డేటా సెంటర్ పేరుతో అదానీకి దోచిపెడుతున్న ప్రభుత్వం.. ఆకివీడు దళితులపై కక్షకట్టిన డిప్యూటీ స్పీకర్‌ను అదుపు చేయాలి.

ఈరోజు (30 ఏప్రిల్, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ
వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు
కార్యదర్శి

డేటా సెంటర్ పేరుతో
అదానీకి దోచిపెడుతున్న ప్రభుత్వం
160 ఎకరాల సింహాచలం భూములు కేటాయింపు
మే 3న పంచగ్రామాల సమస్యలపై ఆందోళన
కాంట్రాక్టర్ల కోసం అయిల్ సమస్యను సృష్టించిన ప్రభుత్వం
ఆకివీడు దళితులపై కక్షకట్టిన డిప్యూటీ స్పీకర్‌ను అదుపు చేయాలి.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్

        విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పేరుతో ప్రభుత్వం అదానీకి వేలకోట్లు సంపద
దోచిపెడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు.
గురువారం విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
ఆయన మాట్లాడారు. రూ.1.20 లక్షల కోట్లు పెట్టి నిర్మిస్తున్న డేటా సెంటర్
వల్ల 2,500 మందికి మించి ఉపాధి దొరకదని, భవన నిర్మాణాల్లో కొంత తాత్కాలిక
ఉపాధి లభిస్తుందని తెలిపారు. దీనికోసం వేర్వేరు రూపాల్లో అదానీకి రూ.22,500
కోట్లు లబ్ది కలిగిస్తున్నారని విమర్శించారు. దీనివల్ల విశాఖ ప్రజలు తీవ్ర
ఇబ్బందులు ఎదుర్కొంటారని, ప్రజల వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడుతుందని
తెలిపారు. వాతావరణంలో పెద్దఎత్తున మార్పులు వస్తాయని పేర్కొన్నారు. ఒకశాతం
వేడి పెరుగుతుందని, దీనివల్ల తీవ్ర పర్యావరణ ఇబ్బందులు వస్తాయని అన్నారు.
ఇటీవల డేటా సెంటర్ ప్రారంభ సమయంలో యువతను మభ్యపెట్టే విధంగా
కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి అతిశయోక్తులు చెప్పారని, వాస్తవంగా వారు
చెప్పిన దానికి జరిగే దానికి సంబంధం లేదని తెలిపారు. అదానీ కోసం ప్రభుత్వమే
చట్టాలు, నిబంధనలను ఉల్లంఘిస్తున్నదని విమర్శించారు. ఈ సెంటర్కు అవసరమైన
రెండు వేల మెగావాట్ల విద్యుత్ కోసం ప్రత్యేక డిస్కమ్ ఏర్పాటు చేయనున్నారని,
విద్యుత్ డిస్కమ్‌ల ప్రైవేటీకరణ దీనితోనే ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన పర్యావరణ అనుమతి కోసం ఈనెల 9వ తేదీన
దరఖాస్తు చేసే 18వ తేదీన ఇచ్చేశారని, ప్రజాభ్రిపాయం తీసుకోలేదని, సామాజిక
ప్రభావ అంచనా అధ్యయనం చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం అనుకున్నదే తడవుగా
అన్నీ ఇచ్చేశారని, ఈ శాఖ చూస్తున్న అటవీశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి పవన్
కల్యాణ్ చోద్యం చూస్తున్నారని అన్నారు. నోటీఫైడ్ రిజర్వు ఫారెస్టు ఉందని,
కేంద్రం నుండి అనుమతి లేకపోయినా చట్ట ఉల్లంఘనలకు పాల్పడి భూములు
కేటాయించారని పేర్నొన్నారు. డేటా సెంటర్ పెడుతూ భవన నిర్మాణ అనుమతి మాత్రమే
తీసుకున్నారని విమర్శించారు. గతంలో సముద్రపు నీటిని వాడుకుంటామని
చెప్పారని, ఇప్పుడు కార్పొరేషన్ నీటిని సరఫరా చేయాలని ప్రతిపాదన పంపించారని
విమర్శించారు. డేటా సెంటర్కు ఎక్కువ నీరు అవసరం ఉంటుందని, ఇప్పుడు
కార్పొరేషన్ నీటిని సరఫరా చేస్తే నగర ప్రజలు ఏమి తాగాలని ప్రశ్నించారు.
ఇప్పటికే విశాఖలో నీటి లభ్యత తక్కువగా ఉందని, భూగర్భజలాలు కూడా
తగ్గిపోతున్నాయని, ఇంకా తగ్గిపోతే ఉప్పునీరు చొచ్చుకు వస్తుందని అన్నారు.
ఏలేరు రిజర్వాయర్ నుండి సరఫరా చేస్తున్న నీటిలోనూ అదానీకి, మిట్టల్‌కు
ఇవ్వాలని నిర్ణయించారని, దీనివల్ల స్టీలు ప్లాంటుకు ఇబ్బంది వస్తుందని, నగర
ప్రజలు అవస్థలు పడతారని తెలిపారు. డేటా సెంటర్లో పదిశాతం రాష్ట్ర ప్రభుత్వం
పెట్టుబడిసాయం చేసినా వాటా లేదని, పైగా విద్యుత్, భూమి, నీరు, అన్నీ తక్కువ
ధరకే ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. సింహాచలం దేవస్థానానికి
చెందిన 160 ఎకరాలు డేటా సెంటర్కు కేటాయించారని, దేవస్థానం భూముల్లో ఉన్న
పంచగ్రామాల సమస్యను ఇప్పటి వరకూ పరిష్కరించలేదని విమర్శించారు. దశాబ్దాలుగా
ఆ భూములను తమకు కేటాయించాని ప్రజలు కోరుతుంటే పట్టించుకోని ప్రభుత్వం
అదానీకి మాత్రం అడిగిందే తడవుగా ఇచ్చేశారని పేర్కొన్నారు. పంచగ్రామాల
సమస్యపై సిపిఎం ఆధ్వర్యాన మే 3వ తేదీ నుండి ఆందోళన చేపడతామని, సమస్యను
పరిష్కరించే వరకూ కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఆయిల్ కొరతకు ప్రభుత్వ వైఫల్యమే కారణం
        రాష్ట్రంలో డీజిల్, ప్రెటోల్ కొరతకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని
శ్రీనివాసరావు తెలిపారు. అయిల్ కంపెనీలు కోతపెట్టినా, రేషన్ విధించినా
ముందుగానే గుర్తించకుండా ప్రజల ఇబ్బందులకు కారణమైందని తెలిపారు. పరిపాలనా
అనుభవం ఉందని ఎవరికివారు సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం కాదని, ప్రజల సమస్యలు
పరిష్కరించడంలో వేగం ఉండాలని తెలిపారు. పాలకుల సమర్ధత అదానీ, అంబానీలకు
ఉపయోగిస్తున్నారని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు అమరావతి
రాజధాని పనులు చేస్తున్న కంపెనీలకు అయిల్ సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశం
ఇవ్వడం ద్వారా ప్రజలను మరింత ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. కెజి
బేసిన్లో గ్యాస్, ఆయిల్‌ను రిలయన్స్‌కు కట్టబెట్టి ఇప్పుడు వారి
కాళ్లావేళ్లా పడి పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారని, ఇంతకంటే సిగ్గుచేటు
మరొకటి లేదని అన్నారు.
దళితులపై ఆధిపత్యకులాలను ప్రభుత్వమే రెచ్చగొడుతోంది
        ఆకివీడు పెదపేట గొంతెనమ్మ దేవాలయం విషయంలో డిప్యూటీ స్పీకర్
రఘురామకృష్ణంరాజు దళితులపై యుద్ధం ప్రకటిస్తే టిడిపి చూస్తూ ఊరుకుంటుందని
తెలిపారు. పరోక్షంగా దళితులపై ఆధిపత్యకులాలను రెచ్చగొడుతోందని, అక్కడ
అశాంతి ఏర్పడితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
కూల్చివేసిన దేవాలయంలో నంది విగ్రహం            ఉందని దాన్నే గొంతెనమ్మగా
కొలుచుకుంటున్నారని అన్నారు. దేశంలో రామాలయంలో ఎక్కడా నంది వ్రిగహం లేదని
తెలిపారు. రఘురామకృష్ణంరాజు ఒత్తిడితో ర్రాతికి ర్రాతే దేవాలయాన్ని
కూల్చారని, కనీసం ప్రభుత్వ నిబంధనలు పాటించలేదని, పంచనామా కూడా చేయలేదని
తెలిపారు. గతంలో వేరే దేవాలయంలో ఉన్న రాముడి విగ్రహాన్ని తెచ్చిపెట్టారని,
ఇప్ప్పుడు ఆపేరుతో ఉన్న దేవాలయాన్ని కూల్చివేయడం అన్యాయమని తెలిపారు.
దీనికి ప్రభుత్వం కూడా వంతపాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1992 రాజ్యాంగ
సవరణ ప్రకారం వివాదాల్లో ఉన్న దేవాలయాల జోలికి వెళ్లకూడదని, అయినా
అధికారులు, దేవాలయం పెద్దల పేరుతో కొంతమంది దేవస్థానాన్ని కూల్చేశారని
అన్నారు. ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అక్కడ గొంతేనమ్మ దేవాలయాన్ని
నిర్మించాలని, శాంతిభద్రతలు, సామరస్యాన్ని కాపాడాలని శ్రీనివాసరావు కోరారు.