
(ఈరోజు (01 జూన్, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
మున్సిపల్ సేవలు ప్రైవేటీకరించొద్దు
జివొ 975 మరియు 673 రద్దు చేయాలి
సర్‌పై టిడిపి, వైసిపి, జనసేన ద్వంద వైఖరి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
మున్సిపల్ సేవలను ప్రైవేటీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 673 మరియు 975 లను తక్షణం ఉపసంహరించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ జీవోల ద్వారా 14 సేవలను ప్రైవేట్ పరం చేస్తున్నారని, వాహనాలు, డ్రైనేజీ, మంచినీరు, ఆఫీస్ నిర్వహణ సహా పిపిపి పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాల్టీ ఎన్నికలు జరగలేదని, ప్రస్తుతం పాలక వర్గాలు లేవని, అధికారుల పర్యవేక్షణలోనే పాలన సాగుతోందని గుర్తుచేశారు. పిపిపి అమలైతే భవిష్యత్తులో ఎన్నికలు జరిగి చైర్‌పర్సన్లు వచ్చినా ఏమి చేయలేరని చెప్పారు. పౌర సేవలు అందించడానికే ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫైనాన్స్ కమిషన్ ద్వారా 40శాతం నిధులు విడుదల చేస్తే ఏ సేవనూ ప్రైవేటీకరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సేవలను ప్రైవేటీకరించి యూజర్ చార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వైసిపి ప్రభుత్వం వేసిన చెత్త పన్ను ప్రజలకు భారంగా మారిందని, ఇది రాజకీయ అంశంగా మారడంతో అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తుచేశారు. ఇప్పుడు 14 సేవలను ప్రైవేట్ పరం చేసి యూజర్ చార్జీలు వేస్తే పట్టణ ప్రజలపై వేల కోట్ల భారం పడుతుందని, ప్రజలు ఎలా భరిస్తారని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ వల్ల మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు, ప్రైవేట్ కంపెనీలు యంత్రాలతో కొద్దిమందితో పని చేయించుకుంటారని, దీంతో ఉద్యోగాలు ఊడిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో 975 మరియు 673 లను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ యూనియన్లు, ప్రజలు, పౌర సంఘాలు ఆందోళనలు చేస్తాయని హెచ్చరించారు.
సర్ చట్టాన్ని పార్లమెంట్లో బలపరిచిన టిడిపి, వైసిపి, జనసేన ఇప్పుడు అమలు చేసే సమయానికి ఇది ప్రమాదమని ఈ పార్టీలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయని తెలిపారు. వామపక్షాలు మొదటి నుండి చెబుతున్నా వినకుండా ఇప్పుడు ఓట్లు పోతాయని వర్క్‌షాపులు పెట్టడం ద్వంద్వ విధానమని విమర్శించారు. బెంగాల్, బీహార్‌లో ఓట్లు తొలగించిన వారికి సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నారని, పౌరులుగానే గుర్తించడం లేదని హెచ్చరించారు. డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌కు ముడిపెట్టి అమలు చేయాలనే కుట్రపూరితమైనటువంటి దానికి బిజెపి పూనుకుంటే టిడిపి, వైసిపి ఇద్దరు బలపరిచారని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు 2011 జనాభా లెక్కల ప్రకారం డిలిమిటేషన్ అమలు చేస్తే నష్టపోతామని చెబుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నా డిలిమిటేషన్ బలపరుస్తారని, మహిళా రిజర్వేషన్లు అమలు కాకపోయినా ఆ చట్ట సవరణని బలపరుస్తారని, సర్ వల్ల ఓట్లు పోతాయని తెలిసినా బలపరుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా టిడిపి, వైసిపి వెనుక నుండే ప్రజలు ఆ పార్టీల్లో అమలు జరిపే ద్వంద విధానాన్ని, అవకాశవాదాన్ని, ప్రజావ్యతిరేకమైన విధానాన్ని ప్రశ్నించాలని కోరారు. ఇటీవల జరిగిన టిడిపి మహానాడులో ఆ పార్టీ తరపున 33శాతం మహిళా రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ వాదన పాతికేండ్ల క్రిందటే ముగిసిపోయిన అధ్యాయమని టిడిపి దాన్ని తిరిగి తెరపైకి తేవడం మోసపూరితమన్నారు. ప్రతి పార్టీ ఓడిపోయే సీట్లలో మహిళలను పోటీలో నిలపడం కాదన్నారు. ఒక స్థానంలో ఏ పార్టీ గెలిచినా అక్కడ మహిళలే ప్రాతిధ్యం వహించాలని అదే మహిళా రిజర్వేషన్ అని చెప్పారు. మహిళా రిజర్వేషన్ అమలు జరుపుతామని చెప్పి పార్లమెంట్‌లో తీర్మానం పెట్టించామని, దానికి తామే ఛాంపియన్ అని చెప్పి ఇప్పుడు 2029 ఎన్నికల్లో కూడా 33శాతం రిజర్వేషన్ అమలు కాదని సిగ్నల్ ఇవ్వడం దుర్మార్గమన్నారు. 2024 ఎన్నికల కోసం 2023లో ఈ చట్టాన్ని ఆమోదానికి పెట్టారని, మరలా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం మరోసారి రాజకీయ నాటకం ఆడారని విమర్శించారు. ఇప్పుడు ఏకంగా ఇక మహిళా రిజర్వేషన్లు భవిష్యత్తులో అమలు జరగనట్టు పార్టీలలో ఎవరికి వారే సీట్లు ఇచ్చుకోవాలని చెప్పడం దుర్మార్గం అని, ఇది మహిళలను దగా, వంచన చేయడం తప్ప మరోకటి కాదన్నారు.
విలువైన ఖనిజాలను ప్రయివేటుపరం చేయొద్దు
కర్నూల్ జిల్లాలో బంగారపు గనులు, ప్రకాశం జిల్లాలో ఐరన్ ఓరు, సముద్ర తీర ప్రాంతంలో బీచ్ సాండ్, మంగంపేట బైరేటస్ గనులను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించొద్దని డిమాండ్ చేశారు. కృష్ణా గోదావరి బేసిన్, మచిలీపట్నం కాజా బేసిన్ లో ఉన్న ఆయిల్ గ్యాస్ ను ప్రభుత్వం తీసుకొని నడిపితే వేల కోట్ల రూపాయల ఆదాయం పెరిగి ప్రజలకు చౌకగా గ్యాస్ వస్తుందన్నారు. అంబాని, వేదాంత వంటి కార్పొరేట్ కంపెనీలకి అప్పచెప్పడంతో ప్రజలు వేల కోట్ల భారాలు మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగంపేట బైరైటీస్‌లో ఏకంగా 60 లక్షల టన్నులు ఎక్స్‌పోర్ట్ చేస్తున్న కుంభకోణం జరిగిందని అన్నారు. ఖనిజాలను ప్రభుత్వ రంగంలోనే ఉంచి, 50% ఆయిల్, గ్యాస్ రాష్ట్రానికి తీసుకుని ప్రజలకు చౌకగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అత్యంత విలువైనటువంటి ఖనిజాలను విదేశీ, ప్రైవేట్ కంపెనీలకి అప్పచెప్పి ఎగుమతులు చేసి లాభపడితే అది రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర వనరులను, మన మేధో శక్తిని తాకట్టు పెట్టి విదేశీ కంపెనీలకి ఈ రకంగా మన ఖనిజాలను దోచి పెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. మన వనరుల పరిరక్షణకు జరిగే ఆందోళనలకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. అమెరికాకు లొంగిపోయి డీజిల్, పెట్రోల్, గ్యాస్ అమెరికా వద్ద కొనటం వల్ల పెట్రోల్, డీజల్ ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. రష్యా ఇరాన్ దగ్గర కొన్నంత కాలం ధరలు నాలుగేళ్ల పాటు పెరగలేదని తెలిపారు. పెట్రోల్, డీజల్ ధరలపై వామపక్ష పార్టీలు జూన్ 9న రాస్తారోకో ప్రకటించాయని, దీన్ని ప్రజలంతా బలపరచాలని కోరారు. పెట్రోల్, డీజల్, గ్యాస్‌పై ఎలాంటి పన్నులు వేస్తున్నారో ప్రతి చోట ఇంటింటికి తిరిగి ప్రజలకు వాస్తవాలు చెబుతామన్నారు.
