మొత్తం విద్యుత్‌ సర్దుబాటు చార్జీలు 2,758 కోట్ల రూ. ట్రూ డౌన్‌ చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 28 సెప్టెంబరు, 2025.

 

మొత్తం విద్యుత్‌ సర్దుబాటు చార్జీలు 2,758 కోట్ల రూ. ట్రూ డౌన్‌ చేయాలి.

విద్యుత్‌ రెగ్యులేటరీ కమీషన్‌ తుది నిర్ణయం ప్రకారం రు.923 కోట్లు మాత్రమే కాకుండా 2024`25 కాలానికి అక్రమంగా వసూలు చేసిన మొత్తం ట్రూఅప్‌ ఛార్జీలు రూ.2758 కోట్లు వినియోగదారులకు వాపసు చేయాలని (ట్రూడౌన్‌) సిపిఐ(యం) రాష్ట్ర కమిటి డిమాండ్‌ చేస్తున్నది.

2024`25 కాలానికి సంబంధించి 923 కోట్ల రూ. ట్రూ డౌన్‌ ద్వారా, ఇప్పుడు వినియోగించుకుంటున్న విద్యుత్‌ పై యూనిట్‌ కు 13 పైసలు చొప్పున సంవత్సర కాలంలో తిరిగి వినియోగదారులకు చెల్లించాలని నియంత్రణ మండలి ఆదేశాలు ఇవ్వటం సరైనదే. అయితే ప్రతి నెల వినియోగించుకున్న యూనిట్‌ పై తదుపరి నెల బిల్లులలో 40 పైసలు చొప్పున ముందుగానే 2758 కోట్ల రూ. వినియోగదారుల వద్ద నుండి అక్రమంగా ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్‌.పి.పై.సి.ఏ) పేరుతో వసూలు చేశారు. ఇది అన్యాయంగా వసూలు చేసినట్లు స్పష్టమవుతుందున దాన్ని కూడా వినియోగదారులకు వాపసు ఇవ్వాలి. అంతేకాక ఇప్పటివరకు వసూలు చేస్తున్న 40 పైసల్ని వెంటనే ఆపేయాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

ఇప్పటికే వసూలు చేసిన వేలకోట్ల రూ. సర్దుబాటు చార్జీల భారాన్ని మరుగుపరిచి, 923 కోట్లు తగ్గింపుతోనే సరిపెట్టడం తగదు. విద్యుత్‌ అదనపు భారాలు మోపబోమని కూటమి పార్టీలు ఎన్నికలలో హామీ ఇచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్‌ బాదుడు ఉండదని పదే పదే ప్రకటించారు. కానీ కూటమి ప్రభుత్వం మాట తప్పింది. 15 నెలల కాలంలోనే 2022`23, 23`24  సంవత్సరాలు సంబంధించి 15,485 కోట్ల రూ. సర్దుబాటు చార్జీల పేరుతో భారం మోపింది. ఇదే కాకుండా ప్రతినెల 40 పైసలు చొప్పున అదనంగా సర్దుబాటు చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీకు అనుగుణంగా ఇప్పటికే వసూలు చేసిన 2758 కోట్లతో పాటు ఇప్పటికీ వసూలు చేస్తున్న 15,485 కోట్ల రూ. భారాన్ని నిలిపివేయాలి.

అదనంగా మోపిన మొత్తం భారాలను తగ్గించి కూటమి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి. భవిష్యత్తులో ఈ సర్దుబాటు చార్జీల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. మొత్తం సర్దుబాటు చార్జీల భారం తగ్గించే వరకు ప్రభుత్వంపై వివిధ రూపాల్లో ఒత్తిడి చేయడానికి ప్రజలు సిద్ధం కావాలి.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి