నిర్వాసితులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించకుండా అర్శెల్‌మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు భూమిపూజ తగదు.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

 

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 19 మార్చి, 2026.

 

నిర్వాసితులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించకుండా

అర్శెల్‌మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు భూమిపూజ తగదు

- సిపిఐ(యం)

నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు ఈ నెల 23న భూమి పూజ చేయడానికి ఏర్పాట్లు చేయడం సరికాదు. దీనిని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

వైజాగ్ -చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా నక్కపల్లి మండలంలో రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, చందనాడ, అమలాపురం, డిఎల్.పురం ఐదు పంచాయతీల పరిధిలో 11 గ్రామాల నుండి 5,500 ఎకరాల భూమి రైతుల నుండి జిరాయితీ భూమికి ఎకరాకు 18 లక్షలు, డి.ఫారం భూమికి 12 లక్షల 50 వేలు ఇచ్చి బలవంతంగా ప్రభుత్వం సేకరించింది. అందులో 2,100 ఎకరాల భూమిని ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించింది. దీనికి అర్శెల్ మిట్టల్ కంపెనీ ఎకరాకి 53 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించింది. రైతుల భూములతో వ్యాపారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులకు అన్యాయం చేస్తోంది. నిర్వాసితులైన రైతులు, కూలీలు, వృత్తిదారులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ఇప్పటివరకు పూర్తిగా అమలు చేయలేదు. నిర్వాసిత కాలనీలో ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఇళ్ళ నిర్మాణం జరగకుండా ఆగమేఘాలమీద ప్రస్తుతం నివశిస్తున్న ఇళ్ళు నేలమట్టం చేసి నిర్వాసితులను నడిరోడ్డుపై నెట్టివేశారు. జిరాయితీ భూములకు ఇచ్చిన నష్టపరిహారంతో సమానంగా డి-ఫారం సాగు భూములకు కూడా చెల్లించాలి. వివాహమైన ఆడపిల్లలకు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకులకు భూసేకరణ సందర్భంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఇంటి స్థలం ఇవ్వాలి. ప్రస్తుతం ఇచ్చిన ఆరఅండఆర్ ప్యాకేజీ రూ.8,98,000 అంగీకారం కాదని, పెరిగిన ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలకు అనుగుణంగా రూ.25 లక్షల ప్యాకేజీ పెంచి ఇవ్వాలి. నిర్వాసితుల కాలనీలో విద్యా, వైద్యం, విద్యుత్, నీటి సౌకర్యంతో పాటు 25 రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి. భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఆ ప్రాంతంలోనే ఉపాధి పనులు కల్పించాలి. సమస్యలను పరిష్కరించకుండా, నిర్వాసితుల హక్కులను అమలు చేయకుండా ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంటు భూమి పూజ నిర్వహించడం అన్యాయం, చట్టవిరుద్ధం. ఇప్పటికైనా భూమిపూజ వాయిదా వేయాలని, నిర్వాసితులకు న్యాయం చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి