(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 17 మార్చి, 2026.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: చీరాల తీరంలో దురాక్రమణకు గురైన స్ట్రెయిట్ కట్ కాలువ సీ మౌత్‌ను పునరుద్దరించి మత్స్యకారులకు న్యాయం చేయాలని కోరుతూ...
అయ్యా!
బాపట్ల జిల్లా ఈపురుపాలెం తీరంలోని స్ట్రెయిట్ కట్ కాలువలో ఎల్ ఆకారంలో ఉన్న ముఖ ద్వారాన్ని పూడ్చివేసి కొండరాళ్లతో కట్టలు నిర్మించడం వలన అలలు తాకిడికి రాళ్లు జారిపోయి బోట్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడి, కొన్ని బోట్లు పగిలిపోవడం జరుగుతున్నది. జిల్లా కలెక్టర్ ద ష్టికి సమస్యను తీసుకువెళ్లినా, పరిష్కారం కాకపోవడంతో చివరకు మత్స్యకారులు ఆందోళన పట్టారు. దీనితో కలెక్టర్ 6గురు మత్స్యకారులు, 8మంది ప్రభుత్వ అధికారులతో ఒక విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ కొన్ని పరిష్కార మార్గాలు చూపించింది. కానీ ఆ ప్రకారం ఇచ్చిన హమీ నెరవేరలేదు. ఈ స్థితిలో మీరు ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని సమస్య పరిష్కారం కోసం క షి చేయగలరని కోరుతున్నాను.
ఈ స్ట్రెయిట్ కాలువను 1972 లో ప్రారంభించారు. కాలువపై ఆధారపడి చీరాల మండలs వాడరేవు గ్రామ పంచాయితీ పరిధిలోని గ్రామాలు, బాపట్ల మండలం అడవి పంచాయితీ పరిధిలోని గ్రామాలు కలిపి మొత్తం 10 గ్రామాలు, 1126 మంది సొసైటీ సభ్యులు, 2000 మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. ఈ కాలువ సముద్రంలో కలిసే ముఖద్వారం వంపు తిరిగి ఎల్ ఆకారంలో సుమారు కిలోమీటరు పైగా ప్రయాణం చేసి సముద్రంలో కలుస్తుంది. సహజ సిద్ధంగా ఉన్న ఆ కాలువ కట్ట ఇసుకతో మేట వేసి దిబ్బలాగ ఉండటం వల్ల అలలు మరియు గాలుల వల్ల బోట్లు డామేజ్ కాకుండా రక్షణ వలయంగా, మత్స్యకారులు బోట్లు నిలుపుకోవడానికి అనువుగా ఉంటుంది. తుఫానుల నుండి బోట్లకు రక్షణగా ఉంటుంది. కాలువలో ఉప్ప్పునీరు, మంచినీరు కలిసి ఉండడం వలన అక్కడ రొయ్యలు, చేపలు సాగు చేసుకునే రైతులకు ఈ నీరు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ కాలువ ఎల్ ఆకారంలో లేకపోతే సముద్ర నీరు నేరుగా కాలువ ద్వారా పంట పొలాల్లోకి వెళ్లి భూములు బీడు బారే అవకాశం ఉంది. మరియు పాడి పశువులకు, ప్రజలకు త్రాగడానికి నీరు కూడా ఉండదు. రైతులు వలస పోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2021 నుండి సముద్రం తీరం వెంబడి రిసాట్స్ నిర్మాణం, రియల్ ఎస్టేట్ వ్యాపారం వేగంగా ఊపందుకున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చొరబడి ఈ ప్రాంతంలో ఉన్న రొయ్యలు, చేపలు సాగు చేసుకునే రైతుల చెరువులను పూడ్చివేసి రిసార్ట్‌లను నిర్మిస్తుండడంతో ఆ ప్రాంతమంతా కబ్జాకు గురయ్యింది. ఈ స్థితిలో ఎల్ ఆకారాన్ని, పాత కాలువను పునరుద్దరించాలని మత్స్యకారులు, రైతులు కోరుతున్నారు.
వారి కోర్కెలు :
(1) సహజ సిద్ధంగా ఉన్న ఎల్ ఆకారంలో ఉన్న కాలువని యధావిధిగా పునరుద్దరించాలి.
(2) గత 50, 60 ఏళ్లుగా సహజ సిధ్దంగా సర్వే నెం.499`2, 500, 501 లలో ఎల్ ఆకారంలో వంపు తిరిగిన కాలువను పూడ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
(3) సముద్ర తీరంలో హెచ్‌టిఎల్ లైన్ నుండి 200 మీటర్ల పరిధిలో ఎలాంటి కట్టడాలు చేపట్టకూడదు.
(4) సర్వే నెం 499/2లో డి.కే.పట్టా తక్షణం రద్దుచేసి మత్స్యకారుల అవసరాల కోసం కేటాయించాలి.
(5) దురాక్రమణదారుల వల్ల దెబ్బతిన్న బోట్లకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి.
కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మత్స్యకారుల, రైతుల న్యాయమైన కోర్కెల పరిష్కారానికి మీరు సదరు జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వగలరని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
