మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 25 నవంబర్‌, 2025.

 

(ఈరోజు (25.11.2025) జరిగిన సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆమోదించిన తీర్మానం ప్రచురణార్థం/ ప్రసారార్థం విడుదల చేస్తున్నాము. ఈ సమావేశానికి పార్టీ కేంద్రకమిటీ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షత వహించారు. సమావేశంలో పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

తీర్మానం

మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలి

- సిపిఐ(యం) డిమాండ్‌

పాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని చింతూరు, రంపచోడవరం, పోలవరం రెవెన్యూ డివిజన్‌లను కలిపి ప్రత్యేక గిరిజన జిల్లాగా ఏర్పాటు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది.

జిల్లాలు, మండలాల సరిహద్దుల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కొత్తగా రెండు కొత్త జిల్లాలను (మదనపల్లె, మార్కాపురం) ప్రతిపాదించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చింతూరు, రంపచోడవరం, పోలవరం ప్రాంతాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దాని గురించి స్పష్టత ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.  ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న చింతూరు, రంపచోడవరం డివిజన్లు తూర్పుగోదావరి జిల్లాలో కలపాలనుకోవడం సరైంది కాదు. ఈ మూడు డివిజన్‌లు ఆదివాసీ మెజారిటీ ప్రాంతమే కాదు పోలవరం మునక ప్రాంతం కూడా. దీర్ఘకాలం కొనసాగే ప్రత్యేక సమస్యలున్నాయి. చింతూరు, రంపచోడవరం ఈ రెండు రెవెన్యూ డివిజన్‌లతోపాటు, పోలవరం నియోజకవర్గాన్ని కూడా కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్నది అక్కడ ప్రజల వాంఛగా         ఉంది. ఆ మేరకు గతంలో సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కనుక కొత్తగా మరో గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తోంది. 

= = = =