
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 07 జూలై, 2026.
సముద్రంలో మునిగి పోయిన మత్స్యకారుల జాడ తెలుసుకోవాలి
వారి కుటుంబాలను ఆదుకోవాలి - సిపిఐ(యం) డిమాండ్
సముద్రపు వేటకు వెళ్ళే మత్స్యకారులకు
రాష్ట్ర ప్రభుత్వం ప్రాణ రక్షణ కల్పించాలి
విశాఖ సముద్ర తీరంలో జులై 4 తేదీ సాయంత్రం 6 గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. నేటికీ వారి ఆచూకీ తెలియలేదు. వారి కుటుంబాలు రాత్రింబవళ్ళు సముద్ర తీరంలో రోదిస్తున్నాయి. ఈ విశాద సమయంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంఘీభావం, సానుభూతిని తెలియజేస్తున్నది.
గంగవరం సముద్ర తీరానికి 14 నాటికల్ మైళ్ళ దూరంలో వీరి పడవ తీవ్రమైన సముద్ర కెరటాలకు మునిగిపోయింది. మునిగిపోయిన మత్సకారులను కాపాడలేకపోవటానికి కోస్ట్ గార్డ్ వైఫల్యమే ప్రధాన కారణం. కోస్ట్ గార్డ్ సిబ్బంది తక్కువగా ఉండటం, ఆధునిక బోట్లు లేకపోవటం వలన మత్సకారులను వెంటనే కాపాడలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రతి బోట్‌కి ఇచ్చిన జిపిఎస్‌లు పని చేయటంలేదు. నాణ్యత లేని చౌకరకం జిపిఎస్‌లు ఇచ్చి మత్సకారుల ప్రాణాలు బలిగొన్నారు. జిపిఎస్ ద్వారా హెచ్చరికలు తెలిసి ఉంటే మత్సకారులు సముద్ర తీరాన్ని ముందుగానే చేరి ఉండేవారు. ఆంద్రప్రదేశ్‌కు విశాలమైన 1005కిలో మీటర్ల సముద్రతీరం ఉంది. ఈ సముద్ర తీరాన్ని రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేట్లకు అప్పగించడంలో అత్యంత శ్రద్ద చూపిస్తున్నారు తప్ప ఈశ్రద్దలో కొద్ది భాగమైనా మత్స్యకారులపై చూపించడం లేదు. రాష్ట్రంలోని మత్స్యకారులందరికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాణరక్షణ చర్యలు చేపట్టాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి డిమాండ్ చేస్తున్నది.
తీవ్రమైన సముద్ర అలల తాకిడికి ఏడుగురు మత్స్యకారులు ప్రయాణిస్తున్న మెకనైజ్డ్ బోట్‌లో యజమాని మరియు బోట్ డ్రైవరుగా పనిచేస్తున్న కారి చిన్న ఒక్కడే తీరం చేరుకోగలిగాడు. ఈయనను కాకినాడ పోర్ట్ వైపు వస్తున్న చైనా పనామా మర్చంట్‌షిప్‌లో ఉన్న 24 మంది కార్మికులు కాపాడారు. విశాఖపట్నం తీసుకువచ్చి వైద్య సహాయం అందిస్తున్నారు.
మిగిలిన ఆరుగురు కార్మికులలో ఐదుగురు విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందినవారు. ఒకరు భీమిలి మండలం పెదనాగమయ్యపాలెం గ్రామానికి చెందినవారు. వీరి ఆచూకి గురించి రాష్ట్ర ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సిపిఐ(యం) కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
