
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 27 ఏప్రిల్, 2026.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: హథీరాంజీ మఠం భూములు కాపాడాలని, అందుకోసం “పర్యవేక్షణ కమిటీ”ని నియమించాలని కోరుతూ...
అయ్యా!
వేల కోట్ల విలువజేసే హథీరాంజీ మఠం భూములు హారతి కర్పూరంలా కరిగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ కనీసం పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేయాల్సిన హథీరాంజీ మఠం సిబ్బంది, కస్టోడియన్ ఫిర్యాదుకూడా చేయడం లేదు. తిరుపతిలో ఆక్రమణకు గురై, నిర్మాణాలు సాగిస్తున్న సర్వే నెం:13 గాంధీపురంలోని మఠం భూములలో కబ్జాదారులు బోర్డును తొలగించినా పోలీసులకు ఫిర్యాదు చేయలేని దుస్థితిలో హథీరాంజీ మఠం ఉంది.
హథీరాంజీ మఠం భూములు పరిరక్షణకై 1994లో నాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు, సిపిఎం శాసన సభాపక్షంనేత బోడెపూడి వెంకటేశ్వరరావు సూచనతో ముత్తా గోపాలక్రిష్ణ అధ్యక్షతన శాసనసభా కమిటీని ఏర్పరిచారు. కమిటీలో నాటి అల్లూరు శాసన సభ్యులు జక్కా వెంకయ్య కీలకంగా వ్యవహరించారు. సిపిఎం కృషి ఫలితంగా శాసనసభా కమిటి ఏర్పాటు కావటమే కాకుండా, ముక్తేశ్వరరావును కస్టోడియన్‌గా నిర్ణయించి హథీరాంజీ మఠం ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా మ్యాపింగ్ చేయబడింది.
తిరుపతి నగర నడిబొడ్డున తీర్థకట్ట వీధిలో వందలకోట్లు విలువ చేసే పుష్పతోట అన్యాక్రాంతం కాకుండా సిపిఎం కాపాడింది. మహారాష్ట్రలో 296 ఎకరాలు, తమిళనాడులో 162 ఎకరాలు, ఎపిలో 1634 ఎకరాలు ఆస్తులు, ఇతర అనేక ప్రాంతాలలో ఉన్న ఆస్తులకు రికార్డును తయారు చేశారు. ఆ తరువాతి కాలంలో ముక్తేశ్వరరావు కృషి కారణంగా వేలకోట్ల విలువ చేసే హథీరాంజీ ఆస్తులు పరిరక్షించబడ్డాయి.
వాస్తవ పరిస్థితి ఇది కాగా ఇటీవలి కాలంలో హథీరాంజీ మఠం భూముల ఆక్రమణలకు ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు, రియల్టర్లు, పోలీసులు సంయుక్తంగా పాల్పడుతున్నారు.
ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మఠం భూమిలో గత ప్రభుత్వ హయాంనుంచి నేటి వరకూ దర్జాగా భూములు ఆక్రమించుకోవటమే కాక, ఇందులో పోలీసు ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు, అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు అనుమతులు తీసుకోకుండా విల్లాలు నిర్మించుకుంటున్నా అటువేపు కన్నెత్తి చూసే సాహసం సంబంధిత అధికారులు చేయలేకున్నారు.
ఎం.కె.నాయుడు కాలనీలో యదేచ్ఛగా ఆక్రమణలు సాగిపోతున్నాయి. సర్వే నెం: 242/బిలో, 242, 145, 147-1 తదితరాలలో వందల ఎకరాలు భూములు అన్యాక్రాంత మయ్యాయి. ప్రశ్నించిన మఠం అధికారులను కబ్జాదారులు బెదిరింపులకు గురి చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
మఠం భూములు ప్రజలకు, ప్రభుత్వానికి, మఠానికి, టిటిడికి ఉపయోగపడకుండా ఆక్రమణ దారులు వందల కోట్లు సంపాదించుకోవటానికి వనరుగా మారిపోయింది. మఠం భూములను రాష్ట్ర ప్రభుత్వం కాపాడి ప్రజోపయోగంగా మార్చాలి. అందుకోసం ఒక “పర్యవేక్షణ కమిటీ”ని నియమించాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
