
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 28 ఆగష్టు, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : తిరుమల - తిరుపతి దేవస్థానంలో అక్రమంగా 8 మంది దళిత ఉద్యోగుల సస్పెన్షన్ రద్దు చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ...
అయ్యా!
తిరుమల - తిరుపతి దేవస్థానంలో 30 ఏళ్ల నుంచి పని చేస్తున్న 8 మంది షెడ్యూల్డు కులాలకు చెందిన ఉద్యోగులను ఇటీవల సస్పెండ్ చేశారు. టిటిడి ఒక ధార్మిక సంస్థ. దేవుని దృష్టిలో ప్రజలందరూ సమానమే. టిటిడి చర్య పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైనది.
హిందూ మతేతర ప్రార్ధనా కార్యక్రమాలలో పాల్గొన్నారనే పేరిట వీరిపై చర్యలు తీసుకున్నారు. 2007కు ముందు వీరు టిటిడి ఉద్యోగాలలో నియమించబడ్డారు. ఆ నాటికి ఇతర మతస్తులకు కూడా టిటిడి ఉద్యోగాలలో అర్హత ఉన్నది. గత వంద సంవత్సరాలుగా దేవాలయ నిర్వహణలో వివిధ డిపార్ట్‌మెంట్‌లలో అన్ని కులాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు నియమించబడుతున్నారు. కొందరు కారుణ్య నియామకాల ద్వారా నియమించబడ్డారు. అన్యమతస్థుల పేరిట కొంత మందిని సస్పెండ్ చేయడం సరైంది కాదు. టిటిడి సాంప్రదాయానికి భిన్నమైనది.
2007 తరువాత హిందువులు మాత్రమే టిటిడిలో ఉద్యోగాలకు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఇతర మతస్తులను ఉద్యోగాలలోకి తీసుకోవటం లేదు. తొలగించబడిన ఉద్యోగులు కొందరు రెండు, మూడు ఏళ్లలో పదవీ విరమణ కూడా చేయనున్నారు. గత 30 ఏళ్లకు పైగా టిటిడి మరియు భక్తుల సేవలో వీరు ఉన్నారు. సంస్థ పట్ల నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ సస్పెండ్ చేయడం సరైంది కాదు.
టిటిడిలో పని చేస్తున్న 29 మంది ఇతర మతస్తులను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగాలలోకి తీసుకోవాలని గతంలో టిటిడి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్ధించగా, సాంకేతిక కారణాలతో ఈ విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించి టిటిడి పరిధిలోని విద్యాలయాలు, ఆసుపత్రులు, ఇంజనీరింగ్ వంటి సెక్షన్లలో పని చేయించుకోవాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 24, 2025న మెమో నెం.1743960/337/2022 దేవాదాయ శాఖ`3 ద్వారా పై ఉత్తర్వులను జారీ చేశారు. 29 మంది హిందూయేతరులను గతంలో తొలగించాలని టిటిడి యాజమాన్యం నిర్ణయించినపుడు హైకోర్టు మందలించి నిలుపుదల చేసింది.
ప్రస్తుతం టిటిడి యాజమాన్యం వ్యవహరించిన తీరు హక్కుల ఉల్లంఘనగా కనిపిస్తున్నది. ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన టిటిడి యాజమాన్యం మతం పేరుతో విభజన తీసుకురావడం అన్యాయం. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తమరు జోక్యం చేసుకుని, ఎనిమిది కుటుంబాలను ఆదుకోవాలని, సస్పెన్షన్ ఎత్తి వేసి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
కాపీటు :
శ్రీయుత బి.ఆర్.నాయుడు గారికి,
ఛైర్మన్, టిటిడి.
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
