
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 01 ఫిబ్రవరి, 2026.
రాష్ట్రానికి మొండిచేయి
కేంద్ర బడ్జెట్ ప్రజావ్యతిరేకమైంది
కార్పొరేట్లకు వరాలు కురిపించింది.
- సిపిఐ(యం)
ఈ రోజు పార్లమెంటులో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపిందని, కేంద్రం నిధులు కేటాయించేటట్లు చేయడంలో డబులఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్ప్పుకుంటున్న రాష్ట్ర కూటమి ప్రభుత్వం విఫలమైందని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు.
ఈ రోజు తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు, వెనుకబడిన ప్రాంతాల అభివ ద్ధి, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి ఇవ్వలేదు. అప్ప్పులు ఇప్పించి దాన్నే సహాయంగా ప్రకటించుకోవడం దారుణమన్నారు.
ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు గతంకన్నా నిధులు తగ్గించి 3వేల కోట్లుకు కుదించారు. ఈ నిధులతో 2026లోనే ఎలా పూర్తి చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. నిర్వాసితుల పునరావాసానికి 21వేల కోట్లు అవసరం కాగా ఇందులో ఎంత కేటాయించారో కూడా చెప్పలేదు. మొదటిదశలో కూడా 20శాతమే పునరావాసం పూర్తయినట్లు చెప్తున్నారు. అదికూడా వాస్తవం కాదు. నిర్వాసితులను గాలికి వదిలి పోలవరం ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. అమరావతికి గ్రాంటు ఇవ్వడానికి బదులుగా అప్ప్పులు ఇప్పించడం రాష్ట్రానికి భారం అవుతుంది.
రాయలసీమ, కడప ఉక్కు, ఉత్తరాంధ్ర, ప్రకాశం (మార్కాపురం) వెనుకబడిన ప్రాంతాలకు పూర్తి అన్యాయం జరిగింది. మన రాష్ట్రానికి కేంద్రం సహాయం చేస్తున్నదని కూటమి నేతలు రోజూ గొప్పలు చెప్ప్పుకోవటం సిగ్గుచేటు. వారం వారం ఢిల్లీ ప్రదక్షిణలు చేస్తున్నా కేంద్రం నిధులు విదల్చలేదు. ఈ బడ్జెట్‌లో రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన నిధుల్లో 2లక్షల కోట్లు కోతపెట్టారు. కేంద్రంలో బిజెపిని బలపరుస్తున్న తెలుగుదేశం, వైసిపి పార్టీలు దీనిపై స్పందించాలి.
రాష్ట్రానికి, దేశ ప్రజలకు అన్యాయం చేసి కేంద్ర నిధులను కార్పొరేట్లకు పందేరం చేస్తున్న కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకించాలని, రాష్ట్రానికి నిధులు సాధించడానికి ఉద్యమించాలని ప్రజలకు సిపిఐ(యం) రాష్ట్రకార్యదర్శి విజ్ఞప్తి చేశారు.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
