
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 16 నవంబరు, 2025.
ముఖ్యమంత్రి కార్మికులను బెదిరించడం తగదు
కార్మికులపై పిడి యాక్టు ఉపయోగిస్తామంటూ విశాఖ ఉక్కు కార్మికులను బెదిరించే ధోరణితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వాఖ్యలను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. అవాస్తవాలు, అర్థ సత్యాలతో ప్రజలను తప్పుదారి పట్టించడం ముఖ్యమంత్రికి తగదు. కార్మికుల వేతనాలకు ఉత్పత్తితో ముడిపెడుతూ ఉక్కు యాజమాన్యం తాజాగా సర్క్యులర్ జారీ చేయడం మరింత అనిశ్చితికి గురిచేస్తుంది. ప్రభుత్వ విధానాలు, గనులు లేకపోవడం, ఇతర పాలనాపరమైన కారణాలవల్ల నష్టాలు వస్తుంటే అందుకు నెపం కార్మికులపై నెట్టడం దారుణం. దేశదేశాలు తిరిగి పారిశ్రామికవేత్తలకు వేలకోట్ల రూపాయల రాయితీలిస్తామని ఎర్రతివాచీ పరిచిన ముఖ్యమంత్రి రేయింబవళ్ళు శ్రమచేసే కార్మికులను పి.డి.యాక్టు పెట్టి జైళ్ళలో వేస్తామనడం ఈ ప్రభుత్వం ఎవరి పక్షమో స్పష్టం చేస్తోంది.
దేశంలోని అన్ని ఉక్కు ఫ్యాక్టరీలకు సొంత గనులుండగా విశాఖ ఉక్కుకు మాత్రం కేటాయించడం లేదు. ఇంకా నిర్మాణం కూడా మొదలు పెట్టని మిట్టల్ స్టీల్‌కు సొంత గనులు కేటాయించిన పాలకులు పబ్లిక్ రంగ ఉక్కు ఫ్యాక్టరీకి మాత్రం మొండిచేయి చూపారు. ప్రతిపక్షంలో ఉండగా విశాఖ ఉక్కు కార్మికుల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ మద్దతుగా నిలిచింది. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు నిరాహారదీక్ష కూడా చేపట్టారు. మరి ఇంతలోనే కార్మికులు పనిచేయకుండా తెల్ల ఏనుగును చేసేశారని ముఖ్యమంత్రి అంతటివారు అనడం తగునా? ఉక్కు ఫ్యాక్టరీ రక్షణ కోసం కార్మికులు పోరాడుతుంటే వారికి మద్దతు ఇవ్వకపోగా నిందించడం అన్యాయం. వారి ఓట్లతోనే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఓట్లు సాధించారన్న విషయం మరచిపోతున్నారు.
తమకు వేతనాలు చెల్లించాలనో, ఉద్యోగ భద్రత కల్పించాలని లేదా ఇతర చట్టబద్దమైన హక్కులపై ఉద్యమాలు నిర్వహించడం కార్మికులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ ‘‘పిడి యాక్ట్ పెట్టి లోపల వేస్తాం’’ అని ముఖ్యమంత్రి బెదిరించడం గర్హనీయం. అలాగే విశాఖ ఉక్కు బిఐఎఫ్‌ఆర్‌కి వెళ్ళిందని చెప్పడం అవాస్తవం. ఎప్పుడో 2000 సంవత్సరం నాటి సంగతి ఇప్పుడు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. మంజూరు చేసిన రూ.12,000 కోట్లలో అధికభాగం కేంద్ర పన్నులకు, బ్యాంకు అప్పులకు జమ చేశారే తప్ప ఉత్పత్తికి ప్రత్యక్షంగా ఇచ్చింది తక్కువ. ఉపయోగపడని నిధుల గురించి పదే పదే గొప్పగా చెప్పుకొని రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఆరు నెలలపాటు విశాఖ ఉక్కు కార్మికులకు, ఉద్యోగులకు వేతనాలే చెల్లించలేదు. వాస్తవాలు ఇవికాగా కార్మికులపై అభాండాలు వేయడం తగదు.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
