విజయవాడ,
తేది : 29 సెప్టెంబరు, 2025.
విషయం : అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలంలో రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న, మత్స్యకారుల ఉపాధికి, ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి భంగం కలిగించే బల్క్‌డ్రగ్ పార్కును ఏర్పాటు చేసే ఆలోచన విరమించుకోవాలని కోరుతూ..
అయ్యా!
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం, రాజయ్య పేట, బోయపాడు, దొండవాక, పెద్దతీనార్ల, చిన్నతీనార్ల, ఎస్.రాయవరం మండలం గుర్రాజుపేట గ్రామాలలో బల్క్‌డ్రగ్ పార్కు కోసం రాష్ట్ర ప్రభుత్వం 1270.80 ఎకరాలకు గాను, 450 ఎకరాలు సేకరించారు. ఇంకా 820 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ భూములు ఇవ్వము అని రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. కొత్తగా సేకరిచందలచిన భూ సేకరణ ఆపాలని ప్రజలు ఆందోళన చేస్తున్నారు.
భూసేకరణ పూర్తికాకుండానే జనవరి 8, 2025న విశాఖపట్నంలో ప్రధానమంత్రి మీ సమక్షంలో బల్క్‌డ్రగ్ పార్కును వర్చువల్‌గా ప్రారంభించారు. భూసేకరణ జరగకుండానే రైతులు, ఆయా గ్రామాల ప్రజలు వ్యతిరేకించినప్పటికీ, 6 ఆగష్టు 2025న నక్కపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రజలందరు బల్క్‌డ్రగ్ పార్కును వ్యతిరేకించారు. ఇప్పటికీ రాజయ్యపేట ప్రజలు, చుట్టుప్రక్కల గ్రామస్తులు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ రాజయ్యపేట గ్రామం చుట్టూ రోడ్లు, డ్రైన్‌లు, అడ్మిన్ బిల్డింగ్, వాటర్ పంపులు నిర్మాణం జరుగుతున్నది. ఇది పూర్తిగా చట్టాలను ఉల్లంఘించటమే. అంతేకాక దీనికి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు లేవు. బల్క్ డ్రగ్ పార్కు వస్తే ఈ ప్రాంతం వాతావరణ కాలుష్యం, భూగర్భ జలాలు కలుషితం అవుతాయి. ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది.
ఈ ప్రాంతం మినీ కోనసీమగా పేరుగాంచింది. కొబ్బరితోటలు, జీడిమామిడితోటలు, డ్రాగన్‌ఫూట్స్ వంటివి పండిస్తున్నారు. డ్రిప్ సిస్టం ద్వారా రైతులు తోటలు వేసి పంటలు పండిస్తున్నారు. రైతులకు ఈ భూములు తప్ప వేరే మార్గం లేదు. వేలమంది కూలీలు ఈ తోటలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఎస్.రాయవరంలో కొబ్బరితోటలపై ఆధారపడి 23 కొబ్బరి పీచు కంపెనీలు ఉన్నాయి. ఎగుమతి జరుగుతోంది. వందలమంది కార్మికులు పని చేస్తున్నారు. ఈ బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటు వలన వీరి ఉపాధి దెబ్బతింటుంది.
ఈ గ్రామాలలో మత్స్యకారులకు సముద్రం వేట తప్ప మరొక ఆధారం లేదు. ఇప్పటికే హెటిరోడ్రగ్ మందుల కంపెనీ వదులుతున్న వ్యర్ధ జలాల వలన మత్స్యసంపద నశించిపోయి ఇతర ప్రాంతాలకు మత్స్యకారులు వలసపోతున్నారు. కంపెనీ చుట్టూ జల కాలుష్యం వలన ప్రజలు వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు. ఇప్పుడు ఈ బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటు వలన మత్స్యకారులు శాశ్వతంగా గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా జాతీయ ఉపాధి హామి పథకంపై ఆధారపడి జీవిస్తున్న 7,930 మంది కూలీలు ఉపాధి కోల్పోతారు.
కాబట్టి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి రైతుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న, మత్స్యకారుల ఉపాధికి, ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి భంగం కలిగించే బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటు చేసే ఆలోచన విరమించుకోవాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
