
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 03 ఏప్రిల్, 2026.
ఆరోగ్య శ్రీ వైద్యసేవలు తక్షణం పునరుద్దరించాలి
ఎన్‌టిఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సదుపాయాలు పునరుద్దరించేందుకు తక్షణం చర్యలు తీసుకొని పేద, మధ్యతరగతి రోగులను ఆదుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. రాష్ట్రవ్యాపితంగా ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రయివేటు ఆసుపత్రులు నిలిపివేసినందువల్ల పేద, మధ్యతరగతి రోగులు ఉచిత వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రయివేటు ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించవలసి ఉన్నందున వారు ఈ వైద్య సేవల్ని నిలిపివేసినట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశ) ప్రకటించింది. చిన్న, మధ్యతరహా ఆసుపత్రులు తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్ళాయని నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతాలు, ఔషదాలు మొదలగు వాటికి చెల్లింపులు బిల్లులు రాకపోవడంతో ఆసుపత్రులలో మనుగడకే ఇబ్బంది వచ్చిందని ‘ఆశా’ చెపుతున్న రీత్యా వారితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని సిపిఐ(యం) ప్రభుత్వాన్ని కోరింది. అత్యవసర వైద్యం అందవలసిన రోగులను ఆదుకునేందుకు ఆరోగ్యశాఖా మంత్రి మరియు ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.
అదే సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణకు నిధులు పెంచి నాణ్యమైన వైద్య సేవలను అందించాలి. కొత్తగా నిర్మాణమవుతున్న మెడికల్ కాలేజీలలో ఆస్పత్రులు దాదాపు పూర్తయినా ప్రారంభించలేదు. కావున ప్రభుత్వ వైద్యశాలల్ని మరింతగా బలపరిచి వాటి ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన, మెరుగైన సేవలు అందిస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది. పి3 పేరుతో రెండు సంవత్సరాలుగా నిలిపివేసిన 10 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వమే తక్షణం నిధులు కేటాయించి పూర్తి చేయాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
