
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 10 జూన్, 2026.
ఉక్కు ప్రమాదంలో సాహసం చూపిన కార్మికులకు అభినందనలు
ప్యాకేజీ ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి
సోమవారం (8వ తేదీ) విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాద ఘటనలో తోటి కార్మికులను కాపాడేందుకు అదే ఫ్లోర్‌లో ఉన్న ఇతర కార్మికులు ప్రాణాలకు తెగించి కొంతమందిని కాపాడగలిగారు. 9వ తేదీ సిపిఐ(యం) ప్రతినిధివర్గం ఫ్యాక్టరీని సందర్శించిన సందర్భంలో అనేక వాస్తవాలు వెల్లడయ్యాయి. అదే సమయంలో డ్యూటీలో ఉన్న సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.ఎం. శ్రీనివాసరావు మంటలకు ఎదురేగి ఇతర కార్మికులను కూడగట్టి ధైర్యం చెప్పి కొంతమందిని తక్కువ నష్టంతోనూ, మరికొంత మందిని గాయపడకుండా బయటకు తీసుకురాగలిగారు. అయినప్పటికీ ఉధృతంగా ఆకస్మికంగా వచ్చిన మంటలతో తోటి కార్మికుల కళ్లెదురుగానే 8 మంది మరణించడం దురదృష్టకరం. ఫ్యాక్టరీని కాపాడుకోవడంలో కార్మికుల, కార్మిక సంఘాల తెగువను, పట్టుదలను సిపిఐ(యం) అభినందిస్తున్నది.
నిన్న సంఘటన ప్రాంతాన్ని సందర్శించిన మంత్రులు పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లు కార్మికులు చేస్తున్న కృషిని అభినందించడానికి బదులుగా కార్మికులపై నెపం వేయడం, కార్మిక సంఘాలను నిందించడాన్ని సిపిఐ(యం) తీవ్రంగా ఖండిస్తున్నది. కె.జి.హెచ్.దగ్గర మృతుల కుటుంబాలను మా పార్టీ ప్రతినిధివర్గం పరామర్శిస్తున్న సమయంలోనే మంత్రి లోకేశ్ వస్తున్నారని సెక్యూరిటీ సిబ్బంది మమ్ములను పక్కకు తోసేశారు. ఒక జాతీయ రాజకీయ పార్టీ నాయకులు అక్కడున్నారన్న కనీస మర్యాదను కూడా పాటించలేదు. అయినప్పటికీ మా పార్టీ ప్రతినిధివర్గం పక్కకు తప్పుకొని లోకేశ్‌ను ఆహ్వానించింది. అక్కడే ఉన్న కార్మికులు, కార్మికసంఘాల నాయకులు చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని అడుగుతుండగా దాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించడమే కాకుండా ఎన్‌డిఏ ప్రభుత్వ గొప్పతనాన్ని చెప్పపూనుకోవడంతో కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నించారు. దీన్ని సహించలేని లోకేశ్ అసహనం వ్యక్తం చేయడం, కార్మిక సంఘాలకు దురభిప్రాయాలు అంటగట్టడం దురదృష్టకరం. కార్మికుల కోర్కెను విని సమాధానం చెప్పడానికి బదులు ప్రశ్నించడాన్ని రాజకీయమనడమే ఒక రాజకీయం. కోటి రూపాయల సహాయాన్ని పక్కదారి పట్టించడానికే లోకేశ్ రాజకీయం చేశారు.
విశాఖ ఉక్కు ప్లాంట్‌లో ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వాస్తవాలతో సహా సిపిఐ(యం) ప్రతినిధివర్గం నిన్న మీడియాకు వివరించింది. ఈరోజు ఒక తెలుగు పత్రికలో “ఉక్కు భద్రత తక్కు” అనే పేరుతో వచ్చిన కథనం మరో పత్రిక రాసిన సంపాదకీయం “మాటలకందని విషాదం” మా అభిప్రాయం సరైందని రుజువు చేస్తున్నది. ప్యాకేజీ గొప్పతనాన్ని గురించి పదేపదే చెబుతున్న కూటమి ప్రభుత్వం, మంత్రి లోకేశ్ ఆ డబ్బులు ఏమయ్యాయో వివరించాలని డిమాండ్ చేస్తున్నాం. పొదుపు పేరుతో కనీస నిధులు కూడా ఇవ్వకుండా, స్పేర్‌పార్ట్స్ ఇవ్వకుండా, నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కేంద్ర ఉక్కుశాఖ దీనికి బాధ్యత వహించాలి. 20 రోజులుగా బబుల్స్‌ను నిరోధించే కీలకమైన ఒక బ్యాటరీ పర్జింగ్ ట్యూబ్‌ను సమకూర్చలేకపోయారు. పక్కనే కొత్తగా ప్రారంభించబోతున్న మిట్టల్ ఫ్యాక్టరీకోసం పడుతున్న తపనలో ఒకశాతం కూడా విశాఖ ఉక్కుపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. దీనికి సమాధానం ఇవ్వకుండా ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ తప్పించుకుంటున్నారు. పైగా కార్మిక సంఘాలపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రెండేళ్ళలో 7500 మంది నిపుణులైన కార్మికులను తగ్గించి, ఉన్నవారిపై ఒత్తిడి పెంచి 1600 డిగ్రీల వేడిలో పనిచేస్తున్న కార్మికుల కష్టాన్ని కూడా వారు గుర్తించలేదు. నెలల తరబడి సగం సగం జీతాలు ఇస్తున్నా ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు ధారపోస్తున్న శ్రమను గుర్తించకుండా నిందించడం శ్రమను అవమానించడమే. కార్పొరేట్ల సేవలో నిండా మునిగిపోయిన ఈ ప్రభుత్వాలకు కార్మికుల కష్టం అర్థం కావడం కష్టమే. ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా అడ్డుకుంటూ దాని పరిరక్షణకోసం కృషి చేస్తున్న కార్మికులు, కార్మిక సంఘాల పోరాటానికి సిపిఐ(యం) మరోసారి మద్దతు ప్రకటిస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
