ఈరోజు (06 అక్టోబర్, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
కొత్త జిఎస్‌టితో రూ.90 వేల కోట్ల నష్టం
అసంతృప్తిని చల్లార్చేందుకే మోడీ రాష్ట్ర పర్యటన
సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి
జిఎస్‌టి నష్టాలపై ప్రధాని చంద్రబాబు లేఖ రాయాలి
రాష్ట్రానికి మోడీ నష్టపరిహారం ప్రకటించాలి
మోడీ పర్యటనపై నిరసనల కార్యక్రమాలు : వి.శ్రీనివాసరావు
కేంద్రం తీసుకొచ్చిన కొత్త జిఎస్‌టితో రూ.90 వేల కోట్ల నష్టం వస్తుందని, దీనిలో 70 శాతం రాష్ట్రాలే భరించాలని, దీనిపై వస్తున్న వ్యతిరేకతను చల్లబరిచేందుకు ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తున్నారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. సోమవారం విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడారు. 16న ప్రధాని శ్రీశైలానికి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానిని అభ్యర్థించాలని కోరారు. కొత్తగా తీసుకొచ్చిన జిఎస్‌టిపై ప్రజాధనాన్ని వినియోగించి ప్రభుత్వ అధికారులతో ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. గతంలో కేంద్రం చేపట్టిన డిమానిటైజేషన్ వల్ల పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చిందని, ఇప్పుడు జిఎస్‌టి వల్ల కూడా అంతే వ్యతిరేకత వస్తోందని, అన్ని రాష్ట్రాలూ తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు. దీన్నుండి బయటపడేందుకు, గతంలో జరిగిన నష్టం మరలా జరగకుండా అసంతృప్తి పెరగకుండా చేసుకునేందుకు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. వాస్తవానికి జిఎస్‌టి వల్ల అన్ని రాష్ట్రాలూ తీవ్రంగా నష్టపోతున్నాయని, ఎపి రూ.8000 కోట్లు నష్టపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారని, అలాగే కేరళ, తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాలు ఎక్కువగా నష్టపోతున్నాయని వివరించారు. బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్ రూ.13 వేల కోట్ల నుండి రూ.14 వేల కోట్ల వరకూ నష్టపోతోందని, దీనిపై కేంద్రానికి లేఖ రాసిందని, ఇటీవల బయటకు రావడంతో మరలా తాము లేఖ రాయలేదంటూ మరొక లేఖ విడుదల చేశారని తెలిపారు. రాష్ట్రాలకు నష్టం జరగడం అంటే అది అంతిమంగా ప్రజలపై పడటమేనని పేర్కొన్నారు. ప్రధాని మన రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో నష్టపరిహారం ప్రకటించాలని డిమాండు చేశారు. జిఎస్‌టి దోపిడీ ఇదే పద్దతిలో సాగితే కొద్దికాలానికి రాష్ట్రాలు అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే రాష్ట్రాలను ఆదుకోవాలని కోరారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీశైలాన్ని టిటిడి తరహాలో అభివృద్ధి చేస్తానని చెబుతున్నారని, ఫ్రధాన్యత పనులేవో గుర్తించి ముందు వాటిని పూర్తి చేయాలని సూచించారు. వెనుకబడి ప్రాంతాలకు నిధులు ఇవ్వడం లేదని, రైతాంగానికి తీవ్ర సమస్యలు ఉన్నాయని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంతోపాటు రూ.1300 కోట్లు కేటాయిస్తే నల్లమలసాగర్ పనులూ పూర్తి చేయొచ్చని, దీనిద్వారా ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దొనకొండలో బిడిఎల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని వార్తలు వస్తున్నాయని, దానికీ నీటి అవసరాలు ఉంటాయని వివరించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు సంవత్సరాల తరబడి సాగుతూనే ఉన్నాయని, గతంలో జగన్ కూడా పూర్తిచేసినట్లు ప్రారంభోత్సవాలు చేశారని, ఇప్పటికీ పనులు పూర్తవలేదని అన్నారు. తాము అధికారంలలోకి వస్తే వెంటనే వెలిగొండతోపాటు వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చంద్రబాబునాయుడు హామీఇచ్చారని, ఇప్పుడు పట్టించుకోకపోవడం అన్యాయమని తెలిపారు. ప్రజా సమస్యలపై సిఎం శ్రద్ధ పెట్టడం లేదని తెలిపారు. గతంలో బనకచర్ల అన్నారని, ఇప్పుడు పోలవరం, సోమశిల అంటున్నారని, ఇటువంటి ఉబుసుపోని పథకాల వల్ల ఉపయోగం లేదని పేర్కొన్నారు.
ప్రధాని రాక సందర్భంగా నిరసనలు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ప్రధాని రాక సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. అన్ని వామపక్ష పార్టీలనూ కలుపుకుపోతామని అన్నారు. విభజన హామీలనూ కేంద్రం నెరవేర్చడం లేదని పేర్కొన్నారు. మోడీ ప్రధాని అయ్యాక రాష్ట్రానికి ఒక్క అభివృద్ధి పథకం కూడా ప్రకటించలేదని తెలిపారు. ఆయనవల్ల రాష్ట్రానికి ఒరిగేందేమీ లేదని, కడప ఉక్కు నిర్మిస్తామని చెప్పినా కనీసం పునాది కూడా వేయలేదని అన్నారు. ప్రైవేటు మిట్టల్ కంపెనీకి అన్ని అనుమతులూ వచ్చేస్తున్నాయని విమర్శించారు. బుందేల్‌ఖండ్ తరహాలో రాయలసీమకు ప్యాకేజీ ఇస్తామన్నా ఇంతవరకు ఊసేలేదని అన్నారు. ఎపి నుండి 20 లక్షల మంది విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారని, వారందరూ ఇబ్బందుల్లో ఉన్నారని వారికి రక్షణ కల్పించాలని కోరారు. అమెరికాలో ఉంటున్న వారిని పి4కు సాయం చేయాలని కోరుతున్నారని, వారికి ఇబ్బంది ఎదురైతే చంద్రబాబు నోరెత్తడం లేదని తెలిపారు. రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఆటోలు ఉంటే రెండు లక్షల మందికే రూ.15 వేల సాయం ఇచ్చారని, మిగిలిన వారిని వదిలేశారని అన్నారు. ఇటువంటి కంటితుడుపు చర్యల వల్ల ఉపయోగం లేదని అన్నారు.
హాస్టళ్లలో పిల్లలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదు
రాష్ట్రంలో సాంఘిక, గిరిజన గురుకులాల్లో విద్యార్థులు చనిపోవడం బాధాకరమని శ్రీనివాసరావు తెలిపారు. వారిరక్షణ కోసం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు. చనిపోయిన పిల్లల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం అందివ్వాలని కోరారు. అనారోగ్యంతో పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని పేర్కొన్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనివల్ల గురుకుల విద్యార్థినుల భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని తెలిపారు. చిన్న పిల్లలు నష్టపోతున్నారని, దీనిపై సిఎం, డిప్యూటీ సిఎం ప్రకటనలు చేయడం తప్ప తగిన చర్యలు తీసకోవడం లేదని అన్నారు.
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
