పుట్టా మహేష్‌కుమార్ యాదవ్‌ను పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 15 మార్చి, 2026.

 

పుట్టా మహేష్‌కుమార్ యాదవ్‌ను 

పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలి

`సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్

హైదరాబాద్ శివారులోని ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఏలూరు ఎంపి పుట్టా మహేష్‌కుమార్ యాదవ్ పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. మహేష్‌కుమార్‌పై  తెలుగుదేశం పార్టీ చర్య తీసుకొని డ్రగ్స్ నివారణలో తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కోరుతున్నది.

తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీలో మన రాష్ట్రానికి చెందిన ఎంపీ పట్టుబడడం ద్వారా రాజకీయ నాయకులకు, డ్రగ్స్ మాఫియాకు ఉన్న బంధం మరోసారి బహిర్గతమైంది. బాధ్యతాయుత ఎంపీ స్థానంలో ఉన్న పుట్టా మహేష్‌కుమార్ డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం ద్వారా తన పదవిని దుర్వినియోగం చేశాడు. తక్షణం ఈయన పార్లమెంటరీ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. డ్రగ్స్ నియంత్రిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర  ప్రభుత్వం తమ పార్టీకి చెందిన ఎంపీ డ్రగ్స్ సేవించినట్లు తెలంగాణా పోలీసులు నిర్ధారించడంపై రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి.

రాజకీయ నాయకుల మద్దతు లేకుండా డ్రగ్స్ వ్యాపారం, విస్తరణ జరగడం లేదని సిపిఐ(యం) మొదటి నుండీ చెబుతున్నది. పుట్టా మహేష్‌కుమార్ సంఘటన కూడా దాన్నే రుజువు చేస్తున్నది. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న డ్రగ్స్ వ్యాపారులు, మద్దతు దారులను రాజకీయాల నుండి బహిష్కరించి తమ నిబద్దతను రుజువు చేసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి