
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 26 మే, 2026.
ప్రొ॥ కె.నాగేశ్వర్‌పై బెదిరింపులు ఆపాలి
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొ॥ కె.నాగేశ్వర్‌పై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ బెదిరింపులకు పాల్పడడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. తక్షణం ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తున్నది. నాగేశ్వర్‌పై నమోదైన కేసుల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నది. ప్రొ॥ నాగేశ్వర్‌కు సిపిఐ(యం) సంఘీభావం ప్రకటిస్తున్నది. ప్రజాతంత్రవాదులంతా ఖండించి అండగా నిలబడాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.
ఒక టీవీ చర్చలో జగన్ గురించి పవన్‌కళ్యాణ్, అమిత్‌షాల మధ్య ఆసక్తికర చర్చ జరిగిందని మాట్లాడిన విషయాలు కొద్దిరోజులుగా వివాదాస్పదం కావడంతో ఆ వాఖ్యలను నాగేశ్వర్ ఉపసంహరించుకున్నారు. జనసేన పార్టీ దీన్ని కొనసాగించబోమని బహిరంగంగా ప్రకటించినా రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్‌లలో ప్రొ॥ నాగేశ్వర్‌పై ఫిర్యాదు చేసి కేసులు రిజిస్టర్ చేయించడం అప్రజాస్వామికం. రాజమండ్రిలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో పవన్‌కళ్యాణ్ మాట్లాడిన విషయాలు ఈ వివాదాన్ని మరింత రగిల్చేందుకే రాజకీయంగా సిద్దమైనట్లు తెలుస్తున్నది. “చర్యకు ప్రతి చర్య ఉంటుంది - ఖర్మ ఎవరినీ వదలదు - ఎవరు చేసిన పనులు వాళ్ళకు తగలక తప్పవు” వంటి మాటలు ప్రొ॥ నాగేశ్వర్‌ను నేరుగా బెదిరించినట్లుగా ఉంది. ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ రకమైన మాటలు మాట్లాడడం భావప్రకటనా స్వేచ్ఛకు రానున్న ప్రమాదానికి హెచ్చరికగా ఉంది. ప్రజాస్వామ్య హక్కుల గురించి ప్రతిపక్షంలో అనేక ఆందోళనలు, ప్రకటనలు చేసిన పవన్ కళ్యాణ్ నేడు తనపై వచ్చిన విమర్శలను సరైన పద్దతిలో ఎదుర్కోకుండా అధికార అండతో బెదిరింపులకు పాల్పడడం తగదు. వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
