ఢిల్లీ విద్యార్థులపై లాఠీఛార్జికి సిపిఐ(యం) ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 20 జూలై, 2026.

ఢిల్లీ విద్యార్థులపై లాఠీఛార్జికి సిపిఐ(యం) ఖండన

నిరసనలకు పిలుపు

ఈరోజు ఢిల్లీలో యువజన, విద్యార్థులపై అమానుషంగా జరిగిన లాఠీచార్జిని, పోలీసులు చేసిన దౌర్జన్యాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. లాఠీచార్జికి ఆదేశమిచ్చిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నది.

గత 23 రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో నిరసనదీక్ష చేస్తుంటే స్పందించనటువంటి ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కాలనే ప్రయత్నం చేయడం అప్రజాస్వామికం. నీట్ ఎగ్జామ్స్ లీకేజీ కారణంగా అనేకమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది మానసిక క్షోభకు గురయ్యారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారానికి వచ్చాక 22 సార్లు పరీక్షల వైఫల్యం జరిగింది. అయినా సిగ్గు లేకుండా ధర్మేంద్ర ప్రధాన్ మంత్రిగా కొనసాగడం సిగ్గుచేటు. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దేశమంతటా ఆయన రాజీనామా చేయాలని కోడై కూస్తున్నా సరే ప్రధానమంత్రి అతనిని అక్కున చేర్చుకొని కాపాడటం దేశానికే తలవంపులు తెచ్చింది.

ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు, సిజెపి తదితర సంఘాలను ఆహ్వానించి ఉన్నత స్థాయిలో ప్రధానమంత్రి లేదా విద్యాశాఖ క్యాబినెట్ మంత్రి స్థాయిలో చర్చలు జరిపి దానికి పరిష్కారానికి ముఖ్యంగా పరీక్షల విధానంలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలి. 

మన రాష్ట్ర ఎంపీలు ఈ లాఠీచార్జికి నిరసనగా గళం విప్పాలి. ప్రతిపక్షాలతో కలిసి ఈ విద్యా విధానాన్ని పరీక్షా విధానంలో ఉన్న లొసుగులను సరిదిద్దడానికి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేయాలని, విద్యార్థుల తరపున నిలబడాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి