కృష్ణా జిల్లాలో కోడిపందేల బరివద్ద దళితులపై దాడిచేసిన నిర్వాహకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 18 జనవరి, 2026.

కృష్ణా జిల్లాలో కోడిపందేల బరివద్ద దళితులపై దాడిచేసిన 

నిర్వాహకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి

కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని ఉప్పులూరు కోడిపందేల బరి వద్ద దళితులను బట్టలూడదీసి, తాళ్లతో కట్టేసి అమానుషంగా హింసించిన నిర్వాహకులను అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. చట్టవిరుద్దంగా కోడి పందేలు నిర్వహించినవారిపైనా, వారిని అనుమతించిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితులకు రక్షణ కల్పించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నది. ప్రజలందరూ దీనిని తీవ్రంగా నిరసించాలని విజ్ఞప్తి చేస్తున్నది.

సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, కృష్ణాజిల్లా కార్యదర్శి వై.నరసింహారావు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.మాల్యాద్రి, యం.హరిబాబు తదితరులు ఆ గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

సంక్రాంతి సందర్భంగా ఈ నెల 15వ తేదీన నిర్వహించిన కోడి పందేల బరి వద్ద నిర్వహించే పత్తలా ఆట కోసం నిర్వాహకులు తోట్లవల్లూరుకు చెందిన 11 మందిని కూలి కోసం తీసుకువెళ్లారని, వచ్చిన డబ్బుల్లో లెక్క తేడా రావడంతో, కూలికి వచ్చినవారే ఆ సొమ్మును తీశారనే నెపంతో బట్టలూడదీసి తాళ్లతో కట్టేసి, అత్యంత దారుణంగా, అమానుషంగా హింసించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నది. ఆ దారుణాన్ని వీడియోకూడా చిత్రీకరించడం వారి రాక్షసానందానికి నిదర్శనం.

హైకోర్టు తీర్పును సైతం ధిక్కరిస్తూ, అధికార పార్టీ అండదండలతో రాష్ట్ర మంతటా బరులువేసి పందేలను నిర్వహించి కోట్లలో కోడి పందేలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం గుడ్లప్పగించి చూసిందే తప్ప ఎక్కడా నిలువరించే ప్రయత్నం చేయలేదు. పైగా ప్రజా ప్రతినిధులు, మంత్రులు సైతం ప్రత్యక్షంగా హాజరై ప్రోత్సహించారు. అలాంటి ప్రజా ప్రతినిధులపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

 

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి