
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 ఏప్రిల్, 2026.
చట్టవిరుద్దంగా కూల్చిన గొంతెనమ్మ గుడిని పునరుద్దరించాలి
ఆకివీడు పరిధిలోని పెదపేటలో ఉన్న స్థానిక దళిత కులదేవత గొంతెనమ్మ గుడిని అక్రమంగా కూల్చి శాంతి భద్రతల సమస్యను సృష్టించిన వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకొని ప్రజల మధ్య సామరస్యాన్ని పునరుద్ధరించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఆ స్థానంలో ప్రభుత్వమే బాధ్యత తీసుకొని గొంతెనమ్మ గుడిని పునర్నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తున్నది.
గత నెల రోజులుగా ఆకివీడులో స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రోత్సాహంతో ఆ పేటకు సంబంధం లేని కొంత మంది శనివారం అర్ధరాత్రి అక్రమంగా గొంతెనమ్మ గుడిని కూల్చి వేయడాన్ని సిపిఐ(యం) ఖండిస్తున్నది. ఇది దళిత హక్కులపైన, స్థానిక ప్రజల మనోభావాలపై చేసిన దాడి. దీని కోసం పెద్ద ఎత్తున పోలీసును దించి పేటను దిగ్బంధం చేసి స్థానిక ప్రజలను భయ భ్రాంతులకు గురి చేశారు. ఆ పేట నుండి పోలీసును ఉపసంహరించి దళితుల్లో అభద్రతా భావాన్ని తొలగించాలని సిపియం డిమాండ్ చేస్తున్నది.
కలెక్టర్ జారీ చేసిన అనుమతి హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉంది. గుడిపై ఎలాంటి బహిరంగ విచారణ జరపలేదు. వీరు అనుమతి ఇచ్చిన రామాలయ నిర్మాణ కమిటీకి ఎలాంటి చట్టబద్ధత లేదు. గొంతెనమ్మ దేవాలయంపై వారికి ఎలాంటి హక్కు లేదు. 1992లో చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం వివాదంలో ఉన్న దేవాలయాలను, ప్రార్ధనా మందిరాలను తొలగించరాదు. కలెక్టర్ ఉత్తర్వు రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుంది. స్థానిక కార్పొరేటర్ వ్యతిరేకించినా టిడిపి, వైసిపి ఒక్కటై రికార్డులు, చట్టాలతో నిమిత్తం లేకుండా రాజకీయ ఒత్తిళ్లకు లొంగి మున్సిపల్ కౌన్సిల్‌లో తీర్మానం చేశారు.
ఇప్పటికైనా స్థానిక దళిత ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఆ స్థలంలో గొంతెనమ్మ గుడిని నిర్మించాలని, స్థానిక ప్రజలు కోరితే దాని ప్రక్కనే రామాలయాన్ని కూడా నిర్మించాలని సిపిఐ(యం) సూచిస్తున్నది. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని శాంతి సామరస్యాలను కాపాడాలని కోరుతున్నది. స్వార్థం కోసం విద్వేషాలు రెఒచ్చగొడుతున్నవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది. గొంతెనమ్మ గుడిని అక్రమంగా కూల్చడంపై న్యాయ విచారణకు ఆదేశించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
