ఉపాధిని దెబ్బకొట్టే జి రాంజీ పథకం ప్రారంభానికి వస్తున్న కేంద్ర మంత్రి పర్యటనను నిరసించండి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 19 జూన్, 2026.
ఉపాధిని దెబ్బకొట్టే జి రాంజీ పథకం ప్రారంభానికి వస్తున్న
కేంద్ర మంత్రి పర్యటనను నిరసించండి

వ్యవసాయ కార్మికులకు పని హక్కుగా వున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కొత్తగా తెచ్చిన పథకం జి రామ్ జి ని మన రాష్ట్రం నుండే ప్రారంభించడానికి జూలై 1న వస్తున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పర్యటనను నిరసించాలని సిపిఐ(యం) పిలుపు ఇచ్చింది.
యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో కమ్యూనిస్టుల ఒత్తిడితో తెచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి బలహీనం చేస్తూ దానికి నిధులు తగ్గిస్తూ వచ్చింది. ఒకేసారి రద్దు చేస్తే పేదల్లో వ్యతిరేకత వస్తుందని దశలవారీగా రద్దు చేయడం కోసం జీ రాంజీ జి తెచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 90:10 శాతంగా ఉన్న నిధులను 60:40 శాతంగా మార్చింది. జి రాంజీ ని పార్లమెంటులో బలపరిచిన తెలుగుదేశం పార్టీ మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై 4000 కోట్ల అదనపు భారం పడుతుందని చెబుతుంది. అంత భారం ప్రభుత్వం భరించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని ప్రారంభించిన అనంతపురం జిల్లాలోనే జీ రాంజీని ప్రారంభించడం రాష్ట్రాన్ని అవమానించడమే. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. కేంద్ర మంత్రి పర్యటనను నిరసించాలని గ్రామీణ పేదలకు, వ్యవసాయ కార్మికులకు, రైతులకు పిలుపునిస్తున్నది. రాష్ట్రంలో పట్టణీకరణ, వలసలు పెరుగుతున్న దృష్ట్యా పాత పథకాన్ని పునరుద్దరించి పట్టణాలకు కూడా విస్తరించాలని డిమాండ్ చేస్తున్నది.
ఉపాధిపథకంలో అవినీతి ఉందన్న పేరుతో ఫేస్‌యాప్ పెట్టి కూలీలను వేధిస్తున్నారు. ఉన్నత స్థాయిలో అవినీతిని అరికట్టకుండా ఉపాధి కూలీలపై నెపం వేయడం సమంజసం కాదు. ఆ పేరుతో ఫేస్‌యాప్ పెట్టడంవల్ల పని ప్రదేశాల్లో నెట్ లేనందున పనిచేసే కూలి దక్కని పరిస్థితి. అందువల్ల వెంటనే ఫేస్‌యాప్‌ను ఉపసంహరించుకోవాలి. ప్రస్తుత ధరలలో కూలీ గిట్టుబాటు కావడం లేదు. కనీసం రోజుకి రూ.600లు ఇవ్వాలని, పని దినాలు పెంచాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
రాష్ట్రంలో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పనులు దొరకక వలసలు పోతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఈ సంవత్సరం ఏలినినో ప్రభావంతో వర్షాలు లేక గ్రామాల్లో పనులు మరింత తగ్గిపోతాయని చెబుతున్న ప్రభుత్వమే ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే చర్యలు చేపట్టడం సరికాదని సిపిఐ(యం) విమర్శిస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి