
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 12 జూలై, 2026.
ఉండవల్లిలో బలవంతపు భూసేకరణ తగదు
రైతులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించిన సిపిఐ(యం)
రైతులకు న్యాయంగా నష్టపరిహారం ఇవ్వాలి
రాజధాని అమరావతిలోని ఉండవల్లిలో రెండున్నర ఎకరాలకు పైగా రైతుల భూమిని దౌర్జన్యంగా సేకరించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. వారంతా పేద రైతులు. భూమి తప్ప మరో దిక్కు లేదు. హైకోర్టు ఆర్డర్‌పై రైతులతో సామరస్యంగా చర్చలు జరిపి వారికి న్యాయంగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నది. పంటలను ధ్వంసం చేసి, రైతులపై దౌర్జన్యం చేసిన, మహిళలని చూడకుండా అవమాన కరంగా మాట్లాడిన, పోలీసు, రెవిన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
ఉండవల్లిలో ఎకరం భూమి ఐదు నుండి ఏడు కోట్ల రూపాయలకు పైగా ఉండగా, ఎకరం విలువ కోటి 18 లక్షలుగా లెక్క గట్టి, రెండు కోట్ల 62 లక్షల రూపాయలకు అవార్డు ఇచ్చి, ఆగ మేఘాల మీద దౌర్జన్యంగా భూములు లాక్కోవటం అక్రమం. మహిళలతో సహా రైతులను నిర్బంధించి, చేతికొచ్చిన పంటను నాశనం చేసి బుల్డోజర్లతో అప్పటికప్పుడే రోడ్డు వేయడానికి ప్రయత్నించటం అన్యాయం. ప్రభుత్వం, సిఆర్‌డిఏ రైతులతో చర్చలు జరిపి న్యాయమైన పరిహారాన్ని రైతులకు చెల్లించి భూములు స్వాధీనం చేసుకుని రోడ్డు వేసుకోవటానికి అవకాశం ఉన్నప్పటికీ, దౌర్జన్య పూర్వకంగా వ్యవహరించడం గర్హనీయం. ఇప్పటికైనా రైతులతో చర్చలు జరిపి, వారికి మార్కెట్ విలువకు అనుగుణంగా న్యాయమైన పరిహారం చెల్లించాలి.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
