(ఈరోజు (6 ఏప్రిల్) సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో క్యూబా సంఘీభావ సదస్సు జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
క్యూబాకు అండగా నిలబడదాం
సంఘీభావ సదస్సులో వక్తలు
నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ క్యాంపెయిన్
అమెరికా దురహంకారాన్ని ఎదుర్కోవడానికి ప్రజలే ముందుకు రావాలి
ఆలీన విధానాన్ని వదిలేసిన మోడీ
అమెరికా ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్యూబాకు అండగా నిలబడాలని, దీనికోసం 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా క్యూబా సంఘీభావ నిధి క్యాంపెయిన్ నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విజయవాడ ఎంబివికెలో సోమవారం సిపిఎం ఆధ్వర్యాన క్యూబా సంఘీబావ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ చిన్నదేశమైన క్యూబాపై అమెరికా కక్షపూరితంగా ఆంక్షలు విధించి వేధింపులకు పాల్పడుతోందని తెలిపారు. ఫలితంగా అక్కడి ప్రజలు, చిన్నారుల, మహిళలు, వద్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆహారం, మందులు, విద్యుత్, అయిల్ వంటి సంక్షోభాలను అమెరికా సష్టించిన వేర్వేరు దేశాలు సహాయాన్ని పంపించేందుకు కూడా అంగీకరించడం లేదని తెలిపారు. కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి అమెరికా సామ్రాజ్యవాదపు ఆంక్షల్లో ఉన్నప్పటికీ క్యూబా అంటే విద్య, వైద్యం గుర్తుకు వస్తుందని, రోగాలురాని విధంగా అక్కడి వైద్యసేవలు ఉంటున్నాయని పేర్కొన్నారు. కరోనా కాలంలో ఆదేశ వైద్యులు ప్రపంచానికి అందించిన వైద్యం, వ్యాక్సిన్లు కోట్లమంది ప్రజలకు ధైర్యాన్నిచ్చిందని పేర్కొన్నారు. క్యూబా మాజీ అధ్యక్షులు ఫైడల్ క్యాస్ట్రో అమెరికా సామ్రాజ్యవాదం మూడో ప్రపంచదేశాలను దోచుకోవడంపై చేసిన ప్రసంగం ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయిందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ రాక్షసుడని, అంతకంటే పెద్ద పేర్లు ఉంటే వాటిని కూడా అతనికి పెట్టవచ్చని తెలిపారు. వెనిజులా అధ్యక్షుడు మదురోనూ కిడ్నాప్ చేశారని, ఇరాన్‌పై దాడిచేశారని, ఇప్ప్పుడు క్యూబా వంతని చెబుతున్నాడని, అతని కంటే దుర్మార్గుడు మరొకరు ఉండరని అన్నారు. అతనికి, ఇజ్రాయిల్‌కు ప్రధాని మోడీ లొంగిపోయారని విమర్శించారు. ఆలీన విధానాన్ని వదిలేశారని, సామ్రాజ్యవాద దేశాల పంచనచేరి నోరెత్తలేని దుస్థితికి దిగజారిపోయారని అన్నారు. దుర్మార్గ ఇజ్రాయిల్‌తో దోస్తీ చేస్తున్నారని, వాస్తవంగా ఆదేశ తీరును అక్కడి ప్రజలే వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ట్రంప్ దుర్మార్గ విధానాలతో విసుగెత్తిన అమెరికన్లు సుమారు ఎనిమిదివేల ప్రాంతాల్లో నో కింగ్ ఉద్యమం నిర్వహిస్తున్నారని, క్యూబా, పాలస్తీనా, ఇరాన్‌కు సంఘీభావంగా ఆందోళనలు జరుగుతున్నాయని వివరించారు. ఇప్ప్పుడు ఆయా దేశాలపై దాడులు నిర్వహిస్తున్న అమెరికాకు భవిష్యత్‌లో ఇండియా కూడా టార్గెట్ అవుతుందని తెలిపారు. మన దేశానికి అమెరికా నుండి ప్రత్యక్ష, పరోక్ష ముప్ప్పు ఉందని తెలిపారు. ఇప్పటికే స్టీలు, సిమెంటు ధరలు పెరిగాయని, క్లిష్టపరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని మోడీ కూడా ప్రకటించారని అన్నారు. మనకాళ్లపై మనం నిలబడకపోతే సార్వభౌమత్వాన్ని కాపాడుకోలేమని తెలిపారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడాలని తెలిపారు. ఈ నేపథ్యంలో క్యూబాకు అండగా నిలబడాలని, దీనికోసం మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా క్యూబా సంఘీభావ నిధి వసూలు చేయాలని, దీనికోసం క్యాంపెయిన్ నిర్వహించాలని అన్నారు. సిపిఐ రాష్ట్ర నాయకులు అక్కినేని వనజ మాట్లాడుతూ అర్థిక ఆంక్షలతో క్యూబాను విచ్ఛిన్నం చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని తెలిపారు. క్యూబా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై అక్కడి మహిళ రాసిన లేఖ ప్రపంచవ్యాప్తంగా ఇప్ప్పుడు చర్చనీయాంశం అయిందని పేర్కొన్నారు కరోనా కాలంలో క్యూబా ముందుపీఠిన నిలబడిందని వివరించారు. మానవత్వం, ప్రజాస్వామ్యంమీద గౌరవం ఉన్నవారు అమెరికాకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. ఆరఎసఎస్ భావజాలంతో మోడీ ఇజ్రాయిల్ పంచన చేరారని, గాజా, ఇరాన్‌లో పసిపిల్లలను దారుణంగా చంపేస్తే కనీసం ఖండించలేని నీచస్థితికి మోడీ దిగజారారని విమర్శించారు. క్యూబాకు సంఘీభావంగా పక్కనే ఉన్న మెక్సికో నిలిచిందని, భారతదేశం మాత్రం కనీసం మాటసాయం కూడా చేయడానికి సిద్ధపడటం లేదని అన్నారు. ఎస్‌యుసిఐ నాయకులు సుధీర్ మాట్లాడుతూ సోషలిస్టు దేశాలు కూలిపోవడంతో సామ్రాజ్యవాదం బలంగా ముందుకు వచ్చిందని, వారితో మోడీ కుమ్మక్కయారని అన్నారు. క్యూబా పర్యటనపై అనుభవాలతో పుస్తకం రచించిన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నరసింగరావు మాట్లాడుతూ క్యూబా ప్రజలు వారి దేశాన్ని, సోషలిజాన్ని ప్రేమిస్తున్నారని అన్నారు. క్యూబాను కాపాడుకోవడం అంటే సోషలిజాన్ని కాపాడుకోవడమేనని తెలిపారు. గతంలో క్యూబాకు ఇండియా నుండి ఆహారధాన్యాలు పంపిస్తే అప్పటి క్యూబా అధ్యక్షులు ఫైడల్ క్యాస్ట్రో మీరు పంపింది ఆహారధాన్యాలు కాదు, భారతదేశం ఇచ్చిన లక్షల టన్నుల సంఘీభావం మాకు బలాన్నిచ్చిందని అన్నారని గుర్తుచేశారు. తొలుత వక్తలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు వేదికమీదకు ఆహ్వానించారు. క్యూబాకు సంఘీభావంగా ప్రజాశక్తి ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు, కె.సుబ్బరావమ్మ, ప్రజాశక్తి డిప్యూటీ ఎడిటర్ వి.రాంభూపాల్ తదితరులు పాý£్గన్నారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్ ఆధ్వర్యంలో క్యూబా సంఘీభావ గేయాలు ఆలపించారు.
పలువురి విరాళం
క్యూబా సంఘీభవ సదస్సు సందర్భంగా పలువురు అక్కడే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుకు విరాళం అందించారు. విజయవాడ భవానీపురం నేతాజీ హైస్కూలు అధినేత తిరుపతిరెడ్డి తన రెండు నెలల పెన్షన్ రూ.1.80 లక్షలు చెక్కురూపంలో అందించారు. స్కూలు పిల్లలు తమ పాకెట్ మనీగా వచ్చిన రూ.15 వేలను ఇచ్చారు. అలాగే నగర ప్రముఖులు చుక్కపల్లి తిరుమలరావు, గురవయ్యలు చెరో రూ.5000 విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా నేతాజీ స్కూలు పిల్లలను శ్రీనివాసరావు అభినందించారు. చిన్న పిల్లలలైనా పెద్దమనసు చాటుకున్నారని తెలిపారు.
= = = =
