మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలి..

ఈరోజు (21 సెప్టెంబరు, 2025) ప్రభుత్వరంగంలోనే వైద్యవిద్య, ప్రజారోగ్యం కొనసాగాలని కోరుతూ రౌండ్‌టేబుల్‌ సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి

ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలి

సిపిఎం రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు డిమాండ్‌

పిపిపికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలకు పిలుపు

 

రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన మెడికల్‌ కళాశాలల పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌(పిపిపి) విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య, ప్రజారోగ్యం కొనసాగించాలని కోరుతూ సిపిఎం రాష్ట్రకమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో ఆదివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. 

దేశంలో ఎక్కడ లేని విధంగా వైద్య విద్యను పిపిపి పద్ధతిలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేద, మధ్య తరగతి విద్యార్ధులకు వైద్య విద్యను దూరం చేస్తోందని ఈ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. విలువైన ప్రజాధనాన్ని ప్రైవేట్‌ వారికి అతి చౌకగా కట్టబెట్టే పిపిపి విధానం వైద్య రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించడంలో భాగమని వక్తలు విమర్శించారు. పిపిపి విధానానికి వ్యతిరేకంగా విద్యార్ధి, యువజన, ప్రజా సంఘాలు చేస్తున్న ఐక్య ఉద్యమాలకు రాజకీయపార్టీలు, మేధావులు అండగా నిలవాలని నిర్ణయించారు.  

సభకు అధ్యక్షత వహించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం దారుణమని అన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం పిపిపి విధానానికి కొత్త భాష్యం చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టించేప్రయత్నం చేస్తుందన్నారు. మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ వారికి అప్పగించడం లేదని, ప్రభుత్వ రంగంలోనే ఉంటుందని, కేవలం నిర్మాణాలు మాత్రమే ప్రైవేట్‌ చేస్తోందని చెప్పి సమర్ధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం మెడికల్‌ కాలేజీల భవనాల నిర్మాణాలను కొంత వరకు పూర్తి చేసిందని, వాటిని చూపకుండా ఖాళీ స్థలాలను చూపిస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. ప్రైవేట్‌ పరం చేయాలనుకున్న కళాశాలలు 30 నుంచి 50శాతం నిర్మాణం పూర్తయ్యాయని వివరించారు. ప్రజా ధనంతో సేకరించిన స్థలాలను, నిర్మాణాలను అతి చౌకగా ప్రైవేట్‌ వారికి అప్పగించే ఈ విధానం ప్రభుత్వ సొమ్మును పెట్టుబడీదారుల పరం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60, 40 శాతం వాటాతో నిర్మించిన ఈ భవనాలను ప్రైవేట్‌ వారికి 60 ఏళ్లకు లీజుకు ఇవ్వాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఐదు వేల కోట్లు ఒకేసారి గానీ, లేదా రాష్ట్ర బడ్జెట్‌లో ఏడాదికి రూ.600కోట్లు కేటాయిస్తే ఐదేళ్లల్లో ఈ భవనాలు పూర్తవుతాయని సూచించారు. విద్య, వైద్యం ప్రభుత్వ అధీనంలో ఉంటేనే మానవ అభివృద్ధి సాధ్యమన్నారు.  ప్రభుత్వ పిపిపి విధానానికి వ్యతిరకంగా ప్రజలు, విద్యార్ధులు, యువత ముందుకొస్తున్నారని చెప్పారు. స్థానికంగా ఎక్కడిక్కడ ప్రజా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ఆస్తిని కాపాడుకోవాలని కోరారు. 

మెడికల్‌ పెరేంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ అలా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంపద సృష్టిస్తాననే నినాదంతో ముందుకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పిపిపి పేరుతో ప్రభుత్వ, ప్రజల సంపదను ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్ధులకు చాలా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్‌ వర్గాలతో పాటు ఒసిల్లోని పేద విద్యార్ధులు కూడా చాలా నష్టపోతారని చెప్పారు. గుజరాత్‌లోని పిపిపి పద్ధతిలో ఎ కేటగిరిలో కనీస ఫీజు రూ.8లక్షలుగా, బి కేటగిరీలో రూ.16లక్షలు, సి కేటగిరీలో రూ.30లక్షలు చొప్పున ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇలా అయితే డబ్బు ఉంటేనే చదువుకునే పరిస్థితి ఉంటుందన్నారు. ఆర్ధిక భారంతో పాటు ప్రతిభ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ కళాశాలలు అనేక అక్రమాలు చేస్తున్నాయని విమర్శించారు. వైద్య సీట్ల కోసం జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌(ఎన్‌ఎంసి)కి తప్పుడు లెక్కలు చూపుతున్నాయని తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు  కలిసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరారు. 

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జనార్ధనరెడ్డి నాలుగు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు ఇచ్చిన అనుమతికి వ్యతిరేకంగా విద్యార్ధి, యువజన ఉద్యమం పెద్దఎత్తున సాగిందని, టిడిపి ప్రధాన కార్యదర్శిగా నాడు చంద్రబాబు ఆ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. ప్రజా ఉద్యమ ఫలితంగా జనర్ధానరెడ్డి అధికారాన్ని కోల్పోయిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేసుకోవాలన్నారు. ఆయన ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.

ప్రజారోగ్య వేదిక అధ్యక్షులు డాక్టర్‌ ఎంవి రమణయ్య మాట్లాడుతూ వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉంటే సేవా దృక్పధం ఉంటుందని,  ప్రైవేట్‌ చేతుల్లో ఉంటే వ్యాపార దృక్పథం ఉంటుందని చెప్పారు. సేవా దృక్పధం దెబ్బతిని వ్యాపార దృక్పధం వస్తే ఇప్పటికే భారంగా ఉన్న వైద్య ఖర్చులను భవిష్యత్తులో పేదలు భరించలేని పరిస్థితి ఉంటుందని, దీనివల్ల పేదరికం ఇంకా పెరుగుతుందన్నారు. ప్రభుత్వ సీట్లను ప్రైవేట్‌ చేతుల్లోకి వెళ్తే పేదలు వాటిని కొనే పరిస్థితి ఉండదని చెప్పారు.  

పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మాట్లాడుతూ  ఉమ్మడి రాష్ట్రంలో నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రైవేట్‌ వైద్య, ఇంజనీరింగ్‌ కళాశాలలకు అనుమతి ఇచ్చిందని, ఆ సమయంలో రాష్ట్రంలో పెద్దఎత్తున ఉద్యమాలు జరిగాయని చెప్పారు. ఈ పోరాటం వల్ల జనార్ధన్‌ రెడ్డి పదవి పోయిందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉద్యమాలే వస్తాయని, ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. కరోనా సమయంలో ప్రభుత్వ ఆస్పత్రులు మాత్రమే ప్రజలకు సేవ చేస్తుందని అందరికీ అర్ధమయిందని, కార్పొరేట్‌ ఆస్పత్రులు మూతపడ్డాయని తెలిపారు. విద్య, వైద్యం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉండాలనేది పిడిఎఫ్‌ విధానమని చెప్పారు. 

జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా 15 ఏళ్లుగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒక్క ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ తీసుకురాలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేట్‌ చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అవసరం లేకపోయినా పరీక్షల పేరుతో విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. దీనివల్ల పేదలు ఆర్ధికంగా చితికిపోతున్నారని తెలిపారు.  వైసిపి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశపెట్టిన సెల్ఫ్‌ ఫైనాన్స్‌డ్‌ కోర్సులను ప్రతిపక్షంలో టిడిపి వ్యతిరేకించడంతో పాటు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు ప్రైవేట్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. ప్రజాపోరాటాలతో పాటు  న్యాయపోరాటం కూడా చేయాలని కోరారు.   

పిడిఎఫ్‌ మాజీ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రైవేటీకరణకు అప్పగించనున్న వైద్య కళాశాలలు ఎక్కువగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. ఈ ఆస్పత్రుల నిర్మాణం పూర్తయితే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. కళాశాలలతో పాటు  ప్రజలకు వైద్య సదుపాయాలు అందించే ఆస్పత్రులు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పారు.   ఈ సమస్య కేవలం విద్యార్ధులదే కాదని, ప్రజలది కూడా అని అన్నారు.  

సిపిఐ(ఎంఎల్‌) నాయకులు  జాస్తి కిషోర్‌ బాబు మాట్లాడుతూ ఎన్టీ రామారావు ప్రైవేట్‌లో ఉన్న వైద్య ఆస్పత్రులను ప్రభుత్వ అధీనంలోకి తీసుకొచ్చారని చెప్పారు. చంద్రబాబు మాత్రం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారని తెలిపారు.  ప్రభుత్వ విద్య, వైద్యంపై పాలకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు.  

సిపిఐ రాష్ట్ర నాయకులు పి జమలయ్య మాట్లాడుతూ  ప్రైవేట్‌ సంస్థలు ప్రజలకు సర్వీస్‌ చేస్తునట్లు చూపించి, వారికి భూములు అప్పగించేందుకే పి4 విధానాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. విద్య, వైద్యాన్ని ప్రైవేట్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తామన్నారు.

సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు ప్రసాద్‌,సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ నాయకులు హరినాథ్‌,ఎం(సిపిఐ) నాయకులు ఖాదర్‌ భాషా, సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు రామకృష్ణ,ఎస్‌యుసిఐ నాయకులు సుధీర్‌, ఆర్‌ఎస్పి నాయకులు రవికాంత్‌,  ఆలిండియా కిసాన్‌ ఫ్రంట్‌ నాయకులు వెంకటరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి దానిని ప్రైవేట్‌కు అప్పగిస్తోందని చెప్పారు.  ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణ విధానాన్ని నిలదీయాలని కోరారు.దీనిపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉద్యమించాలని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన సెల్ఫ్‌ ఫైనాన్స్‌డ్‌ కోర్సులను ప్రతిపక్షంలో వ్యతిరేకించిన నారా లోకేష్‌ ఇప్పుడు మొత్తం ప్రైవేటీకరణ చేస్తారని విమర్శించారు.  గ్రామీణ ప్రాంత పేద విద్యార్ధులకు ఇప్పటికే వైద్య విద్య అందని పరిస్థితి ఉందన్నారు. సిపిఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తునట్లు చెప్పారు. ప్రజావైద్యశాల వైద్యులు సుధాకర్‌, రైతు నాయకులు, వైద్యులు పల్లా రాజమోహన్‌, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానం పెట్టుబడిదారీ విధానమని చెప్పారు. పెట్టుబడిదారులకు  ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజలకు లబ్ధి చేకూరుస్తునట్లు మోసం చేస్తున్నారని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.  విద్య, వైద్యం ప్రాథమిక హక్కు అని, వీటిని సాధించుకోవడంలో చాలా వెనకి బడి ఉన్నామని తెలిపారు. దళిత బహుజన ఫ్రంట్‌ వ్యవస్థాపకులు కె వినయ్‌కుమార్‌, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు విశ్వనాధ్‌ మాట్లాడుతూ ప్రజారోగ్య వ్యవస్ధ చాలా అధ్వానంగా ఉందని విమర్శించారు. వైద్య రంగంపై ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. కార్పొరేటీకరణ పెరుగుతున్న తరుణంలో వైద్య విద్య, ప్రజారోగ్యం ప్రభుత్వ పరిధిలోనే ఉండాలని డిమాండ్‌ చేశారు. ఎం హరిబాబు తదితరులు పాల్గన్నారు వైద్యులు వి సుమ, హష్మి, రఘురాం ప్రసంగించారు.. 

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్నకుమార్‌ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించామని, కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు కేసులు కూడా పెట్టారని వివరించారు. ప్రభుత్వం పోరాటాలపై నిర్బంధం విధిస్తోందని, ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతూ ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్నాయని తెలిపారు. ఆదోనిలో విద్యార్ధులపై  పెట్టిన కేసులను ఎత్తివేయాలని  సమావేశం డిమాండ్‌ చేసింది. ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు సాయికుమార్‌ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే 107,108 జిఓలను 100రోజుల్లో రద్దు చేస్తామని చెప్పిన మంత్రి లోకేష్‌ మాట తప్పారని విమర్శించారు. ప్రొఫెసర్‌ వసుంధర మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన 17 వైద్య కళాశాలలు పూర్తయినట్లయితే రాష్ట్రం వైద్యరంగంలో చాలా అభివృద్ధి సాధించి ఉండేదని చెప్పారు.

సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు రాంభూపాల్‌ వక్తలను పరిచయం చేసిన ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు, రైతుసంఘం నాయకులు కేశవరావు, కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

పిపిపి విధానాన్ని విరమించి 10 వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడపాలని, ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలని అందుకు అవసరమైన ఉద్యమాలను చేపట్టాలని రౌంట్‌ టేబుల్‌ సమావేశం నిర్ణయించింది.