
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్థం / ప్రసారార్థం :
విజయవాడ,
తేదీ. 13 డిసెంబర్, 2025.
ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చే కుట్రల్ని ప్రతిఘటించండి
సిపిఎం పిలుపు
గ్రామీణ ప్రాంత నిరుద్యోగాన్ని ఎదుర్కొనేందుకు వ్యవసాయ కూలీలకు కనీస ఉపాధిని గ్యారెంటీ చేయడానికి 2005లో వామపక్షాల ఉద్యమంతో తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ చట్టాన్ని ఒక సాధారణ సంక్షేమ పథకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది. నేటి వ్యవసాయ సంక్షోభంలో కనీసం 200 పని దినాలు కల్పించాలని, రోజుకు రూ. 600 వేతనం ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది
నిన్న కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన సవరణ బిల్లు, పేరు మార్చడానికి మాత్రమే ఉద్దేశించింది కాదు. పూజ్యబాపు గ్రామీణ రోజ్‌ఘర్ యోజన పేరుతో చేసిన సవరణ చాలా ప్రమాదకరమైంది. ఉద్దేశపూర్వకంగా మహత్మాగాంధీ పేరు తొలగించడమే కాకుండా దీని ప్రకారం చట్టం కాస్త పథకంగా మారుతుంది. పథకం అనేది ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు గ్రామీణ పేదలు అనుభవిస్తున్న ఉపాధిహామీ చట్టం కల్పించిన హక్కు రద్దవుతుంది. 100 రోజుల పనిదినాన్ని 125 రోజుల పనిదినాలుగా పెంచుతూ చేసిన నిర్ణయం హర్షనీయమే అయినప్పటికీ నిజానికి పథకం ఎత్తివేయడానికి ఇది ఒక తురుపు ముక్క మాత్రమే. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో కుటుంబానికి 100 రోజులు పనిదినాలు గ్యారెంటీగా కల్పించాల్సి ఉండగా ఇప్పటి వరకు సగటున 50 పని దినాలు కూడా కల్పించలేదు. అందులో మన రాష్ట్రం కొంత వరకు మెరుగ్గా ఉన్నప్పటికీ బీహార్ లాంటి అనేక రాష్ట్రాల్లో 35 దినాలు కూడా లేవు. చట్ట ప్రకారం పనికల్పించని రోజులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. మోడీ ప్రభుత్వం దీనిని ఎక్కడా అమలు జరపలేదు. భూస్వాములు, పెత్తందార్ల ఒత్తిళ్ళకు లొంగి క్రమంగా ఈ చట్టాన్ని నీరుగార్చేందుకు పథకంగా మారుస్తున్నది. ఇప్పటి వరకు హక్కుగా ఉన్న ఈ చట్టంవల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి దొరకడమేగాకుండా వ్యవసాయ వేతనాల స్థిరీకరణకు కూడా కొంత వరకు తోడ్పడింది. వలసలు కొంత వరకు అరికట్టబడ్డాయి. పట్టణాలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తుండగా ఉన్న పథకాన్ని నీరుగార్చడం క్షంతవ్యం కాదు. కావున వ్యవసాయ కూలీలు, పేద, మధ్యతరగతి రైతులు, పట్టణ శ్రామికులు ఉపాధిహామీ పథకాన్ని ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుయత్నాలను ప్రతిఘటించి ఈ చట్టాన్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.
(వి. శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
