
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 21 జూలై, 2026.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: 1/70పై సుప్రీం కోర్టులో ఇంప్లీడ్ కావాలని, ఈ చట్టాన్ని పకడ్భందీగా అమలు చేయాలని, జివో నెం 3కి ప్రత్యామ్నాయ జి.వో ప్రకటించాలని కోరుతూ...
అయ్యా!
గిరిజన హక్కులకై ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యతనిస్తుందని దీనిపై ఎవరూ ఆందోళన, అనుమానాలకు గురికావాల్సిన అవసరం లేదని మీరు సమీక్షా సమావేశంలో ప్రకటించారు. ఇలాంటి కంటితుడుపు ప్రకటన వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. 1/70 చట్టానికి సంబంధించి గిరిజనేతరులు సుప్రీం కోర్టులో కేసువేసి ఉన్నారు. దీనిమీద రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. దీనితో గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 1/70 తుంగలోకి తొక్కి ఏకపక్షంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొయ్యురు, హుకుంపేట, అనంతగిరి మండలాల్లో పంప్డ్ స్టోరేజీలకు నవయుగ, అదానీ కంపెనీలకు అనుమతులిచ్చారు. అలాగే చింతపల్లి, జికెవీధి మండలాల్లో బాక్సైట్ తదితర ఖనిజాల వెలికితీత పేరుతో మట్టి నమÖనాలు సేకరించడానికి ప్రయివేటు కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో కేంద్రం అనుమతినిచ్చింది. దీనితో గిరిజనులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
గత ఎన్నికల సందర్భంగా జివో.నెం.3కి బదులుగా ప్రత్యామ్నాయ జివో తీసుకువచ్చి యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అరకు సభలో హామీ ఇచ్చారు. గత రెండేళ్లుగా ప్రత్యామ్నాయ జివో కోసం వీరంతా ఎదురుచూస్తున్నారు. అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీనితో యువతీ, యువకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గిరిజనులు సాగు చేసుకున్న భూములకు అటవీ హక్కుల చట్టం ప్రకారంగా పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నది. ఏజెన్సీ గ్రామాల్లో మంచినీరు, రోడ్లు వంటి మౌళిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పటికీ గర్భిణీ స్త్రీలు కాన్పుకోసం డోలీల్లోనే ఆస్పత్రికి పోతున్నారు.
పిఎం జన్‌మన్ పథకం కింద పివిటిజీలకు ఇళ్లు మంజూరు చేశారు. నేటికీ ఇళ్లు పూర్తి కాలేదు. ప్రతి ఇంటికి లక్ష బకాయి ఉంది. ఇళ్లకు మంజూరైన నిధుల్లో అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలి. 21శాతం పోలవరం నిర్వాసితులకే పరిహారం, ఆరఅండఆర్ ఇచ్చారు. ఆరఅండఆర్ కాలనీల్లో ఎలాంటి కనీస సౌకర్యాలు లేవు. ఫలితంగా గిరిజనులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాము.
గిరిజన సంఘాల భాగస్వామ్యంతో 1/70 చట్టం, జివో.నెం3 గురించి వీలైనంత త్వరలో చర్చిస్తామని పత్రికల ద్వారా తమరు ప్రకటించారు. ఈ నెల 24న పోలవరం జిల్లా రంపచోడవరం పర్యటనలో 1/70, జివో.నెం.3, స్పెషల్ డీఎస్సీ, అటవీ హక్కుల పట్టాలు, పోలవరం నిర్వాసితుల సమస్యలు వంటి వాటిపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిందిగా కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
