వ్యవసాయం, గ్రామీణ ప్రజలపై విద్యుత్ భారం మోపొద్దు... ప్రత్యేక డిస్కం రద్దు చేయాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విలేకర్ల సమావేశం - 21 జూన్, 2026 - బాలోత్సవ భవనం (విజయవాడ)

 

వ్యవసాయం, గ్రామీణ ప్రజలపై విద్యుత్ భారం మోపొద్దు

ప్రత్యేక డిస్కం రద్దు చేయాలి

-సిపిఐ(యం) డిమాండ్

 

ఉనికిలో లేని ఆంధ్రప్రదేశ్ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ (ఏపిఆరఏపిఎల్) పేరిట ఒక మిధ్యా డిస్కామ్ ఏర్పాటును తిరస్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్రప్రదేశ్ కమిటీ ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపిఈఆర్‌సి)ని కోరుతున్నది. అదానీ సోలార్ పవర్‌కు ప్రయోజనం చేకూర్చడానికి, అదే విధంగా సరికొత్త తరహాలో ప్రైవేటు డిస్కములకు ప్రయోగశాలగా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది. రాష్ట్ర విద్యుత్ వినియోగదారులకు లక్ష కోట్లకుపైగా నష్టం కలిగించి, గత వైసిపి ప్రభుత్వంలో వేలాదికోట్ల ముడుపులు చేతులు మారి  జరిగిన అదాని సోలార్-సెకి-ఏపి డిస్కం ఒప్పందానికి మరింత బలం చేకూర్చేలా ఇప్పటి టిడిపి కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం ఘోరం. వినాశకరమైన ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. రాష్ట్రంలోని వ్యవసాయ పంప్‌సెట్లకు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు యధావిధిగా మూడు డిస్కమ్‌ల ద్వారా ఉచితంగా విద్యుత్ సరఫరా కొనసాగించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.

వ్యవసాయం, గ్రామీణ రంగాలకు ప్రత్యేక డిస్కం పేరుతో భవిష్యత్తులో ఉచిత విద్యుత్ ఎత్తివేయడం, పట్టణ వినియోగదారులపై అదనపు భారం మోపడం, క్రాస్ సబ్సిడీ ఎత్తేసి బడా పారిశ్రామిక వేత్తలకు రాయితీ ఇవ్వడం. డిస్కాంలను విద్యుత్ పంపిణీ ప్రయివేటుపరం చేయడానికే ఈ తతంగమంతా నడుపుతున్నారు. అందుకే ప్రజలు దీన్ని తిప్పికొట్టాలి.

ఏపిఆరఎపిఎల్ పేరిట ముందుకు తీసుకు వస్తున్న డీమ్డ్ డిస్కం ప్రైవేటు డిస్కములకు ఎర్ర తివాచి వేయాలన్న పథకంలో భాగంగా కూడా. కేంద్ర ప్రభుత్వం ఆర్డిఎసఎస్ పేరుతో దేశమంతటా ప్రైవేటు డిస్కములను తెచ్చి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నా ప్రజలు, విద్యుత్ ఉద్యోగులు కార్మికులు ఇంజనీర్ల ఆందోళనలతో అనుకున్నట్టు జరగడం లేదు. అందుకే టిడిపి కూటమి ప్రభుత్వం ప్రైవేటు డిస్కములకు పైలెట్ ప్రాజెక్టులాగ ఏపిఆరఏపిఎల్ డిస్కమ్‌ను ముందుకు తెచ్చింది. ఇటీవల డేటా సెంటర్ల కోసం క్యాప్టివ్ డిస్కముల పేరుతో డీమ్డ్ డిస్కం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. గూగుల్ డీమ్డ్ డిస్కములకు రక్షణ కవచంగా ఏపిఆరఎపిఎల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందన్న నిపుణుల సందేహం సరైనదే. గత వైసిపి ప్రభుత్వం, ఈనాటి టిడిపి కూటమి ప్రభుత్వం రెండూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కనుసన్నల్లో అదానీ, అంబానీ, గూగుల్, మెటా వంటి కార్పొరేట్ సేవలో మునిగితేలుతున్నవేనని అర్థం చేసుకోవాలి.

రాష్ట్రంలోని వ్యవసాయ వినియోగదారులకు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు విద్యుత్ అందజేయడానికి ఏపిఆరఎపియల్ పేరిట ఒక డీమ్డ్ డిస్కమును ఏర్పాటు చేస్తున్నట్టు, దానికి లైసెన్సు మంజూరు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఏపిఈఆర్‌సికి దరఖాస్తు చేసింది. ఈ అంశంపై అభిప్రాయాలు, అభ్యంతరాలు జూన్ 22లోగా తెలియజేయాలని ఏపిఈఆర్‌సి బహిరంగ ప్రకటన విడుదల చేసింది. అసలు ఈ డీమ్డ్ డిస్కం అన్నది ఉనికిలోనే లేని ఒక మిధ్యా వ్యవస్థ. విద్యుత్ చట్టం (2003) ప్రకారం ఏదైనా డిస్కామ్ ఏర్పాటు చేయాలంటే అందుకు అవసరమైన ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్, అదే విధంగా నికరమైన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, నమ్మకమైన పంపిణీ వ్యవస్థ తదితర నిబంధనల్లో ఏ ఒక్కటి ఏపిఆరఎపిఎల్ అమలు చేసే పరిస్థితి లేదు. అదానీ సోలార్ నుండి సెకి ద్వారా 7000 మెగావాట్ల కొనుగోలు ఒప్పందంలో ఇప్పుడు కేవలం 300 మెగావాట్లు అంటే 4.5 శాతం మాత్రమే అందుబాటులో ఉంది. ఏపిఆరఏపిఎల్‌కు సొంత పంపిణీ వ్యవస్థగాని కనీసం ఒక్క విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌గాని లేవు. విద్యుత్తు సరఫరా అదేవిధంగా కొత్తగా పంప్‌సెట్ కనెక్షన్లు మంజూరు చేయడం వంటి పనులన్నీ ఇకపై కూడా ఇప్పుడున్న మూడు డిస్కంలే చేస్తాయని దరఖాస్తులో పేర్కొన్నారు. మూడు డిస్కౌంలకు ఏపిఆరఏపిఎల్‌కు మధ్య జరిగే లావాదేవీలు బుక్ అడ్జస్టుమెంట్లే అయినప్పటికీ అవి సమాన స్థాయిలో లేవు. ప్రస్తుత డిస్కాములకు నష్టంకలిగించేవిగా ఉన్నాయి. పర్యవసానంగా మొత్తం విద్యుత్ వినియోగదారులకు నష్టం. అంటే ట్రూ అప్ ఎఫఎపిపిసి లేదా మరో పేరుతో భారాలు పడతాయి. కాబట్టి ఎటువంటి వ్యవస్థ లేకుండా కేవలం కాగితాల మీద మాత్రమే చూపించే ఈ డీమ్డ్ డిస్కం ఒక మాయ, మోసం. అయితే ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తంటాలు పడడం వెనకగల కుట్రలను అర్థం చేసుకోవాలని విజ్ఞులైన ప్రజలకు సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తుంది. అదానీ సోలార్-సెకి-ఏపిడిస్కాం ఒప్పందం వెనుక గత వైసిపి ప్రభుత్వ హయాంలో వేలకోట్ల రూపాయలు చేతులు మారిన వ్యవహారం అమెరికాలో కోర్టులకెక్కిన సంగతి జగద్విదితమే. సదరు ఒప్పందం మూలంగా రాష్ట్రానికి 25 ఏళ్లలో లక్ష కోట్లకుపైగా నష్టం వాటిల్లుతోంది. ఆ మోసపూరిత ఒప్పందానికి పూర్తిస్థాయి ప్రయోజనాలు చేకూర్చడానికే ఇప్పుడు టిడిపి ప్రభుత్వం ప్రయత్నించడం సిగ్గుచేటు. ఆనాడు ఈ ఒప్పందంపై బహిరంగంగా విమర్శలు చేయడమే కాక హైకోర్టులో కేసు వేసిన నాటి పిఏసి అధ్యక్షుడు నేటి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పుడు మిన్నకుండా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆనాటి మాటలన్నిటినీ మూటగట్టి అటకెక్కించి ఇప్పుడు అదాని సేవలో తరిస్తున్నారని ప్రజలు అర్థం చేసుకోవాలి. నాటి వైసిపి నేటి టిడిపి కూటమి ప్రభుత్వాలు కార్పొరేట్ సేవలో విద్యుత్ వినియోగదారులను కొల్లగొడుతున్న కుట్రలను వమ్ము చేయాలని ప్రజలకు సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తోంది. హైకోర్టులో ఉన్న కేసును కదిలించి తక్షణం పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నది.