
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 02 మార్చి, 2026.
పశ్చిమ ఆసియా ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ప్రవాస ఆంధ్రులను తక్షణం సురక్షితంగా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దురాక్రమణ దాడిని తక్షణం ఆపాలని మోడీ ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. అమెరికా దురాక్రమణను ఖండించాలని, శాంతి పునరుద్దరణకు తోడ్పడాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలాదిమంది గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్నారు. ఇప్ప్పుడు అక్కడ నెలకొన్న పరిస్థితుల్లో అనిశ్చితితో పాటు, భద్రత కొరవడింది. కువైట్, ఖతార్‌లలో ఎమర్జెన్సీ విధించడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు తమ గదులకే పరిమితమయ్యారు. కొందరు స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నించినా గగనతలం మూసివేత, విమానాల రద్దు కారణంగా విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా దేశాల్లో నివాసం ఉంటున్న ఆంధ్రుల నివాస స్థలాల మీదుగా రాడార్లు దూసుకొస్తున్నాయని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వారి కుటుంబాలు వారి రక్షణ కోసం భయపడి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
కావున కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని ప్రవాసాంధ్రులందరినీ సురక్షితంగా, భద్రంగా తిరిగి రాష్ట్రంలోని వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
