
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 డిసెంబర్, 2025.
శాస్త్రీయ భావాలు పెంపొందిస్తేనే శాస్త్ర సంకేతిక అభివృద్ధి
ముఖ్యమంత్రికి సిపిఐ(యం) విజ్ఞప్తి
ప్రతిరోజూ శాస్త్ర సాంకేతికాభివృద్ధి గురించి మాట్లాడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న తిరుపతిలో జరిగిన సభలో అశాస్త్రీయ భావాలను వెదజల్లడం విస్మయం కలిగిస్తోంది. దేశాభివృద్ధికి ఆటంకంగా ఉండే ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని ముఖ్యమంత్రి వల్లెవేయడం పట్ల సిపిఐ(యం) ఆందోళన వ్యక్తం చేస్తున్నది. పురాణాలను చరిత్రగా వక్రీకరించే ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భుజాన వేసుకోవడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. లౌకిక పార్టీగా ప్రజలు భావించే తెలుగుదేశం పార్టీ ఇలా వ్యవహరించడం రాష్ట్రానికి ఎనలేని నష్టాన్ని కలిగిస్తుంది. ప్రజలలో శాస్త్రీయ దృక్ఫథాన్ని పెంచాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ఎ (హెచ్) స్పష్టంగా పేర్కొనగా ముఖ్యమంత్రి బాధ్యతల్లోని వ్యక్తి అందుకు భిన్నంగా మాట్లాడడం అభ్యంతరకరం.
ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధమైన విజ్ఞానభారతి కార్యకలాపాలను రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్ చేయడం సరికాదు. మహోంజదరో ` హరప్పా సంస్కృతి భారతీయ చరిత్రకు సంబంధించినవి తప్ప పురాణం కాదు. అలాగే ఆర్యభట్ట, భాస్కరుడు వంటి వారు శాస్త్ర సాంకేతిక విజ్ఞానము, గణితానికి సంబంధించిన శాస్త్రజ్ఞులు తప్ప పురాణ పురుషులు కాదు. వారు కనుగొన్న ఖగోళ, గణిత శాస్త్ర విజ్ఞానం ప్రపంచ ప్రజలందరికీ సంబంధించినదే. అలాగే న్యూటన్, డార్విన్, ఆర్కిమెడిస్ వంటి వారు విదేశీయులైనా వారు ప్రతిపాదించి, రుజువు చేసిన భౌతికశాస్త్ర, జీవనశాస్త్ర, గణిత సిద్ధాంతాలు విశ్వజనీనమైనవి. ఇదే సభలో పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోగన్ భగవత్ ఫిన్‌ల్యాండ్‌ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం విదేశీ సిద్ధాంతం కాదా?
అంతేగాక ప్రపంచ చరిత్రలో శాస్త్ర విజ్ఞాన పురోగమనానికి మతతత్వ భావనలు ఆటంకంగా ఉంటూ వచ్చాయి. తొలి పారిశ్రామిక విప్లవానికి ముందు పశ్చిమ దేశాల్లో సైంటిస్టులను హత్యచేసిన ఘనత మతోన్మాదులదేనని ముఖ్యమంత్రి గుర్తించాలి. సైన్సు వాస్తవాలు, రుజువల మీద ఆధారపడినది కాగా విశ్వాసంపై నిలబడేది మతం. ఈ రెండిరటినీ కలగాపులగం చేయడం ప్రజలను తప్పుదారిపట్టించడమే అవుతుంది.
భారత రాజ్యాంగం పేర్కొన్న రీతిన శాస్త్రీయ దృక్ఫథాన్ని పెంచడానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టాలి. అలాగే లౌకికతత్వాన్ని సమాజంలో పాదుకొల్పడానికి కూడా సర్కారు కృషి చేయాలి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్.టి. రామారావు అద్వాని రథయాత్ర చేపడితే లౌకికతత్వానికి నష్టమని ఆనాటి బిజెపి నాయకులను హెచ్చరించిన విషయం అందరికీ తెలుసు. అయినా లౌకికపార్టీగా ముద్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఆర్‌ఎస్‌ఎస్ వాదనల్ని బలపర్చే వైఖరి తీసుకోవడం కేవలం రాష్ట్రానికేగాక ఆ పార్టీకి కూడా నష్టకరం.
ఎంతమంది పిల్లల్ని కనాలన్నది ఆయా కుటుంబాలు, అంటే భార్య, భర్తలకు సంబంధించిన అంశం కాగా దాన్ని పాలనతోనూ, బహిరంగ వేదికల ద్వారానూ ఒత్తిడి చేయడం సరికాదు. వారి వ్యక్తిగత జీవితం, హక్కులలోకి చొరబడడమే అవుతుంది.
స్పైడర్ మ్యాన్, బ్యాట్‌మ్యాన్ వంటి వాటిని మనదేశం, రాష్ట్రంలోకి దిగుమతి చేసింది. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనన్నది లోక విధితమే! అలాంటి ఊహాజనితమైన ఫిక్షన్ హీరోలను ప్రమోట్ చేయడం ఎలాంటి పొరపాటో పురాణ పాత్రలను వాస్తవంలా భ్రమింపజేయడమూ అలాంటిదే! ఒకవైపు పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు, విదేశీ విద్యావిధానాన్ని దిగుమతి చేసుకుంటూ మరోవైపు విదేశీ సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడడం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం.
ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి పునరాలోచించుకొని ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతంతో చెట్టాపట్టాలు మాని సమాజంలో శాస్త్రీయ దృక్ఫథాన్ని, లౌకికతత్వాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలని కోరుతున్నాము. ముఖ్యంగా విద్యార్థులు, యువతలో శాస్త్రీయ భావాల వ్యాప్తికి తోడ్పడాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
