
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 21 జూలై, 2026.
ప్రయివేటు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలపై ముఖ్యమంత్రి వివరణ సరికాదు
జివో 396 వెంటనే రద్దు చేయాలి
రాష్ట్రంలో పి3 పేరుతో ప్రైవేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వివరణ సంతృప్తికరంగా లేదు. ప్రయివేటు ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, అందుకోసం విడుదల చేసిన 396 జీవోను రద్దు చేయాలని సిపిఐ(యం) రాష్ట్రకమిటీ డిమాండ్ చేస్తున్నది. అనేక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి. అందుకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే రిజిస్ట్రేషన్ ఆఫీసులు కొనసాగించడానికి బదులు ఇంట్లో ఎలుకలున్నాయని ఇంటినే తగలబెట్టే వైఖరి సరైంది కాదు. రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ఆధునీకరించడం కూడా అవసరమే. కానీ ఆ పేరుతో ప్రయివేటుకిస్తే అవినీతి, అక్రమాలు మరింతగా పెరుగుతాయని అనుభవం తెలియజేస్తున్నది. ఆధార్, పాస్‌పోర్టు సేవలతో రిజిస్ట్రేషన్లను పోల్చడం సరికాదు. ఆధార్ ఒక గుర్తింపు పత్రం, అలాగే పాస్‌పోర్టు విదేశీ ప్రయాణానికి అనుమతి పత్రం అని విదేశాంగ శాఖ ఇటీవల పేర్కొంది. కానీ రిజిస్ట్రేషన్ కోట్ల రూపాయల స్థిరాస్తికి సంబంధించినది. అలాగే ఇతర సేవలు కూడా కీలకమైనవే. పాస్‌పోర్టు గడువు పదేళ్ళు కాగా, ఆధార్ కూడా ఆయా సందర్భాల్లో మార్చవలసి ఉంటుంది. కానీ రిజిస్ట్రేషన్ పత్రాలు ఆ చంద్రతారార్కం ఉంటాయి. కాబట్టి వాటిని సరిపోల్చడం తగదు.
రాష్ట్రంలో భూ వివాదాలు పెద్ద సంఖ్యలో ఉండడమే కాక కొత్త రూపాల్లో ముందుకొస్తున్నాయి. 22 ఏ- అంటే చుక్కల భూముల పేరుతో అనేక చిక్కులు, అదేవిధంగా గతంలో డి పట్టా భూములను ఫ్రీ హోల్డ్ చేయడం, అడ్డగోలు మ్యుటేషన్లు వంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. సోమవారం నాటి దినపత్రికల్లోనే శ్రీకాకుళం, నంద్యాల జిల్లాలలో రెవెన్యూ, సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జరిగిన అక్రమాల మూలంగా కోట్ల రూపాయల విలువచేసే భూములు కబ్జాకు గురైనాయనే వార్తలు ప్రచురితమయ్యాయి. ప్రయివేటుకిస్తే ఇలాంటి ఘటనలు ఇంకా పెరుగుతాయి. ప్రైవేటు అంటేనే లాభాపేక్ష. అలాగే అదుపు ఆజ్ఞలకు లోబడి నిబద్ధతగా వ్యవహరిస్తారన్న నమ్మకం లేని పరిస్థితి. భూములు అందునా పట్టణ భూముల విలువలు విపరీతంగా పెరిగిన పరిస్థితుల్లో కీలకమైన రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రైవేటు వారి చేతిలో పెట్టడం దారుణం. ఏ ప్రయోజనాలను ఆశించి ప్రైవేటీకరణ చేస్తున్నామని జీవో 396లో పేర్కొన్నారో ఆ పనులన్నీ ఇప్పుడు ఆధునిక సర్వర్ల వినియోగంతో అమలు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టడానికి ప్రైవేటుతో సేవల వేగం పెరుగుతుందని చెప్పడం మోసపూరితం. అదే విధంగా పెద్ద సంఖ్యలో ఉన్న డాక్యుమెంట్ రైటర్లు కూడా ఉపాధి కోల్పోతారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
