విశాఖ కాంక్లేవ్‌లో కార్మికుల సంక్షేమంపై చర్చించాలి

(ఈరోజు (11 నవంబర్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
విశాఖ కాంక్లేవ్‌లో
కార్మికుల సంక్షేమంపై చర్చించాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండు
రాష్ట్రాభివృద్ధికి వచ్చే పెట్టుబడులను సిపిఎం ఆహ్వానిస్తుంది
రైతులు, ప్రజలకు నష్టం చేస్తే ఊరుకోం
పబ్లిక్‌ నోటీసు లేకుండా ఎస్‌ఐఆర్‌ అమలు చెల్లదు
16న ఎస్‌ఐఆర్‌పై రౌండ్‌టేబుల్‌
ఢల్లీి పేలుళ్లు ఘాతుకం, సిపిఎం శ్రద్ధాంజలి
విశాఖ సిఐఐ సమ్మిట్లో ఉపాధి, ఉద్యోగాల కల్పన, కార్మిక సంక్షేమంపైనా ప్రత్యేకంగా చర్చ జరగాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండు చేశారు. మంగళవారం విజయవాడ బాలోత్సవభవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, కె.ప్రభాకరరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. పెట్టుబడులు సదస్సులో పేరుతో జరిగేవన్నీ ప్రభుత్వం, కార్పొరేట్ల భాగస్వామ్యంగా ఉంటున్నాయి తప్ప ప్రజల భాగస్వామ్యానికి చోటు ఉండటం లేదని అన్నారు. గతంలోనూ అనేక సదస్సులు జరిగాయని, వాటిల్లో ఉపాధి ఎంత వచ్చిందో బయటపెట్టాలని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వచ్చే పెట్టుబడులను సిపిఎం ఆహ్వానిస్తుందని అన్నారు. గతంలో పెట్టుబడులు వచ్చాయని పెద్దఎత్తున ప్రచారం చేసినా ఉపాధి పెరగలేదన్నారు. స్థానికులకు ఉపాధి దొరకలేదని అన్నారు. వచ్చిన కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వకపోగా స్టీలు ప్లాంటులో ఆరువేల ఉద్యోగాలను తీసేశారని తెలిపారు. ఇప్పటికే విశాఖ ఐటి భవనాలు పరిశ్రమలు రాక ఖాళీగా ఉన్నాయని వివరించారు. గంగవరం పోర్టులో స్థానికులను తీసుకుని తరువాత తొలగించారని అన్నారు. లెక్కల్లో చూపించడానికే ఇలాంటిది చేశారని పేర్కొన్నారు. నిజంగా అభివృద్ధిని కోరుకుంటే ప్రజలను, కార్మికులను అన్నిట్లోనూ భాగస్వాములను చేయాలని అన్నారు. అప్పుడే పెట్టుబడుల సదస్సులకు విలువ ఉంటుందని తెలిపారు. కేవలం కార్పొరేట్ల కోసమే సదస్సులు నిర్వహించేలా ప్రభుత్వం వ్యవహరించకూడదని, రాష్ట్రం, ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు.
16న ఎస్‌ఐఆర్‌పై రౌండ్‌టేబుల్‌
కేంద్రం ఎన్నికల సంఘం రెండోదశ ఎస్‌ఐఆర్‌ ప్రకటించిన రాష్ట్రాల జాబితాలో మన రాష్ట్రం లేదని అయినా అమలు చేస్తున్నారని అన్నారు. చట్ట ప్రకారం పబ్లిక్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదన్నారు. గతంలో రాజకీయ పార్టీల సమావేశం జరిగిన సమయంలో ఎస్‌ఐఆర్‌ అనేది నాటి ఎజెండాలో కూడా లేదని తెలిపారు. అయినా తాజాగా ఎన్నికల కమిషన్‌ కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి ఎస్‌ఐఆర్‌ అమలు చేయాలని ఆదేశించిందని పేర్కొన్నారు. ఇది ఎన్నికల ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధమని తెలిపారు. బీహార్లో ఎస్‌ఐఆర్‌ చేస్తున్న సమయంలో టిడిపి దాన్ని వ్యతిరేకించిందని, ఇప్పుడు అమలు చేయడానికి అంగీకరించిందని అన్నారు. దీనిపై వైసిపి కూడా మాట్లాడటం లేదన్నారు. అసలు ఆ పార్టీ వైఖరి ఏమిటో స్పస్టం చేయాలని కోరారు. ఎస్‌ఐఆర్‌ అంటే ఓటుహక్కుకు ప్రమాదమేనని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్‌ అమలు నిలిపేయాలని కోరుతూ ఈ నెల 16వ తేదీన విజయవాడలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. ఇది అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కలిసొచ్చేపార్టీలను,  మేధావులు, ప్రజాస్వామ్యావాదులతో ఎస్‌ఐఆర్‌పై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.
బాంబ్‌ బ్లాస్ట్‌ ఘాతుకం
ఢల్లీిలో ఎర్రకోట సమీపంలో బాంబ్‌ బ్లాస్ట్‌ ఘాతుకమని శ్రీనివాసరావు అన్నారు. మృతులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని చెప్పారు. కారకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఘటనలో బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో ఇంటిలిజెన్స్‌, రాజకీయ వైఫల్యం ఉందని పేర్కొన్నారు. పుల్వామా, పెహల్గాంతోపాటు అనేకచోట్ల ఉగ్రదాడులు జరిగాయని వీటిని గుర్తించడంలోనూ ప్రజల ప్రాణాలు కాపాడటంతోనూ కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందని అన్నారు. పెహల్గాం ఉగ్రవాదులను ఇప్పటి వరకూ పట్టుకోలేదని పేర్కొన్నారు. సర్టికల్‌ స్ట్రైక్స్‌ చేశామని, ఉగ్రవాదాన్ని అంతమొందించామని బిజెపి ప్రచారం చేసుకుంటోంది మినహా వాస్తవంగా అణచివేయలేదని పేర్కొన్నారు. ఉగ్రదాడులు ఉన్నాయనే సమాచారంతో తనిఖీలు చేస్తున్న కేంద్రం ముందుగానే వాటిని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. ఇలాంటి సమయాల్లో మతాన్ని టార్గెట్‌ చేసుకుని ప్రచారం చేయడం వల్ల వైషమ్యాలు పెరుగుతున్నాయి మినహా ఉగ్రవాదం తగ్గడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి అఖిలపక్షం ఏర్పాటు చేసి ఉగ్రవాద నివారణకు అవసరమైన సలహాలు సూచనలు తీసుకుని వాటిని అమలు చేయాలని కోరారు.
నష్టపోయిన వారికి పరిహారం ఎగ్గొట్లే చర్యలు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకరరెడ్డి
మొంథా తుఫానులో నష్టపోయిన రైతులకు పరిహారం ఎగ్గొట్టేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకరరెడ్డి అన్నారు. పెద్దఎత్తున నష్టం వాటిల్లిందని తొలుత చెప్పిన ప్రభుత్వం ఎన్యుమరేషన్లో తగ్గించుకుంటూ వస్తోందని అన్నారు. వరి, అరటి, మొక్కజన్న, పసుపు వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. వాస్తవం ఎన్యుమరేషన్‌ సమయంలో రైతుల సంఖ్యను తగ్గిస్తున్నారని తెలిపారు. గతంలో ఉచిత పంటల బీమా వల్ల రైతులకు ఉపయోగం కలిగందని, ప్రస్తుతం అది లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. అలాగే సిసిఏ అనుసరిస్తున్న విధానం వల్ల పత్తిరైతులకు అన్యాయం జరుగుతోందని, నిబంధనలు మార్చాలని డిమాండు చేశారు. మొక్కజన్న రైతులను ఆదుకోవాలని కోరారు. పంటలు దెబ్బతిన్న రైతులు, కౌలు రైతులు అందరినీ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్‌ఐఆర్‌ లేదన్నారు అమలు చేస్తున్నారు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు
ఇటీవల రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించిన సమయంలో ఎస్‌ఐఆర్‌ లేదని స్పష్టంగా చెప్పారని, కేంద్రం ఇచ్చిన లిస్టులోనూ ఎపి లేదని అన్నారు. అయినా ఇప్పుడు అమలు చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అన్నారు. ఎస్‌ఐఆర్‌ ఆలోచనను విరమించుకోవాలని తెలిపారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారికి విజ్ఞాపనపత్రం ఇచ్చామని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలతో మద్యం ఏరులై పారుతోందని తెలిపారు. బెల్టుషాపులు ఎత్తేస్తామని చెప్పారని, ఆచరణలో ఎద్దఎత్తున వ్యాపారాలు జరుగుతున్నాయని తెలిపారు. వీటిపై మహిళల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని అన్నారు. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, వాటికిపై జరిగే ఆందోళనలకు సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.

= = = = 

--

COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee

H.No. 27-30-9,

Akula vari Street,
Governorpet, 

Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org