నష్టపోయిన కౌలు రైతులందరికీ తుఫాన్‌ పరిహారం అందించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 06 నవంబరు, 2025.

 

నష్టపోయిన కౌలు రైతులందరికీ తుఫాన్‌ పరిహారం అందించాలి. 

ఈ` క్రాప్‌ నమోదుతో నిమిత్తం లేకుండా గ్రామసభల ద్వారా వాస్తవ సాగుదారులను గుర్తించి తుఫాన్‌లో నష్టపోయిన కౌలు రైతులందరికీ పరిహారం అందించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి డిమాండ్‌ చేస్తున్నది. ఈ` క్రాప్‌ నమోదు చేసుకున్నవారికే తుఫాన్‌ సహాయం అందించాలనే ప్రభుత్వ నిర్ణయం వల్ల అత్యధికమంది కౌలుదారులు నష్టపోతున్నారు. దరఖాస్తులు పెట్టుకున్నవారికి కూడా నిరాకరిస్తున్నారు. ప్రభుత్వ దరఖాస్తు ఫారంలో ‘‘వాస్తవ సాగుదారు’’ అనే కాలమ్‌ ఉన్నప్పటికీ చాలా చోట్ల ఉద్యోగులు దానిని రికార్డు చేయడం లేదు. దీనివల్ల కౌలుదార్లకు నష్టం జరుగుతుంది. పెట్టుబడిపెట్టి నష్టపోయిన కౌలుదారులకు బదులుగా ఏ పెట్టుబడి పెట్టని భూయజమానులకు నష్టపరిహారం చెల్లించడం అన్యాయం. ఆ పేరుతో కౌలుదారులకు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఎన్యూమరేషన్‌ పూర్తయిందని ప్రకటించడంతో కౌలురైతులు నిరాశ చెందారు. ఇప్పటికే జరిగిన నష్టంతో బేజారయిపోయిన కౌలు రైతులకు ఇది ఆశనిపాతం.

కౌలురైతులతో పాటు అనేకమంది పేద, మధ్యతరగతి రైతుల నష్టం వివరాలను కూడా నమోదు చేయలేదు. రైతుల ఆందోళనతో మరో రెండురోజులు ఎన్యూమరేషన్‌ గడువు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ దశలోనైనా కౌలుదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి, పరిహారం చెల్లించే ఏర్పాటు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. కౌలు రైతులు ప్రభుత్వ నిర్ణయంతో నిరాశ పడకుండా దరఖాస్తులు పెట్టుకుని పరిహారం కోసం పోరాడాలని సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది. 

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి