
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 15 నవంబరు, 2025.
టిటిడి పరకామణి కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
సతీష్ మృతి వెనుక కుట్రలను చేధించాలి. జర్నలిస్టు శ్రీనివాసులుకు రక్షణ కల్పించాలి.
-సిపిఐ(యం)
టిటిడి పరకామణిలో నెలకొని ఉన్న లోపాలు, వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరిపించాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. అవినీతికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
పరకామణిలో జరిగిన దొంగతనంపై ఫిర్యాదు చేసిన నాటి ఎవిఎస్‌ఓ సతీష్ కుమార్ రైలు పట్టాలపై శవమై తేలటం, దీనిని ప్రాథమికంగా వైద్యులు హత్యగా నిర్ధారణ చేయటం ఆందోళన కల్గిస్తున్నది. ఈ ఘటన నెనుక ఉన్న అసలు పాత్రదారులు, సూత్రధారులు తప్పించుకోవటానికి సతీష్ కుమార్‌ను బలి తీసుకున్నట్టుగా భావించాల్సి వస్తున్నది.
ఈ కేసు వెలుగులోకి రావటానికి కారణమైన జర్నలిస్టు శ్రీనివసులు తనకు రక్షణ కల్పించమని తిరుపతి జిల్లా ఎస్‌పి సుబ్బరాయుడికి శనివారం నాడు మొరపెట్టుకున్నారంటే పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది.
రవికుమార్ అనే నిందితుడిని చట్టప్రకారం జైలుకు పంపి చర్యలు తీసుకోకుండా 140 కోట్ల రూపాయల ఆస్తులను టిటిడి పేరిట రాయించుకుని ఫిర్యాదుదారు సతీష్ కుమార్‌తో లోక్ అదాలత్‌లో రాజీ చేయించటం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిజి స్థాయి అధికారితో హైకోర్టు విచారణ చేయిస్తున్న సందర్భంలో సతీష్ కుమార్ హత్య అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది.
35 ఏళ్లుగా చిన్నజియ్యర్ మఠం నుంచి పరకామణిలో పర్యవేక్షణకు వస్తున్న రవి కుమార్ సాదాసీదా ఉద్యోగి అయి ఉండి వందల కోట్లు ఎలా సంపాదించాడు? ఇంకా ఇలాంటి వ్యక్తులు/ శక్తులు ఎందరున్నారు. పరకామణి వ్యవస్థలో ఉన్న లోపాలు ఏమిటి? సమగ్రంగా విచారణ జరపవలసిన ఆవశ్యకత ఉన్నది.
హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో అన్ని పార్శ్వాలలో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని, పరకామణి వ్యవస్థను పటిష్ట పరచాలని, ప్రజలకు, భక్తులకు వాస్తవాలు వెల్లడిరచి టిటిడి నిర్వహణపై భరోసా కల్పించాలని సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
