పారిశ్రామిక భూ వినియోగంపై శ్వేత పత్రం ప్రకటించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 23 మార్చి, 2026.

 

పారిశ్రామిక భూ వినియోగంపై శ్వేత పత్రం ప్రకటించాలి

సిపిఐ (ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్

 

రాష్ట్రంలో రైతుల నుండి ఏపీఐఐసీ బలవంతంగా సేకరించిన లక్ష యాభై ఆరు వేల ఎకరాల భూముల్లో దాదాపు 86 వేల ఎకరాలకు ఇప్పటికే మ్యుటేషన్ పూర్తయిందని ఇంకా 70 వేల ఎకరాలు 22 ఏ జాబితా నుండి తొలగించి మ్యుటేషన్ పూర్తి చేయాలని, వెంటనే 51, 603 ఎకరాలను బదలాయించాలని, బ్యాంకు రుణాలు తీసుకోవడానికి అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని సిపిఐ (ఎం) రాష్ట్ర కమిటీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. పారిశ్రామిక అభివృద్ధి కోసం కేటాయించిన ఈ భూములపై ప్రభుత్వానికి ఆధిపత్యం ఉండాలని, ఆ విలువ మేరకు ప్రభుత్వ వాటా తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. అలాకాకుండా భూములను కార్పొరేట్లకు పందేరం చేయడాన్ని సిపిఐ(యం) తీవ్రంగా ఖండిస్తున్నది.

ప్రభుత్వం అత్యంత చవుకగా కేటాయించిన భూములను పరిశ్రమలు పెట్టకుండానే బ్యాంకు రుణాలు తీసుకొని ఎగ్గొట్టి డీఫాల్ట్ అయిన అనేక కేసులు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి. దానివల్ల రాష్ట్రం లక్షలాది కోట్ల విలువైన సంపదను కోల్పోయింది. ఇందుకు తప్పుడు విధానాలు అనుసరించిన ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. అయినా ప్రభుత్వం వాటిని పరిశీలించకుండానే వాటిపై కంపెనీలకు పూర్తి ఆధిపత్యం కల్పించడం అభ్యంతరకరం. మరోవైపు సామాన్య రైతుల భూములను అక్రమంగా 22 ఏ కింద పెట్టి ఇప్పటికి తొలగించకుండా వేధిస్తున్నారు. రైతులు రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా వాటిని పరిష్కరించలేదు.  పేద రైతుల స్వాధీనంలో ఉండి సాగు చేసుకుంటున్న భూములను వెంటనే 22 ఏ నుండి తొలగించాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికే ఏపీఐఐసీ తీసుకున్న భూములకు పలుచోట్ల ఆర్&ఆర్ ప్యాకేజీ పూర్తిగా అమలు చేయలేదు. విశాఖ స్టీల్ నిర్వాసితులు సైతం ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విషయం అందరికీ తెలుసు.

ఒకవైపు ప్రభుత్వం పి పి పి (పి3) పేరుతో ప్రభుత్వ భాగస్వామ్యం గురించి, పి -ఫోర్ పేరుతో ప్రజల భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ మరోవైపు సర్వసంపదలను కార్పొరేట్ల పరం చేయటం ప్రజలను మోసగించటమే. పరిశ్రమలు పెట్టకుండానే రుణాలు తీసుకోవడం, రుణాలు తీసుకొని కూడా పెట్టుబడి పెట్టకపోవడం నేరం. అయినా అలాంటి నేరస్తులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి వారిలో బడా పారిశ్రామికవేత్తలు, ఉన్నత స్థానాల్లో కూర్చున్న ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. పైసా కూడా సొంత పెట్టుబడి పెట్టకుండా మన బ్యాంకులలో నుండే అప్పులు తీసుకుని పెట్టుబడులు పెట్టారనటం, ఆ పేరుతో అనేక రాయితీలు ఇవ్వడం ప్రజాధనంపై ప్రైవేటుకు పెత్తనం ఇవ్వటమే. ప్రభుత్వ అధికారాన్ని కార్పొరేట్ల కోసం  దుర్వినియోగం చేయడమే. రాష్ట్ర విభజన నాటికే తీసుకున్న భూములు, అనంతరం గత 12 సంవత్సరాల్లో కేటాయించిన భూముల వివరాలు, పెట్టిన పరిశ్రమలు, ఇచ్చిన ఉద్యోగాలు, భూములు కోల్పోయిన నిర్వాసితుల పునరావాసం, ఉపాధి తదితర వివరాలతో శ్వేత పత్రం ప్రకటించాలని సిపిఐ(యం) కోరుతున్నది. బహిరంగ చర్చ అనంతరమే భూములు కేటాయింపు కొనసాగించాలని సిపిఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది. అప్పటివరకు ఈ భూపందేరం ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నది. 

పచ్చని పంటలు పండే వ్యవసాయ భూములను పరిశ్రమల పేరుతో కార్పొరేట్లకు కేటాయించడం ద్వారా అటు వ్యవసాయ ఉత్పత్తిని కోల్పోయి, ఇటు పారిశ్రామిక అభివృద్ధి జరక్క  రెండు విధాల రాష్ట్రం నష్టపోతున్నది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమం రాష్ట్రాభివృద్ధికి ఏమాత్రం తోడ్పడదని సిపిఐ (ఎం) భావిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాలను పునః పరిశీలించుకోవాలని కోరుచున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి