సెకి ద్వారా అదాని సంస్థ చేసుకున్న సోలార్‌ విద్యుత్‌ ఒప్పందాలు రద్దు చేయాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 15 డిసెంబర్‌, 2025.

సెకి ద్వారా అదాని సంస్థ చేసుకున్న సోలార్‌ విద్యుత్‌ ఒప్పందాలు రద్దు చేయాలి

- సిపిఐ(యం) డిమాండ్‌

రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయలకు పైగా భారం పడే 7 వేల మెగావాట్ల అదానీ సోలార్‌ విద్యుత్‌ ఒప్పందాలను రద్దు చేయాలని సిపిఐ(యం) ఆంధ్రప్రదేశ్‌ కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్ళ మేరకు గత వైసిపి ప్రభుత్వం సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకి) ద్వారా అదానీ సంస్థతో అవినీతికర, అక్రమ ఒప్పందాలను చేసుకున్నది. గత ప్రభుత్వ తప్పులను సరిదిద్ది ఒప్పందాలను రద్దుచేస్తామని నాడు ప్రతిపక్షంలో వుండగా చంద్రబాబు చెప్పారు. హైకోర్టులో తెలుగుదేశం పార్టీ తరఫున పయ్యావుల కేశవ్‌ కేసు వేశారు. కానీ వారు మాట తప్పి కొనసాగిస్తున్నారు. అదానీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టడం సరి కాదు. ఈ ఒప్పందం వల్ల లక్ష కోట్ల రూపాయలు పైగా 25 సంవత్సరాల కాలంలో ప్రజలపై అదనపు భారం పడుతుందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గత ప్రభుత్వ పెద్దలకు ముడుపులు  ఇచ్చి ఈ ఒప్పందం చేసుకున్నట్లు అమెరికా కోర్టులలో ఆ దేశ ప్రభుత్వమే కేసు నమోదు చేసింది.

సోలార్‌ విద్యుత్‌ యూనిట్‌ రెండు రూపాయల కంటే తక్కువగానే లభిస్తున్నప్పటికీ రూ.2.49ల చొప్పున ఒప్పందం చేసుకోవడ గర్హనీయం. ఇప్పటికే 23 వేల మెగా వాట్లకు పైగా సోలార్‌, పవన ఇతర రకాల విద్యుత్‌ అందించే ఒప్పందాలు పలు సంస్థలతో జరిగాయి.

జనవరి నుండి అదానీ సంస్థ అందించే విద్యుత్తు దశలవారీగా అందుబాటులో వస్తుంది. దీనితో  మిగులు ఏర్పడి ప్రభుత్వ థర్మల్‌,ఇతర కేంద్రాల్లో విద్యుత్‌ సరఫరా ఉత్పత్తి నిలిపివేయవలసి వస్తుంది. ఇప్పటికే పలు సందర్భాలలో ఈ విధంగా విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేస్తున్నారు.ఉత్పత్తి నిలిపినా ఫిక్స్‌డ్‌ చార్జీల భారం మాత్రం వినియోగదారులపై పడుతుంది.

కూటమి ప్రభుత్వం గత 18 నెలల్లో రూ.15,485 కోట్లు ఎఫ్‌పిపిసిఎ (సర్దుబాటు చార్జీలు) ప్రజలపై మోపింది. మరో రూ.12717 కోట్లు ట్రూ అప్‌ చార్జీల భారం వేయటానికి రంగం సిద్ధం అయ్యింది. ఈ స్థితిలో అదానీ సంస్థతో చేసుకున్న ఒప్పందం మరింత ప్రమాదకరంగా మారనున్నది. కావున రాష్ట్ర ప్రజలకు, విద్యుత్‌ సంస్థలకు హానికరంగా మారిన 7వేల మెగా వాట్ల అదానీ,సెకి ఒప్పందం తక్షణమే రద్దు చేయాలని సిపిఐ(యం) కోరుతున్నది.

ఈ  అక్రమ,ప్రజా వ్యతిరేక ఒప్పందంపై విచారణ జరపడానికి కూడా ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. కూటమి ప్రభుత్వం మాట తప్పి అదానీ, వైసిపి అవినీతి ఒప్పందాన్ని రక్షిస్తున్నది. ప్రజల నెత్తిన భారం వేస్తున్నది. ఇప్పటికైనా ప్రజలకుచ్చిన మాట ప్రకారం ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. ఒప్పందం రద్దుకై ప్రభుత్వం పై ప్రజలు ఒత్తిడి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి