
(ఈరోజు (21 జూన్) సిపిఐ(యం) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
రూరల్ డిస్కం రద్దు చేయాలి
వ్యవసాయం, గ్రామీణ ప్రజలపై విద్యుత్ భారం మోపొద్దు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
ఉనికిలో లేని ఆంధ్రప్రదేశ్ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ (ఏపిఆరఏపిఎల్) పేరుతో ఒక మిధ్యా డిస్కామ్ ఏర్పాటును రద్దు చేయాలని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అదానీ, సెకీ, డిస్కంల మధ్య జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందానికి ప్రయోజనం చేకూర్చడానికి, అదే విధంగా సరికొత్త తరహాలో ప్రైవేటు డిస్కంలను అనుమతించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యురాలు డి రమాదేవి, రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావులతో కలిసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వంలో రూ.1750కోట్ల ముడుపులు చేతులు మారి అమల్లోకి వచ్చిన అదాని, సెకీ, డిస్కంల ఒప్పందానికి మరింత బలం చేకూర్చేలా టిడిపి కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం ఘోరమని ఆందోళన వ్యక్తం చేశారు.సెకీ వల్ల ఏడాదికి రూ.3805కోట్లు, పాతికేళ్లల్లో రూ.1.25లక్షల కోట్లు ప్రజలు భరించాల్సి ఉంటుందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రంలో పొందుపరిచారని తెలిపారు. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆర్ధిక శాఖమంత్రి పయ్యావుల కేశవ్ ప్రతిపక్షంలో ఉండగా హైకోర్టులో వేసిన కేసు ఇప్పటికీ పెండింగ్‌లో ఉందన్నారు. ఇప్పుడు ఆ కేసును కావాలనే పట్టించుకోవడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నష్టకరమైన ఒప్పందం అధికారంలోకి రాగానే లాభకరంగా మారుతుందా? అని నిలదీశారు. వినాశకరమైన ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం, గ్రామీణ రంగాలకు ప్రత్యేక డిస్కం పేరుతో భవిష్యత్తులో ఉచిత విద్యుత్ ఎత్తివేయడంతో పాటు క్రాస్ సబ్సిడీ రద్దు చేసి బడా పారిశ్రామిక వేత్తలకు రాయితీలు ఇవ్వడం, పట్టణ వినియోగదారులపై అదనపు భారం మోపడమేనని వివరించారు. విద్యుత్ పంపిణీని ప్రైవేట్‌పరం చేసేందుకే ఈ తతంగమంతా నడుపుతున్నారని,అందుకే ప్రజలు దీన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆర్‌డిఎసఎస్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశమంతటా ప్రైవేటు డిస్కంలను తెచ్చి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నా ప్రజలు, విద్యుత్ ఉద్యోగులు కార్మికులు ఇంజనీర్ల ఆందోళనలతో అడ్డుకుంటున్నారని తెలిపారు. అందుకే టిడిపి కూటమి ప్రభుత్వం ప్రైవేటు డిస్కంలకు పైలెట్ ప్రాజెక్టులాగ ఏపిఆరఏపిఎల్ డిస్కమ్‌ను ముందుకు తెచ్చిందని వివరించారు. డేటా సెంటర్ల కోసం క్యాప్టివ్ డిస్కముల పేరుతో డీమ్డ్ డిస్కం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందని తెలిపారు. గూగుల్ డీమ్డ్ డిస్కములకు రక్షణ కవచంగా ఏపిఆరఎపిఎల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందన్న నిపుణుల సందేహం నిజమేనని తెలిపారు. వైసిపి ప్రభుత్వం, టిడిపి కూటమి ప్రభుత్వం రెండూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కనుసన్నల్లో అదానీ, అంబానీ, గూగుల్, మెటా వంటి కార్పొరేట్ సేవలో మునిగితేలుతున్నాయని పేర్కొన్నారు.
ఏపిఆరఎపియల్ డీమ్డ్ డిస్కం లైసెన్సు మంజూరు కోసం రాష్ట్రప్రభుత్వం ఏపిఈఆర్‌సికి దరఖాస్తు చేసిన అంశంపై అభిప్రాయాలు, అభ్యంతరాలు ఈ నెల 22లోగా తెలియజేయాలని ఎపిఇఆర్‌సి బహిరంగ ప్రకటన విడుదల చేసిందన్నారు. సెకి ద్వారా 7000 మెగావాట్ల విద్యుత్ దశల వారే ఈ పాటికే సరఫరా చేయాల్సి వున్నా అదానీ కంపిని దాన్ని ఉల్లంఘించిందనీ అయినా ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ బాటలోనే అసమర్థంగా వ్యవహరిస్తోందని మంది పడ్డారు. ఒప్పందంలో ఇప్పుడు కేవలం 300 మెగావాట్లు అంటే 4.5 శాతం మాత్రమే అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఏపిఆరఏపిఎల్‌కు సొంత పంపిణీ వ్యవస్థగాని, ఒక్క విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌గాని లేవని పేర్కొన్నారు. విద్యుత్తు సరఫరా, కొత్త పంప్‌సెట్ కనెక్షన్లు మంజూరు వంటి పనులన్నీ ప్రస్తుతం ఉన్న మూడు డిస్కంలే చేస్తాయని దరఖాస్తులో పేర్కొన్నారని తెలిపారు. ఈ డిస్కాంలకు ఏపిఆరఏపిఎల్‌కు మధ్య జరిగే లావాదేవీలు బుక్ అడ్జస్టుమెంట్లే అయినప్పటికీ అవి సమాన స్థాయిలో లేవని పేర్కొన్నారు. ప్రస్తుత డిస్కాములకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని వివరించారు. ట్రూ అప్ ఎఫఎపిపిసి లేదా మరో పేరుతో వినియోగదారులపై భారాలు పడతాయని తెఇపారు. కేవలం కాగితాల మీద మాత్రమే చూపించే ఈ డీమ్డ్ డిస్కం ఒక మాయ, మోసం అని విమర్శించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో వేలకోట్ల రూపాయలు చేతులు మారిన వ్యవహారం అమెరికాలో కోర్టులకెక్కిన సంగతి తెలిసిందేనని చెప్పారు. ఈ మోసపూరిత ఒప్పందానికి పూర్తిస్థాయి ప్రయోజనాలు చేకూర్చడానికే ఇప్పుడు టిడిపి ప్రభుత్వం ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. నాటి వైసిపి నేటి టిడిపి కూటమి ప్రభుత్వాలు కార్పొరేట్ సేవలో విద్యుత్ వినియోగదారులను కొల్లగొడుతున్న కుట్రలను వమ్ము చేయాలని ప్రజలను కోరారు. హైకోర్టులో ఉన్న కేసును కదిలించి తక్షణం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలపై భారాలు మోపేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కార్పొరేట్ల లూటీని అరికట్టే దమ్ము పవన్ కు వుందా? ఆయన శాఖలు పని చేయకా ప్రజలకు శాపంగా మారాయి. తాను హోమ్ మంత్రి అయిఉంటె తాటా తీస్తానని చెబుతున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు తన శాఖల ద్వారా కార్పొరేట్ లూటీని అరికట్టాలని సూచించారు. హెట్రో డ్రగ్స్ కాలుష్యం వల్ల రాజయ్యపేట దగ్గర సముద్రంలో టన్నుల కొద్ది చేపలు మృత్యువాత పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హెట్రో డ్రగ్ కాలుష్యాన్ని అరికట్టేందుకు పర్యావరణ శాఖ మంత్రిగా ఏం చేస్తున్నారని పవన్‌ను ప్రశ్నించారు. విశాఖపట్నంలో అదానీ గూగుల్ డేటా సెంటర్ వల్ల వాతావరణం వేడేక్కుతుందని ప్రతి ఒక్కరూ నేడు అంగీకరిస్తున్నారని అయినా పర్యావరణ శాఖ నిద్ర పోతున్నదా? అని ప్రశ్నించారు. అమెరికా ప్రజలు తిరస్కరించిన గూగుల్ డేటా సెంటర్‌కు విశాఖలో ఏర్పాటు చేసేందుకు ఆమోద ముద్ర వేస్తే పర్యావరణ మంత్రిగా ఏం చేస్తున్నారని అడిగారు. వీరిని అడ్డుకునే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని లూటీ చేసే కార్పొరేట్లను ఏం చేసే దమ్ము లేదన్నారు. ప్రపంచమంతా పర్యావరణంపై కొట్టుకుంటున్నాయని అలాంటి కీలకమైన శాఖను ఉంచుకుని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏజెన్సీల్లో పంప్‌స్టోరేజ్ పేరుతో అదానీ కంపెనీ అక్రమంగా సర్వేలు చేస్తూ అడవులను నాశనం చేస్తుంటే అటవీశాఖ మంత్రిగా నిద్ర పోతున్నారా అని నిలదీశారు. అకమ్రంగా ఏజెన్సీల్లో సర్వేలు చేస్తున్న అదానీ కంపెనీ తాట తీయండని చెప్పారు. ఏజెన్సీలో డోలీలు లేకుండా చేస్తామని చెప్పినా ఇప్పటివరకు రోడ్లు కూడా వేయలేదని , ఫీడర్ అంబులెన్సులు కూడా లేవన్నారు. మీ శాఖల్లో పని సామర్థ్యం పెంచి దాని ద్వారా ప్రజలకు మేలు చేసి కార్పొరేట్ల తాట తీయండని డిమాండ్ చేశారు.
సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం రూ.32వేల కోట్ల భారం ప్రజలపై భారం మోపిందని, తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు నియంత్రిస్తామని, తగ్గిస్తామని హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. చార్జీలు 13 పైసలు తగ్గించామని ముఖ్యమంత్రితో సహా కూటమి నేతలు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. రెండేళ్లకాలంలో ప్రతి యనిట్‌పై 80పైసలు నుంచి రూ.1.40ల వరకు సర్దుబాటు, ట్రూఅప్ పేరులతో ప్రజల వద్ద వసూలు చేస్తున్నారని తెలిపారు. రూ.1.40లలో 13 పైసలు తగ్గించామని చెప్పడం ప్రజలను నమ్మించి మోసం చేయడమేనని విమర్శించారు. వైసిపి అవినీతి బట్ట బయలు చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పారని తెలిపారు. వైసిపి ప్రభుత్వ పెద్దలు లంచాలు తీసుకొని సెకీ ఒప్పందం చేసుకున్నారని అమెరికా కోర్టులో సాక్ష్యాలతో బట్టబయిందన్నారు. ఇసుక, మద్యంపై విచారణ జరుపుతున్న కూటమి ప్రభుత్వం ఈ ఒప్పందంపై విచారణ ఎందుకు జరపడం లేదని నిలదీశారు. ప్రజలపై భారం పడే ఈ అవినీతిని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. మోడీ, బిజెపి అదానీ అవినీతిని విశ్వవ్యాప్తం చేస్తోందని, ఈ భారం రాష్ట్రంపై ఎక్కువగా ఉందన్నారు. గతంలో వైసిపి ఇప్పుడు కూటమి అదానీని కాపాడటంలో అందరూ ఒకే మాటపై ఉన్నారని విమర్శించారు. మోడీ, జగన్, చంద్రబాబు, పవన్ ఈ అవినీతిలో కుమ్మకై రాష్ట్రప్రజలపై భారం మోపుతున్నారని తెలిపారు. అందులో భాగంగానే అదానీకి మేలు చేసేందుకు రూరల్ అగ్రికల్చర్ పేరుతో కొత్త విద్యుత్ పంపిణీ సంస్థను తీసుకొచ్చి అదానీని కాపాడుతున్నారని తెలిపారు.
విజయవాడలో సాయికృష్ణను పోలీసులు అక్రమంగా నిర్బంధించి పోలీసులే కొట్టి చంపారనే అంశంపై తూతుమంత్రంగా కాకుండా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నేరాలు చేసే వారిని శిక్షిస్తే ఏవరికీ అభ్యంతరం లేదని తెలిపారు. చట్ట ప్రకారం విచారణ జరిపి, సాక్షలు రుజువు చేసి శిక్ష పడేలా చేయాలని కోరారు. కానీ పోలీసులు, ప్రభుత్వమే చట్టాన్ని చేతుల్లో తీసుకొని నేరాలు చేసేవారిని కాపాడి తాము కోర్టులాగా శిక్షలు వేసి చంపేస్తామంటే ఏవరూ హర్షించరని తెలిపారు. పోలీసులపై పోలీసుల విచారణ జరిగితే న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. ఉన్నత స్థాయి న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వాన్ని కోరతామన్నారు. సాయికృష్ణ సంఘటన, క్రాంతికుమార్ ఆత్మహత్యలపై పోలీసులపై వచ్చిన ఆరోపణలపై ఉన్నత స్థాయి న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు.
