అతి పెద్ద భూ దురాక్రణదారు ప్రభుత్వమే

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
 విజయవాడ,
తేది : 10 మార్చి, 2026.
అతి పెద్ద భూ దురాక్రణదారు ప్రభుత్వమే
ప్రభుత్వ, పేదల భూములాక్రమించిన పెత్తందారులపై చర్యలు తీసుకోండి
సిపిఐ(యం) డిమాండ్
భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించిన ముఖ్యమంత్రి భూ దురక్రమణలకు పాల్పడిన పెత్తందార్లు, కార్పొరేట్లు, ప్రజా ప్రతినిధులపై చర్య తీసుకొని తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
మీ భూమి మీ హక్కు అంటున్న చంద్రబాబు నాయుడుగారు ఆచరణలో “మీ భూమి మా హక్కు”  అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అవసరం వున్నా లేకున్నా అభివృద్ధి జపం చేస్తూ వేలాది ఎకరాలు రైతుల నుండి వారి ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేకుండా బలవంతంగా  గుంజుకుంటున్నది. ప్రశ్నించిన వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నారు. తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. రైతులను, కూలీలను, వ త్తిదారులను బెదిరిస్తున్నారు. ఈ నిరంకుశ పద్ధతులకు స్వస్తి చెప్పి దురాక్రమణకు పాల్పడుతున్న బడా వ్యక్తులపై ప్రభుత్వానికి ధైర్యం ఉంటే చర్యలు తీసుకోవాలి. విశాఖ గీతం యూనివర్సిటీ యాజమాన్యం ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా ఏమీ చర్యలు తీసుకున్నారు? కానీ రైతుల భూములకోసం పోరాడుతున్న అప్పలరాజును పిడియాక్టు కింద జైలుకు పంపించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది. ఇలాంటివి చాలా ఉదారణలున్నాయి. పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పిస్తామని నమ్మ పలికి ఏళ్ళు గడుస్తున్నా పరిశ్రమలు పెట్ట కుండా భూములను తాకట్టు పెట్టి బ్యాంకు రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన వారు, పరిశ్రమలు పెట్టకుండా రియల్ ఎస్టేటుకు మళ్లించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర భూస్వాములు అధికారులతో కుమ్మక్కై అక్రమంగా భూములు తమ స్వాధీనంలో పెట్టుకున్నారు. గిరిజన పేదలకు న్యాయం దొరకడం లేదు. నలభై యాభై సంవత్సరాలుగా దళితులు తదితర నిరుపేదలు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను పెత్తందార్లు లాగేసుకున్నారు. ప్రభుత్వం పేదల భూ హక్కులను గుర్తించడం లేదు. రొయ్యలు, చేపల చెరువులకు బినామీగా అసైన్డ్ భూములు మారిపోయాయి.
దీర్ఘకాలంగా 22 ఏ కింద పేద, మధ్య తరగతి రైతుల భూములను వివాదంగా మార్చిన వాటిపై అధికారుల చుట్టూ కాళ్లరిగేటట్లు తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదు. ఏడాదిలోగా పరిష్కరిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు ప్రభుత్వం రెండేండ్లయినా పరిష్కరించడంలో విఫలమైంది. ఇప్పుడు మరలా ఇంకో సంవత్సరం అంటున్నారు. దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి జూన్‌లోగా పరిష్కరించాలని సిపిఐ(యం) కోరుతున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి