డా॥ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలను యథాతథంగా కొనసాగించి, సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సాంఘిక సంక్షేమశాఖ మంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 18 జూలై, 2026.

శ్రీయుత డా॥ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారికి,

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,

అమరావతి.

విషయం:  డా॥ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలను యథాతథంగా కొనసాగించి, సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరుతూ...

అయ్యా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి. నెం.144, తేదీ 11-07-2026 ద్వారా ఎస్సీ తదితర వెనుకబడిన విద్యార్థుల కోసం సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయడం స్వాగతించదగిన నిర్ణయం. అయితే ఈ కేంద్రాల ఏర్పాటు పేరుతో దశాబ్దాలుగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న తాడికొండ, విశాఖపట్నం మేఘాద్రిగడ్డ, తిరుపతి జిల్లా కోటలోని డా॥ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలను మూసివేయడం కోసం ఇక్కడ ఉన్న విద్యార్థులను ఇతర స్కూల్స్‌కి తరలించడం సమంజసం కాదు.

గురుకుల పాఠశాలలను కొనసాగిస్తూనే, సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు అవసరమైన కొత్త భవనాలను లేదా ప్రత్యామ్నాయ ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేసి ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కావున  మీరు వ్యక్తిగతంగా శ్రద్ధపెట్టి వీటిని కొనసాగించేందుకు చర్య తీసుకోవాలని కోరుచున్నాను. 

అలాగే సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను ప్రత్యేక ప్రాంగణంలో ఏర్పాటు చేయాలి. వీటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని కోరుతున్నాను. కనీసం ఉమ్మడి జిల్లాకు ఒకటైనా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను.

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి