ట్రంప్‌ పదేపదే అవమానిస్తున్నా మోడీ తీరు సిగ్గుచేటు

ఈరోజు (11 జనవరి, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

ట్రంప్‌ పదేపదే అవమానిస్తున్నా

మోడీ తీరు సిగ్గుచేటు 

భారతదేశ స్వారభౌమత్వానికి, ఆత్మగౌరవానికి దెబ్బ 

సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు 

తెలుగు రాష్ట్రాల శాంతియుత పరిష్కార సూచనను స్వాగతిస్తున్నాం

అమరావతి భూసమీకరణను తొలి నుండీ వ్యతిరేకిస్తున్నాం

రైతుల పక్షాన నిలిచిన అప్పలరాజుపై పిడి చట్టం అన్యాయం

 

భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ట్రంప్‌ పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నా ప్రధాని మోడీ నోరెత్తకపోవడం సిగ్గుచేటని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. పాకిస్తాన్‌, భారత్‌ లాంటి రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానని ట్రంప్‌ చెబుతుంటే పాకిస్తాన్‌పై అఖండ విజయం సాధించామని మోడీ చెబుతున్నారని ఈ రెండిరటిలో ఏది నిజమో, యుద్ధాన్ని ఎవరు ఆపారో మోడీ తేల్చాలన్నారు. విజయవాడలోని బాలోత్సవ భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరావుతో కలిసి రాఘవులు మాట్లాడారు. ట్రంప్‌ వ్యాఖ్యలను తిరస్కరిస్తున్నారా ? అంగీకరిస్తున్నారా ? సమాధానం చెప్పాలన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంలో మోడీతీరు సిగ్గుచేటన్నారు. ట్రంప్‌ యుద్ధం రగల్చడం తప్ప ఆపలేదని, 70 వేలమంది పాలస్తీనియన్లను హత్యాకాండ చేస్తుంటే ఇజ్రాయిల్‌ను ప్రోత్సహించారని అన్నారు. ఇరాన్‌, యెమెన్‌ మీద దాడి చేశారని, వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్‌ చేశారని, మెక్సిలో, కొలంబియా దేశాలను బెదిరిస్తున్నారని అన్నారు. గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంటానని చెబుతున్నారని, ఆయన శాంతికి ప్రతినిధి కాదని అతనికి నోబెల్‌ కాదని, ‘బిగ్‌బుల్లీప్రైజ్‌’ ఉంటే ఇవ్వాలని అన్నారు. సుంకాల అగ్రిమెంట్‌కు మోడీ ఫోన్‌ చేయకపోవడం వల్ల కుదరలేదని అమెరికా కామర్స్‌ సెక్రటరీ లుత్నిక్‌ చెబితే తాము ఎనిమిదిసార్లు మాట్లాడామని ప్రాధేయపడడం దేశ ఆత్మగౌరవానికి దెబ్బని అన్నారు. 

 

 రాజధానిని వివాదాస్పదం చేయడం అర్థరహితం

రాజధాని అమరావతి అంశాన్ని వివాదాస్పదం చేయడం అర్థరహితమని, జగన్‌ అటువంటి పద్ధతిని వదిలేసి అమరావతిని అంగీకరించి అభివృద్ధికి అవసరమైన సూచనలు ఇవ్వాలని రాఘవులు సూచించారు. 15 ఏళ్లుగా రాజధాని లేదని, ఇప్పుడు జరుగుతున్న పనుల్లో లోపాలు ఉంటే వాటిపై విమర్శలు చేయవచ్చు తప్ప స్థలాన్నే వివాదాస్పదం చేయడం అర్థరహితమని చెప్పారు. ల్యాండ్‌ పూలింగును తాము తొలి నుండి వ్యతిరేకిస్తున్నామని, పరిపాలనా కేంద్రం నిర్మించుకునేందుకు అవసరమైన భూమిని తీసుకునేందుకు అభ్యంతరం లేదని అన్నారు. రెండోదశ పూలింగు అవసరం కోసం కాదని, వ్యాపారం కోసం రియల్‌ ఎస్టేట్‌ భూమ్‌ కోసమని అన్నారు. రెండోదశ పూలింగు అర్థం లేనిది అన్యాయమైనదని తెలిపారు. 

 

అర్థరహిత అంశాలపై చర్చ చేస్తున్నారు.

రాష్ట్రంలో టిడిపి, వైసిపిలు అర్థరహితమైన అంశాలపై చర్చ చేస్తూ అవసరమైన అంశాలను పక్కకు నెట్టేస్తున్నారని విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్టులు, వెలిగొండ, హంద్రీనీవా, గాలేరు నగరి అలాగే ఉన్నాయని, ఒరిస్సా వివాదంతో                  ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తికాలేదని తెలిపారు. పోలవరం నత్తనడకన సాగుతోందని ఇటువంటి సమయంలో లేని వాటి మీద వివాదాలు సృష్టించి ఉన్నవాటిని మర్చిపోయేలా చేయడం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అన్యాయం చేయడమేనని అన్నారు.  

 

నష్టం చేసే చట్టాన్ని సిఎం ఆమోదించడం అన్యాయం 

రాష్ట్రంలో ప్రజల ఉపాధికి తీవ్ర నష్టం కలిగించే విజి జీరాంజీ పథకాన్ని మోడీ మెప్పుకోసం చంద్రబాబునాయుడు ఆమోదించడం అన్యాయమని రాఘవులు విమర్శించారు. బిజెపి చేస్తున్న అన్యాయాన్ని కప్పిపెట్టే విధంగా సిఎం వ్యవహరిస్తున్నట్లు భావించాల్సి వస్తుందని అన్నారు. పైగా సమర్థవంతంగా అమలు చేయాలని, గొప్పచట్టమని చంద్రబాబు మాట్లాడటం ఉపాధి కోరుకునే వారికి అన్యాయం చేయడమేనన్నారు.

 

శాంతియుత పరిష్కారాన్ని స్వాగతిస్తున్నాం

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రులు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని, సంతోషకరమని, దీన్ని సిపిఎం కూడా ఆహ్వానిస్తుందని రాఘవులు చెప్పారు. అది నిజంగా చెప్పారా ప్రతిపక్షాల విమర్శలను తప్పించుకునేందుకు చెప్పారా అనేది వారి కార్యాచరణపై ఆధారపడి ఉంటుందని అన్నారు నీటి వివాదాలను, విభజన సమయంలో ఉన్న అపరిష్కృత సమస్యలను పరిష్కరించేందుకు నిర్దిష్ట కార్యాచరణ పెట్టుకుని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. 

 

విజయ్‌ బిజెపికి సహాయపడకూదు 

తమిళనాడులో పార్టీ పెట్టిన విజయ్‌ను బెదిరించేందుకు సెన్సార్‌ బోర్డు సభ్యుడి సాయంతో బిజెపి ప్రయత్నిస్తోందని అన్నారు. ఇప్పటి వరకూ విజయ్‌ లౌకికవాదులుగా ఉంటామని, స్వతంత్రంగా పోటీచేస్తామంటున్నారని, అలా ఉంటే మంచిదేనని అన్నారు. రాజకీయ ఒత్తిడిలో బిజెపికి సహాయపడకుండా ఉండాలనేది తమ కోరికని పేర్కొన్నారు. 

 

ప్రశ్నించేవారిపై అక్రమ నిర్బంధాన్ని ఆపాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు 

రాష్ట్రంలో ప్రజల తరుపున ప్రశ్నించేవారిపై అక్రమ నిర్బంధాన్ని ఆపాలని, అనకాపల్లి జిల్లా రైతు నాయకులు అప్పలరాజుపై పెట్టిన పిడియాక్టును ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అన్నారు. అధికారంలోకి రాకముందు కూటమి పార్టీలు ప్రజాస్వామ్య హక్కులను కాపాడతామని, నిర్బంధ చర్యలను చేపట్టబోమని ప్రకటనలు చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాసమస్యల కోసం పోరాడుతున్న వారిపైనా అన్యాయపు భూసేకరణను ప్రశ్నించిన వారిపైనా, ప్రజల పక్షాన నిలిచిన రైతు నాయకులపైనా తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలపై పోరాడేవారిపై పిడి చట్టం పెట్టడం అన్యాయమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా పిడి చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని అన్నారు. మేధావులు, పౌరహక్కుల సంఘాలు, విద్యావేత్తలు, కార్మిక, కర్షక సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. అలాగే ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో గిరిజనుల భూములను పెత్తందారులు లాక్కుని పంటను ధ్వంసం చేశారని, కాపాడుకోవడానికి వెళ్లిన గిరిజనులపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. ఆర్‌డిఓ పరిశీలించి గిరిజనుల పట్టాలన్నీ సరైనవేనని తేల్చారన్నారు. అయినా పెట్టిన కేసులను ఉపసంహరించలేదన్నారు. నిర్వాసితుల సమస్యలపై ఆందోళన చేస్తున్న వారిని గృహనిర్బంధం చేయడం వంటి చర్యలను విడనాడాలని అన్నారు.