
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 28 ఆగష్టు, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలు పరిష్కరించాలని, రక్షణ, సంక్షేమ చట్టం చేయాలని కోరుతూ...
అయ్యా!
రాష్ట్రంలో గొర్రెలు, మేకలు జీవాల రూపంలో దాదాపు 3.5 కోట్ల వరకు ఉన్నాయి. వీటిపై 42 లక్షల కుటుంబాలు ఆధారపడి జీవనం గడుపుతున్నారు. వారికి సరైన రక్షణ, వసతులు లేక నానావస్థలు పడుతున్నారు. వీటితోపాటు భౌతికదాడులకు, దౌర్జన్యాలకు గురవుతున్నారు. గొర్రెలు, మేకలు దొంగతనానికి గురవుతున్నాయి. ఎదురు తిరిగితే తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. 2025 ఏప్రిల్ గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పుసులూరు గ్రామంలో పట్టపగలే పెంపకందారున్ని హత్యచేస్తే ఇప్పటి వరకు ఆ కేసుకు అతిగతీ లేదు. ఈ విధంగా రాష్ట్రంలో అనేకచోట్ల గొర్రెలు, మేకల పెంపకందార్లను కట్టేసి కొట్టిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇటువంటి దాడులను నిరోధించడానికి కర్ణాటక రాష్ట్రం ‘‘సాంప్రదాయ సంచార పశువుల కాపరుల బిల్లు ` 2025 తీసుకువచ్చింది. పశువుల కాపరుల సంక్షేమాన్ని ప్రోత్సహించడం మరియు వారిపై దారుణ నేరాలను నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఈ రకమైన దాడుల నుండి రక్షణ కల్పించాలంటే కర్ణాటక రాష్ట్రంలో మాదిరిగా సామాజిక సంక్షేమం మరియు రక్షణ చట్టం తక్షణమే తీసుకురావాలని కోరుతున్నాను.
ముఖ్యంగా వార్షాకాలం కావడంతో అంటు వ్యాధులు ప్రబలి గొర్రెలు, మేకలు మృత్యువాతపడుతున్నాయి. దీనివలన పెంపకం దారులు తీవ్రంగా నష్టపోతున్నారు. డీవార్మింగ్ మందులు, నాణ్యమైన టీకాలు అందుబాటులో లేవు. కనీసం రెండు సార్లు వీటిని ఉచితంగా అందించాలి. షెడ్లు నిర్మాణానికి సబ్సిడీ 70% నుండి 90% పెంచాలి. ప్రతి పెంపకందారునికి 50% రాయితీతో రూ.5 లక్షలు రుణం అందించాలి. పశునష్టపరిహార పథకం పునరుద్దరణకి అన్ని జీవాలకు ఉచితంగా భీమా చేసి ఒక్కొక్క దానికి రూ.10 వేలు నష్టపరిహారం ఇవ్వాలి. మేలురకం పొట్టేలు ఇవ్వాలి. జివో 559, 1016 ప్రకారం 25 ఎకరాలు స్థలం కేటాయించి ఊరు ఉమ్మడి మేత భూములు కాపాడాలి. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి. గొర్రెలు, మేకలకు త్రాగునీటి తొట్టీలు నిర్మించాలి. అలాగే వృత్తుల్లో ఉన్నవారికి 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ మంజూరు చేస్తామన్న ఎన్నికల హామీ అమలు చేయాలి. రైతు సేవా కేంద్రాలలో ఖాళీగా ఉన్న పశువైద్య సిబ్బంది పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని కోరుతున్నాను.
పై సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
