సిపిఐ(యం) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

ఇప్పటికే కార్పొరేట్ల కోసం రాష్ట్రంలో విచ్చలవిడిగా భూ సేకరణ జరుగుతుంది. వ్యవసాయోగ్యమైన భూములను కంపెనీలకు అప్పగిస్తున్న ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా వివిధ ప్రాంతాలలో రైతులు ఉద్యమిస్తున్నారు. రైతుల అభిప్రాయాలకు భిన్నంగా  నాన్‌ ఆగ్రికల్చరల్‌ ల్యాండ్‌ అసెనెమెంట్‌ యాక్టు (నాలా) `2006 చట్టాన్ని రద్దు చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడాన్ని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.గత ప్రభుత్వం 2020లో సగం ఊపిరి తీయగా మిగతాది ఈ ప్రభుత్వం తీసింది. వ్యవసాయ భూమిని రక్షించాలనే లక్ష్యం దెబ్బతిన్నది. వ్యవసాయ భూములను కార్పొరేట్‌ కంపెనీలకు సులభంగా అప్పగించేందుకే ఈ చట్టాన్ని రద్దు చేసారు. వ్యవసాయ రంగం, రైతుల అబివృద్ధి పట్ల చిత్తశుద్ధి వుంటే వ్యవసాయ భూముల పరిరక్షణకు చట్టం చేయాలని సిపిఐ(యం) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది. ప్రతి సంవత్సరం సాగుభూమి విస్తీర్ణం, ఆహార పంటల సాగు తగ్గిపోతున్న స్థితిలో వ్యవసాయ భూములను కాపాడాల్సిన అవసరం వుంది.

ఈ నేపధ్యంలో భూ వినియోగం విధానాన్ని (లాండ్‌ యూజ్‌ పాలసీ) ప్రభుత్వం రూపొందించాలి. ఏ రకం భూములను ఎందుకోసం వినియోగించాలన్న దానిపై స్పష్టమైన ప్రభుత్వ విధానం వుండాలి. వాటిని అతిక్రమించిన వారిపై కఠినచర్యలు తీసుకునేటట్లు ఇందులో నిబంధనలు రూపొందించాలి. గ్రామ సభలకు తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి  సైతం వీటిని అతిక్రమించే హక్కు ఉండకూడదు.

నాలా చట్టం రద్దుపై రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ప్రతినిధులతో తక్షణమే సమావేశం జరిపి వారి అభిప్రాయాలను తీసుకోవాలి. ఈ చట్టం అమలులో వుండగానే నగరాలు, పట్టణాల సమీపంలో వున్న వేలాది ఎకరాల వ్యవసాయ భూములు విచ్చలవిడిగా రియల్‌ఎస్టెట్‌ కు బదిలీ అయిపోతున్నాయి. ఇక్కడ వేస్తున్న వెంచర్‌ల వల్ల నీరు వెల్లడానికి సరైన ఏర్పాట్లు వుండడంలేదు. చిన్నపాటి వర్షాలకే నగరాలు, పట్టణాల్లోని అనేక కాలనీలు నీటమునిగి పట్టణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. నాలాచట్టం రద్దు ద్వారా ఇలాంటి ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం వుంది. 

కావున తక్షణం ప్రణాళికాబద్ధమైన నగర/పట్టణ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, వ్యవసాయం సాగిస్తున్న  భూములను, గ్రామాలను ఇష్టానుసారం పట్టణాలలో కలపరాదని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి