రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ విధానాన్ని విడనాడాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 12 జూలై, 2026.

రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ విధానాన్ని విడనాడాలి

శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు ప్రభావిత గ్రామంలో కేంద్ర మంత్రి కె.రామమోహన్ నాయుడు పర్యటిస్తున్న నేపథ్యంలో సిపిఐ(యం) శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావును గత రాత్రి నుండి పోలీసులు గృహ నిర్బంధంలో వుంచడం గర్హనీయం. ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు బత్తిన లక్ష్మణరావును కూడా ఆదివారం ఉదయం అరెస్టు చేసి మందస పోలీసు స్టేషన్‌కు తరలించారు. వామపక్ష పార్టీల నాయకులు వంకల మాధవరావు, తామాడ సన్యాసిరావు, చాపర వెంకట రమణ, ఎన్.గణపతి, తదితరుల ఇళ్ళవద్దకు పోలీసులు వెళ్ళి ఆదివారం ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు గ్రామాలకు వెళ్ళరాదని హెచ్చరించారు. కేంద్ర మంత్రి పాల్గొంటున్నారు కనుక ఆ ప్రాంతానికి వచ్చే వారందరి ఆధార్ కార్డులను తనిఖీ చేసి ఇరుగు పొరుగు మండలాల వారిని అనుమతించడంలేదు. స్థానికులే అయినా ఎయిర్‌పోర్టు వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్నవారెవరైనా వస్తే కొంత మందిని వెనక్కు పంపడం, ఇంకొందర్ని సమీపంలోనే పోలీసు వలయం మధ్య ఉంచడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఎయిర్‌పోర్టు ప్రభావిత రైతులతోను, ఆయా గ్రామస్తులతో ప్రభుత్వం ప్రజాస్వామికంగా చర్చించవలసింది పోయి ఇలా నిర్బంధ చర్యలకు పాల్పడడం తగదు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి బలవంతపు భూసేకరణ ఆపాలి. గోవిందరావును గృహ నిర్బంధం నుండి, మిగతా వారిని ఆయా పోలీసు స్టేషన్ల నుండి విడుదల చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. 

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి