18 ఏళ్లు నిండిన ప్రతి నిర్వాసితునికీ ప్యాకేజీ పోలవరం అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ

ఈరోజు (08 మార్చి, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

18 ఏళ్లు నిండిన ప్రతి నిర్వాసితునికీ ప్యాకేజీ 

పోలవరం అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ

కొన్నేళ్లుగా సిపిఎం ఏదైతే చెప్పిందో దాన్నే కాగ్ నివేదిక రూఢీ పరిచింది

చంద్రబాబు జనాభా పాలసీ మహిళా వ్యతిరేకం

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు 

 

పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసిత గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ప్యాకేజీ ఇవ్వాలని, ఇప్పటి వరకూ జరిగిన అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండు చేశారు. ఆదివారం విజయవాడలోని ఎంబివికెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్టుపై ఆయన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.రవి, బొప్పెన కిరణ్, మొడియం నాగమణితో కలిసి ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకు అన్యాయం జరుగుతోందని సిపిఎం ఏదైతే చెబుతుందో అదే కాగ్ రిపోర్టు వెల్లడించిందని తెలిపారు. పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని, అనర్హులకు వందల కోట్లు కట్టబెట్టారని, కాంట్రాÅ£్టర్లు దోచుకున్నారని వీటిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండు చేశారు. డయాఫ్రంవాల్ పేరుతో సుమారు రెండువేల కోట్లు నష్టం చేశారని, నిర్మాణానికి కావాల్సినంత సమయం ఉన్నా సరైన సమయంలో చేయకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే అది దెబ్బతిందని కాగ్ నివేదికలో వెల్లడించారని తెలిపారు. దీనికి కారకులైన వారి నుండి ఆ మొత్తాన్ని ప్రభుత్వం రాబట్టాలన్నారు. అదంతా ప్రజల సొమ్మని పేర్కొన్నారు. మొదటి కాంటూరు 41.15 మీటర్ల పరిధిలో 38 వేల నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయని, వీటిల్లో 22 వేల మందిని సిపిఎం పోరాటం తర్వాత చేర్చారని అన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం స్వాధీనం చేసుకునే వరకూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ముంపు ప్రాంతానికి సంబంధించిన కాంటూరు లెక్కలు తప్ప్పుల తడకగా ఉన్నాయని ఎప్పటి నుండో చెబుతున్నామని, కాగ్ నివేదిక కూడా అదే చెప్పిందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహించిన లైడార్ సర్వే నివేదిక కూడా కాగ్‌కు ఇవ్వలేదని, దీనివెనుక ప్రభుత్వ వైఫల్యం ఉందని తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో ఉన్న 1.06 లక్షల మంది నిర్వాసిత కుటుంబాలకు ఒకేసారి పునరావాసం కల్పించాలని డిమాండు చేశారు. చట్టం ప్రకారం నీటిని నిల్వ చేయడానికి ఆరునెలల ముందే పునరావాసం పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటికీ 11 నుండి 13 శాతం లోపే జరిగిందని, పునరావాసం కల్పించడంలో పూర్తిగా విఫలమైందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం, కాంట్రాక్టులపై ఉన్న శ్రద్ధ త్యాగం చేసిన ప్రజలకు పునరావాసం కల్పించడంపై పెట్టడం లేదని అన్నారు. ప్రతి కుటుంబానికి ప్రాజెక్టు కింద సాగు సదుపాయాలు ఉన్న ఎకరం భూమి ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదని భూసేకరణలోనూ అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. నిర్వాసితులకు ఇవ్వాలనే పేరుతో సాగుకు పనికిరాని భూమిని ఎకరం రూ.12.50 లక్షల పెట్టి కొనుగోలు చేశారని, అదే నిర్వాసితులు నగదు కోరితే  ఎకరా రూ.3.50 లక్షలు మాత్రమే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రూ.10 లక్షల ఆర్Êఆర్ ప్యాకేజీ ఇస్తామని చెప్పినా కొన్ని కుటుంబాలకు రూ.6.80 లక్షల ఇచ్చి చేతులు దులుపుకున్నారని, దీనికోసం విడుదల చేసిన రూ.550 కోట్లనూ ఖర్చు చేయలేదని వివరించారు. ముఖ్యంగా కాలనీల్లో ఎటువంటి సదుపాయాలూ లేవని పేర్కొన్నారు. విద్య, వైద్య, అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, కనీసం తాగడానికి నీరు, విద్యుత్ సదుపాయం కూడా కల్పించలేదని పేర్కొన్నారు. ముంపులో లేదని పునరావాస కాలనీ కడితే అక్కడకు కూడా వరదనీరు వచ్చి చేరుతోందని అన్నారు. కట్టిన ఇళ్లుకూడా దెబ్బతింటున్నాయని, వీటన్నిటిపై విచారణ చేయించాలని డిమాండు చేశారు. మొత్తం పోలవరం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని, పునరావాసం ముందుగా పూర్తి చేయాలని, ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని, భూమికి భూమి ఇవ్వాలని డిమాండు చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. 

సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శులు ఎ.రవి మాట్లాడుతూ పునరావాసం పూర్తయితేనే నిర్మాణం పూర్తయినట్లని, కాలనీల్లో ఇప్పటికీ 85 శాతం మందికి ఆరోగ్య సదుపాయాలు కల్పించలేదని, తాగునీరు లేదని, బలవంతంగా ముంచేస్తున్నారని అన్నారు. సిపిఎం ఆధ్వర్యాన దీనిపై అనేక పోరాటాలు నిర్వహించామని చెప్పారు. కొత్తగా కట్టిన కాలనీల్లో నిర్వాసితులకు ఇచ్చిన ఇళ్లు వారివే అని ఇప్పటి వరకూ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని అమలు చేయడం లేదని, గిరిజనులకు తీవ్ర అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు దళారులు పేదల సొమ్మును కాజేశారని పేర్కొన్నారు. 

పోలవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో అనర్హులకు పరిహారం ఇచ్చారని, గ్రామాలు మునిగిపోతున్నా రికార్డుల్లో ముంపులో లేదనే పేరుతో పరిహారం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి జీవనాడి అనిచెబుతూ నిర్వాసితులను తీవ్ర నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. బాధితుల సమస్యలపై సిపిఎం పక్షంగా తాము సంవత్సరాల తరబడి పోరాడుతున్నా ప్రభుత్వాలకు పట్టలేదని, తాము చెప్పిన అంశాలనే కాగ్ ఎత్తి చూపిందని అన్నారు. టిడిపి, వైసిపి ప్రభుత్వాలకు ప్రాజెక్టు పూర్తి తప్ప నిర్వాసితుల గోడు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగు నీటిని కూడా 10 కిలోమీటర్ల దూరం నుండి మంచినీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి కల్పించారని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ముంపు ప్రాంతాల్లో తిరిగి ఏవైతో సమస్యలు ఉన్నాయని చెప్పారో వాటినే కాగ్ నివేదిక వెల్లడించిందని, సిపిఎం చెప్పిందే నిజమని కాగ్ నివేదిక కూడా వెల్లడించిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన వారికి న్యాయం చేయాలని అన్నారు. 

జనాభా పాలసీ మహిళలకు వ్యతిరేకం

ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న జనాభా పాలసీ మహిళలకు వ్యతిరేకమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. ముగ్గురు, నలుగురు పిల్లలను కనాలని చెప్పడం మహిళా వ్యతిరేక పాలసీ అని తెలిపారు. ఒకవైపు ఆరఎసఎస్ ముస్లిం జనాభా పెరుగుతోందని, హిందువులను కనాలని ప్రచారం చేస్తుంటే దానికి అనుగుణంగా ఇక్కడ పిల్లలను కనాలని చంద్రబాబు చెబుతున్నారని తెలిపారు. ఎంతమంది పిల్లలను కనాలదేని మహిళల హక్కని అన్నారు.  పిల్లలను కనాలని చెప్పడం వెనుక కార్పొరేట్ సంస్థలకు చౌకగా కార్మికులను కట్టబెట్టే కుట్ర ఉందని పేర్కొన్నారు. పోటీ మార్కెట్లో అదనపు కూలీలను, ఉద్యోగులను తయారు చేసేందుకు వీలుగా దీన్ని రూపొందించారని పేర్కొన్నారు.  అసెంబ్లీలో ఈ పాలసీపై ప్రకటన చేసే సమయంలోనే చంద్రబాబు మహిళా శ్రామికశక్తి పెరగాలని అన్నారని, దీనివెనుక ఉద్దేశం తక్కువ వేతనాలకు మహిళా కార్మికులను తయారు చేయడమేనని పేర్కొన్నారు. పిల్లలను కనాలని చెప్పే ముఖ్యమంత్రి పెళ్లయి కొత్తగా కాపురాలు పెట్టుకున్న వారికి ఇళ్లు కూడా ఇవ్వడం లేదని అన్నారు. మరోవైపు ఆర్థిక ఇబ్బందుల మధ్యలో పిల్లల వైద్య, విద్యా ఖర్చులు పెరిగిపోయాయని, ఇద్దరికే భరించలేని స్థితిలో ఎక్కువమంది పిల్లలను కనాలని చెప్పడం అంటే వారి జీవితాలను ప్రమాదంలో పడేయడమేనని అన్నారు. మొత్తంగా పాలసీయే ప్రమాదకరమైందని, దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని తెలిపారు. 

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకించి మహిళలకు సిపిఎం తరుపున రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానాలు అమలు జరిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మహిళకు రూ.1500, గ్రామాల్లో మూడుసెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల భూమి ఇస్తామన్న వాగ్దానాన్ని మర్చిపోయారని, దీన్ని అమలు చేయాలని కోరారు. గత ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు మహిళలకు ఇచ్చిన హామీలు అధికారంలో వచ్చి 20 నెలలు దాటినా అమలు చేయలేదని, మహిళా దినోత్సవం సందర్భంగా వారికిచ్చిన హామీలు అమలుచేసి మాట నిలబెట్టుకుని శుభాకాంక్షలు తెలపాలని అన్నారు.