వాంగ్‌చుక్ దీక్ష భగ్నం చేయడం నిరంకుశం నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 18 జూలై, 2026.

వాంగ్‌చుక్ దీక్ష భగ్నం చేయడం నిరంకుశం

నిరసనలకు సిపిఐ(యం) పిలుపు

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

పరీక్షా విధానంపై ఉద్యమకారులతో తక్షణమే చర్చించాలి

కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడైన సోనమ్‌వాంగ్‌చుక్ దీక్ష భగ్నం చేసి బలవంతంగా ఆసుపత్రికి తరలించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. కేంద్రప్రభుత్వం పరీక్షల నిర్వహణలో వైఫల్యాన్ని కప్పిపెట్టుకోవడానికి ఇలాంటి నిరంకుశ చర్యలకు పాల్పడటం దారుణం. ఉద్యమకారులతో కనీసం చర్చలకు సిద్ధపడకుండా దేశ పరీక్షల వ్యవస్థ, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురాకుండా 21 రోజుల దీక్షను భగ్నం చేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం.

ఉద్యమం ఆగిపోకుండా కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, ఎస్ఎఫ్ఐ అఖిలభారత నాయకులు ఆదర్శ్ ఎం సాజి, ఐషీ ఘోష్ నిరవధిక నిరాహార దీక్షను కొనసాగించడం హర్షణీయం. ఇప్పటికే సిపిఐ(యం) సీనియర్ నాయకులు బృందాకరత్ వారికి సంఘీబావం ప్రకటించారు.

పరీక్షా విధానంపై కేంద్ర ప్రభుత్వం తక్షణం ఆందోళన చేస్తున్న నాయకులతో చర్చించాలి. పార్లమెంట్ సమావేశాల్లోగానే ప్రధాన్‌తో రాజీనామా చేయించాలి లేదా అతన్ని బర్తరఫ్ చేయాలి. ఇకనైనా ప్రవేశ పరీక్షలు సవ్యంగా జరగడానికి వీలుగా వికేంద్రీకరించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

వాంగ్‌చుక్ దీక్షకు మద్దతుగా, దీక్ష భగ్నానికి నిరసనగా జూలై 20వ తేదీన రాష్ట్రమంతా ప్రదర్శనలు నిర్వహించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది. విద్యార్థులు, విద్యావేత్తలు, ప్రజాతంత్రవాదులు, మేధావులు కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి