గాదె సాయికృష్ణ అదృశ్యంపై న్యాయ విచారణ జరిపించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 18 జూన్, 2026.
గాదె సాయికృష్ణ అదృశ్యంపై న్యాయ విచారణ జరిపించాలి
విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయి కృష్ణ అదృశ్యంపై తక్షణమే న్యాయ విచారణకు ఆదేశించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
గత నెలలో మార్కాపురం నుండి విజయవాడ కృష్ణలంక పోలీసులు సాయి కృష్ణను తీసుకొచ్చారని, అప్పటి నుండి కనిపించడం లేదని తల్లి ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో, పోలీసులు ఇస్తున్న వివరణ, పోలీసులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అనేక అనుమానాలకు తావు ఇస్తున్నాయి. సాయికృష్ణ లాకప్ డెత్‌లో చనిపోయినట్లు ఆమె తల్లి ఆరోపణ చేయడంతో సిఐని సస్పెండ్ చేసింది. శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. దీనితో లాకప్‌డెత్‌ను ప్రభుత్వం అంగీకరించినట్టుగానే భావించాల్సి వస్తుంది. శాఖపరమైన విచారణలో వాస్తవాలు వెల్లడయ్యే అవకాశాలు లేవు. కావున వెంటనే న్యాయ విచారణకు ఆదేశించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
సాయికృష్ణ పై కేసులు వుంటే చట్టబద్ధంగా వ్యవహరించి, శిక్షలు వేయించాల్సిన పోలీసులే ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని లాకప్ డెత్‌లు చేస్తే ప్రజల ప్రాణాలకు రక్షణ ఉండదు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
చట్ట విరుద్దమైన ఈ ఘటనను పౌర హక్కుల సమస్యగా చూడకుండా కుల సమస్యగా అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ అసలు సమస్యను పక్కదారిపట్టిస్తున్నాయి. రాష్ట్రంలో దిగజారుతున్న రాజకీయ విలువలకు ఇది నిదర్శనం.
లాకప్‌డెత్‌ను, పోలీసుల అప్రజాస్వామిక చర్యలను ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలని సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి