
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 15 జూలై, 2026.
కార్గో ఎయిర్‌పోర్టు వ్యతిరేక నిరసనలను అడ్డుకోవడం నిరంకుశం
శ్రీకాకుళం జిల్లా మందస కార్గో ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ ఈరోజు పలాస ఆర్డిఓ ఆఫీస్ వద్ద ధర్నాకు వెళ్తున్న రైతులను గ్రామస్తులను వారి వారి గ్రామాలలోనే పోలీసులు ఆపివేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. దాంతో ప్రజలు ఆయా గ్రామాల్లోనే నిరసన తెలియజేశారు. అనేక ఆటంకాలను అధిగమించి ధర్నాకు వెళ్లాలని ప్రయత్నించిన సిపిఐ(యం) జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, న్యూ డెమోక్రసీ నాయకులు వంకల మాధవరావు, లిబరేషన్ నాయకులు మద్దిల రామారావు ఇంకొంతమంది వామపక్ష నాయకులను కూడా ఆర్డిఓ ఆఫీస్ సమీపŸంలోనే పోలీసులు అడ్డగించడం నిరంకుశ చర్య.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈనెల 12న ఎయిర్పోర్ట్ ప్రభావిత బిడిమి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో రైతులు, ప్రజలు తమ బతుకులను బుగ్గిపాలు చేసే ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను విరమించుకోవాలని ముక్తకంఠంతో ఆయనకు విన్నవించుకున్నారు. అయినా ప్రభుత్వం పునరాలోచించవలసింది పోయి రైతులపై, నిరసనకారులపై నిర్బంధానికి పాల్పడడం దారుణం. ఆరోజు కూడా వామపక్ష నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
ప్రజలు వద్దంటున్న కార్గో ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని, ప్రజాస్వామిక నిరసనలపై నిర్బంధాన్ని విడనాడాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
