కార్మికుల పని గంటలను 8 నుండి 13కి పెంచుతూ శాసనసభ, శాసనమండలి చేసిన తీర్మానాలను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 23 సెప్టెంబరు, 2025.

 

కార్మికుల పని గంటలను 8 నుండి 13కి పెంచుతూ శాసనసభ, శాసనమండలి చేసిన తీర్మానాలను  సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. తక్షణం దీన్ని ఉపసంహరించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది. గత 13 సం॥లుగా కనీస వేతనాలను ప్రభుత్వం సవరించలేదు. వెంటనే కనీస వేతనాలను ప్రస్తుత ధరలకనుగుణంగా సవరించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

రాష్ట్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికుల శ్రమను దోపిడీ చేసేందుకు పని గంటలు పెంచింది. స్ప్రెడ్‌ ఓవర్‌ టైం పెంపు పేరుతో పనిని 8 గంటల నుండి 13 గంటలకు పెంచింది. ఈ సంవత్సరం జూన్‌ 4వ తారీఖునే చంద్రబాబునాయుడు నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ మంత్రివర్గం పని గంటల పెంపుకు ఆమోద ముద్ర వేసింది.

కార్మికులకు నష్టదాయకంగా పనిగంటలను, పని విస్తృతిని పెంచడం, ఓవర్‌టైమ్‌ కాలాన్ని రెట్టింపు చేయడం, మహిళల చేత రాత్రిపూట పని వంటివి పెట్టుబడిదారులకు ప్రయోజనం కలిగించడానికే. మహిళలకు కల్పించాల్సిన సౌకర్యాలను, రక్షణను యాజమాన్యాలు కల్పించడం లేదు. వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు మహిళల చేత రాత్రిపూట కూడా పని చేయించుకోవడానికి, యాజమాన్యాలు మరింత దోపిడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం సరైంది కాదు. రాష్ట్ర ప్రభుత్వం పనిగంటల పెంపు, తదితర నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తోంది.

వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరుకావడం లేదు. ప్రతిపక్ష పాత్ర నిర్వహించి ఇలాంటి చట్టాలను వ్యతిరేకించకుండా పాలక పార్టీకి పరోక్షంగా సహకరించడం సరైంది కాదు. కౌన్సిల్‌లో కూడా వైసిపి వ్యతిరేకిస్తూనే కౌన్సిల్‌ నుండి వాకౌట్‌ చేసింది. కానీ పనిగంటల పెంపుదలను వ్యతిరేకిస్తూ ఓట్‌ చేయలేదు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి మాత్రమే దీనికి వ్యతిరేకంగా నిలబడ్డారు.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి