యాప్ ద్వారా ఎరువుల పంపిణి విధానం ఉపసంహారించుకోవాలి. సాయి కృష్ణ లాకప్ డెత్ తెర వెనుక కుట్ర దారులు,

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 29 జూన్, 2026.

(సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం నిన్న, ఈరోజు (28,29 జూన్) పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షతన విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, యు.వాసుకి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి హాజరయ్యారు. సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాలను ప్రచురణార్థం, ప్రసారార్థం విడుదల చేస్తున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

తీర్మానం -1
యాప్ ద్వారా ఎరువుల పంపిణి విధానం ఉపసంహారించుకోవాలి.
పాత పద్ధతిలోనే రైతులు, కౌలు రైతులకు ఎరువులు పంపిణీ చేయాలి.
-సిపిఐ(యం)
రాష్టంలో ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభం అయ్యింది. సీజన్ ప్రారంభంతో యూరియా వంటి ఎరువుల కొరకు రైతులు, కౌలు రైతులు ఆరఎస్‌కెల చుట్టూ, ఎరువుల దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని ప్రభుత్వం రైతులకు కల్పించింది. ఎరువుల పంపిణీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన యాప్‌లో ఎరువుల పంపిణీ అనే విధానం రైతులను కొత్త ఇబ్బందులకు గురి చేస్తున్నది. అసలే ఎరువుల ధరలు పెరిగి ఆందోళనతో ఉన్న రైతాంగానికి యాప్ ద్వారా ఎరువులు పంపిణీ విధానం కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. ఎరువులు దొరక్క వ్యవసాయోత్పత్తి దెబ్బతినే ప్రమాదం ఉంది. రాష్ట్రాభివృద్ధిపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
ఆరఎస్‌కేలలో ఎరువుల కోసం వెళ్ళిన రైతులకు మీ భూమి ఆన్లైన్‌లో లేదని, మీ భూమికి గత సంవత్సరం ఈక్రాప్ కాలేదని మీ భూమికి ఎంత ఎరువులు అవకాశం ముందో యాప్‌లో చూపించడం లేదని, సర్వర్ పనిచేయడం లేదని వివిధ కారణాలతో ఎరువుల పంపిణీని తిరస్కరిస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. భూమి ఆధారంగా ఎరువుల పంపిణీ విధానాన్ని ప్రభుత్వం చేపట్టడంతో, భూమిలేని కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. పంటల అవసరాన్ని బట్టిగాక ఎకరాకు ఎన్ని బస్తాలు కావాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. మూడు దఫాలుగా ఎరువులు ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది. ఈ విధానంలో ఎరువులు కొనలేక వ్యవసాయం చేయాలా? వద్దా అన్న సందేహంలో రైతులు, కౌలురైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
ఎరువుల దుర్వినియోగానికి పాల్పడుతున్న బడా వ్యాపారస్తులు, బ్లాక్ మార్కెటర్లను ఒందిలిపెట్టి రైతులను శిక్షింపడం న్యాయం కాదు. దీన్ని అరికట్టేందుకు అనేకమార్గాలు ఉండగా ఆ మార్గాలను అనుసరించకుండా, రైతులకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టే యాప్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని, పాత పద్ధతిలోనే పంటలకు అవసరాన్ని బట్టి యూరియా, డిఏపి వంటి ఎరువులను రైతులకు, కౌలురైతులకు అందించాలని సిపిఐ(యం)రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
= = = =

తీర్మానం -2
సాయి కృష్ణ లాకప్ డెత్ తెర వెనుక కుట్ర దారులు,
బాధ్యులైన పోలీసుల పాత్ర పై సమగ్ర న్యాయవిచారణ జరపాలి
- సిపిఐ(యం)
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పోలీసుల దాష్టీకంతో మృతి చెందిన గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ తెర వెనుక భూ వివాదాలు, ఇందులో భాగస్వాములైన రాజకీయ నేతలు, ఇతర పోలీసు అధికారుల పాత్రపై సమగ్ర న్యాయ విచారణ జరపాలని సిపిఐ(యం) ఆంధ్ర ప్రదేశ్ కమిటీ డిమాండ్ చేస్తుంది.
సాయి కృష్ణ లాకప్ డెత్ తెర వెనుక భూ కుంభకోణాలు, కొందరు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల పాత్ర పై అనేక వార్తలు వస్తున్నాయి. పోలీసులతోపాటు అనేకమంది ప్రైవేటు వ్యక్తుల పాత్ర పైన నిర్దిష్ట సమాచారం ఇప్పటికే వెల్లడైంది. అనేక కేసుల్లో ముద్దాయిలైన వ్యక్తులను పోలీసులు, రాజకీయ పెద్దలు తమ అవసరాలకు వినియోగించుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి.  కృష్ణలంక సీఐ మాత్రమే కాకుండా అనేకమంది పోలీసులు ఉన్నతాధికారుల పాత్రపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం నియమించిన సిట్ విచారణకు అనేక పరిమితులు ఉన్నాయి. పూర్తిస్థాయి విచారణ పోలీస్ అధికారులతో కూడిన సిట్ చేయలేదు. లాకప్ డెత్ కారకులైన పోలీసులే కాకుండా రాజకీయ నేతలు, బయట వ్యక్తుల పాత్రపై వాస్తవాలు బయటికి రావాలంటే సమగ్రమైన న్యాయ విచారణ అవసరం
రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చటానికి ప్రయత్నిస్తున్నదని సర్వత్రా ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే న్యాయ విచారణకు ఆదేశించాలని, ఇందులో భాగస్వాములైన పోలీసులు, రాజకీయ నేతలు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా అందరిపైనా చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
= = = =